Saturday, September 21, 2024

రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం కొనుగోలు చేయాలి.

ప్రభన్యూస్, జ‌నగామ : ప్రతిష్ఠాత్మకంగా రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సీఎం కెసిఆర్ నిర్ణయించినందున రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం కొనుగోలు చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశించారు.బుధవారం జిల్లాలో ధాన్యం కొనుగోలు పై జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులు, రైస్ మిల్లర్ల తో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు..ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…
ప్రభుత్వం రైతుల వద్ద ధాన్యాన్ని కొనుగోలు చేయనున్నందున కేంద్రాలను తక్షణం ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి కొనుగోలు కేంద్రానికి ఇంచార్జ్ లను నియమించాలని తెలిపారు.రైతులకు అధికారులు సహకరించాలని, మిల్లర్లు ఇబ్బందులకు గురిచేయరాదని, హమాలీల కొరత రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మిల్లర్లు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.

అధికారులు సమన్వయంతో పనిచేయాలి..

రైతులకు సమృద్ధిగా నీరు, 24 గంటల విద్యుత్, రైతు బంధు, రైతు బీమా, అందుబాటులో విత్తనాలు, ఎరువులను పంపిణీ చేసినందున పంటల దిగుబడి గణనీయంగా పెరిగిందన్నారు. అధికారులు సమన్వయంతో పరస్పర సహకారంతో పని చేయాలని, ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ. 1960కు కొనుగోలు చేయాలన్నారు. ప్రతి గ్రామానికి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తున్నామని రైతులు ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.రైతులు ఒకేసారి ధాన్యాన్ని మార్కెట్ కు తీసుకు రాకుండా అధికారులు రైతులను అవగాహన పరచాలని, పంట కోసిన ప్రతి రైతుకు టోకెన్లు ఇచ్చి, క్రమ పద్ధతిలో కొనుగోలు చేయాలన్నారు.5 లక్షల గన్నీ బ్యాగులు సమకూర్చుకోవాలని, రవాణాలో పక్కా ప్రణాళికతో కొనుగోలు చేసిన ధాన్యం కేంద్రాలలో నిల్వ చేయకుండా ఎప్పటికప్పుడు వెసలుబాటు ను బట్టి ట్రాక్టర్ లతోను, లారీల తోను తరలించాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో టర్పలిన్ షీట్లు, తేమను కొలిచే యంత్రాలు, పాడి క్లీనర్స్, తూకం యంత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలి. అదే విధంగా రైతులకు వడదెబ్బ తగలకుండా త్రాగునీరు, టెంట్ ఏర్పాటు చేయాలని, ఓ.ఆర్.ఎస్. ప్యాకెట్లను, మందులను అందుబాటులో ఉంచాలన్నారు.అందుబాటులో గోదాములు లేకపోతే, రైతు వేదికలు, ప్రభుత్వ భవనాలను తాత్కాలికంగా వినియోగించుకోవాలన్నారు.రైస్ మిల్లర్ల తో కలిసి సమన్వయం పెంచుకోవాలన్నారు.ఒక టోల్ ఫ్రీ నెంబర్ ను ఏర్పాటు చేసి సమస్యలు వస్తే వెంట వెంట పరిష్కరించాలని, రోజువారీగా సమీక్షించుకుంటు అధికారులు పర్యవేక్షించాలన్నారు.

జనగామ జిల్లాలో…

లక్షా,68వేల 105 ఎకరాలలో పంట పండిందని, దిగుబడి అంచనా 2 లక్షల 75 వేల మెట్రిక్ టన్నుల అంచనాలతో ఐ.కె.పి. నుండి 119 కేంద్రాలు, సహకరసంఘాల ద్వారా71కేంద్రాలు మ్యాక్స్ ద్వారా ఒకటి మొత్తంగా 191 కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు.ఈ సమీక్ష సమావేశంలో జనగామ జెడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, జనగామ ఎమ్మెల్యే ముత్తి రెడ్డి యాదగిరి రెడ్డి, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు, కలెక్టర్ శివ లింగయ్య, అడిషనల్ కలెక్టర్లు భాస్కర్ రావు, హమీద్, రైతు బంధు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు ఇర్రి రమణా రెడ్డి, జనగామ మార్కెట్ చైర్ పర్సన్ బాల్దే విజయ, డీసీపీ సీతారాం, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement