Friday, November 22, 2024

Delhi | రైతులను కేంద్రమే ఆదుకోవాలి.. వ్యవసాయ కార్మిక సంఘం నేత బి. వెంకట్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: అకాల వర్షాలతో పంట నష్టపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలుగు రాష్ట్రాల రైతులను కేంద్ర ప్రభుత్వమే ఆదుకోవాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి. వెంకట్ అన్నారు. శుక్రవారం ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన తెలుగు రాష్ట్రాల్లో రైతుల సమస్యలపై ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యాన్ని మొత్తం కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కేవలం రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే రైతులను ఆదుకోలేదని, రాష్ట్రాలకు కేంద్రం చేయూతనివ్వాలని ఆయనన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకోవాలని సూచించారు.

రైతులను ఆదుకోవాలని పవన్ కళ్యాణ్, చంద్రబాబు మాట్లాడుతున్నారని, కానీ ఈ విషయంలో వారిద్దరూ కేంద్ర ప్రభుత్వ ప్రస్తావన తీసుకురావడం లేదని అన్నారు. పవన్, బాబు ఇద్దరూ రైతులను ఆదుకోవాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని సూచించారు.

నిరంకుశత్వం నిలబడదు జీవో నెంబర్ 1పై జగన్ క్షమాపణ చెప్పాలి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 1 రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు తీర్పునివ్వడం హర్షనీయమని వెంకట్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నియంతృత్వంగా, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని హైకోర్టు తన తీర్పు ద్వారా చెప్పిందని అన్నారు. స్వాతంత్ర్య పోరాటాన్ని అణచివేసేందుకు బ్రిటీష్ పాలకులు తీసుకొచ్చిన జీవోను జగన్ ప్రభుత్వం అమలు చేస్తోందని మండిపడ్డారు. ప్రజలు సభ పెట్టుకునే ప్రాథమిక హక్కును సైతం ఈ జీవో కాలరాస్తోందని చెప్పారు. ఒకప్పుడు 400 సీట్లు గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత పరిస్థితి ఏంటో జగన్ గుర్తు చేసుకోవాలని, నిరంకుశంగా వ్యవహరిస్తే కాంగ్రెస్ కు పట్టిన గతే జగన్మోహన్ రెడ్డికి కూడా పడుతుందని హెచ్చరించారు. జీవో నంబర్ 1 ద్వారా నేతలపై పెట్టిన కేసులను ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని, ఈ జీవోను తీసుకొచ్చినందుకు జగన్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement