గత ప్రభుత్వాల కాలంలో ధాన్యం కొనుగోలు జరగలేదని, కేసీఆర్ సీఎం అయ్యాకే ధాన్యం కొనుగోలు జరుగుతున్నాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రైతుల కోసం మాత్రమే సీఎం వేల కోట్లు ఖర్చు చేసి ధాన్యం కొనుగోలు చేస్తున్నారన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ యాసంగి పంటల కొనుగోలు కోసం మొట్టమొదటి సారిగా వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం రాయపర్తి మండల కేంద్రంలోని పీఏసీఎస్ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. తొర్రూరు మండలం కర్కాల గ్రామంలో, పెద్ద వంగర మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి ప్రారంభించారు. అనంతరం పెద్ద వంగర లో రంజాన్ సందర్భంగా ముస్లింలకు బట్టలు పంపిణీ చేశారు. అనంతరం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. రైతులకు పంటల కోసం ఎదురు పెట్టుబడి పెడుతున్న ప్రభుత్వం సీఎం కేసీఆర్ ది అన్నారు.
రాష్ట్రంలో ఈ యాసంగిలో 7 వేల ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, గత వానాకాలంలో కోటి టన్నుల వరి ధాన్యాన్ని సేకరించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో 24 లక్షల టన్నుల నుండి కోటి 41 లక్షల టన్నులకు వరి ధాన్యం ఉత్పత్తి పెరిగింది, 3 లక్షల ఎకరాల నుండి 65 లక్షల ఎకరాలకు వరి సాగు విస్తీర్ణం పెరిగిందన్నారు. గత 8 ఏళ్ళల్లో కోటి 7 లక్షల కోట్ల రూపాయలను వరి ధాన్యం సేకరణ కోసం పెట్టుబడి పెట్టడం జరిగిందన్నారు. ఈ యాసంగిలో 15 కోట్ల రూపాయలతో వరి ధాన్యం సేకరణ చేస్తున్నామన్నారు. ఈ యాసంగిలో వరి ధాన్యం మద్దతు ధరను ఏ గ్రేడ్ ధాన్యానికి 2 వేల 60 రూపాయలు, బి గ్రేడ్ ధాన్యానికి 2 వేల 40 రూపాయలు నిర్ణయించడం జరిగిందన్నారు. రైతుల కోసం సీఎం కేసీఆర్ చేసినంత దేశంలో ఇప్పటి వరకు ఎవరూ చేయడం లేదన్నారు. రైతును రాజును చేయాలని సీఎం ఆశిస్తున్నారు.. సీఎంకు, మన ప్రభుత్వానికి మనమంతా అండగా ఉండాలన్నారు. కర్కాల గ్రామానికి 9 లక్షలతో బ్రిడ్జిని మంజూరు చేసినట్లు మంత్రి ప్రకటించారు. అలాగే రాయపర్తిలో మంత్రి కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. రాయపర్తిలో దళిత రత్న అవార్డును పొందిన అయిత యకయ్యను మంత్రి సన్మానించి అభినందించారు.