రైతులు జాతీయ రహదారిపై ఆందోళన చేసే హక్కు ఉందని హర్యానా ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం తెలిపింది. రైతుల ఉద్యమం కారణంగా రహదారులను మూసివేయడంపై పంజాబ్- హర్యానా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాకుండా, ఈ విషయంలో పంజాబ్ ప్రభుత్వంపై కూడా కోర్టు మండిపడింది.
కాగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ డిమాండ్లతో రైతులు మరోసారి ఢిల్లీ బాట పట్టారు. దీంతో హర్యానాలో సరిహద్దుల మూసివేత, ఇంటర్నెట్ సేవలను నిషేధించడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జీఎస్ సంధావాలియా, జస్టిస్ లుపితా బెనర్జీలతో కూడిన ధర్మాసనంలో ఈ అంశంపై విచారణ చేశారు. ఈ కేసులో విచారణ సందర్భంగా హర్యానా అదనపు అడ్వకేట్ జనరల్ దీపక్ సబర్వాల్ కోర్టులో మాట్లాడుతూ.. నిరసనకారులు 4 వేలకు పైగా ట్రాక్టర్ తో ఆందోళనకు దిగడంతోనే ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుందని చెప్పారు.
ఇక, రైతుల తరపున న్యాయవాది ఉదయ్ ప్రతాప్ సింగ్ మాట్లాతూ.. కేంద్ర ప్రభుత్వం గతంలో చేసిన చట్టాలను సవరించాలనే శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళ్తుండగా అడ్డగించారిన తెలిపారు. దీంతో పాటు 144 సెక్షన్ విధించడం.. హర్యానాలోని కొన్ని జిల్లాల్లో బారికేడ్లు అమర్చడం ప్రజాస్వామ్య భావాలను అణిచివేసే ప్రయత్నమని ఆయన పేర్కొంది. అయితే, రేపటి (గురువారం)లోగా స్టేటస్ రిపోర్టు ఇవ్వాలని హర్యానా- పంజాబ్ ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. అలాగే, ఈ విషయంలో కిసాన్ మజ్దూర్ మోర్చా, యునైటెడ్ కిసాన్ మోర్చా (నాన్-పొలిటికల్) నుంచి ప్రతిస్పందనను కూడా న్యాయస్థానం కోరింది.