హైదరాబాద్, ఆంధ్రప్రభ : అసాని తుఫాన్ నేపథ్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, డీసీఎస్వోలు, డీఎంలు అప్రమత్తంగా ఉండి కొనుగోలు కేంద్రాల్లో వర్షానికి ధాన్యం తడవకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వెంట వెంటనే మిల్లులకు తరలించాలని, స్టోరేజ్ కొరత ఉన్న చోట్ల గోడౌన్లను లీజుకు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. బుధవారం హైదరాబాద్‌లోని తన కార్యాయంలో ఉన్నతాధికారులతో మంత్రి గంగులు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రాలు, అందుబాటులో ఉన్న గన్నీబ్యాగ్‌లు, కొనుగోలు చేసిన ధాన్యం వివరాలతో కూడిన శ్వేతపత్రాన్ని ఆయన విడుదల చేశారు. రాష్ట్రంలో ధాన్యం సేకరణ సజావుగా సాగుతుందని మంత్రి గంగుల తెలిపారు. కొనుగోలులో ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేవని, పుకార్లు, గాలిమాటల్ని రైతులకు ఆయన సూచించారు. సిఎం కేసీఆర్ మూడు వేల కోట్ల రూపాయల నష్టాన్ని భరించి కొనుగోళ్ళకు ఆదేశించారని ఆయన చెప్పారు. రాష్ట్రంలో 8 కోట్ల 85 లక్షల గన్నీబ్యాగులు అందుబాటులో ఉన్నాయన్నారు. అందులో ఇప్పటికే 2.5 గన్నీలను మాత్రమే వాడామని, ఇంకా 6.35 కోట్ల గన్నీలు అందుబాటు ఉన్నాయన్నారు. వీటి ద్వారా మరో 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనగలమని ఆయన తెలిపారు.
2,77,866 టార్పాలిన్లు, 11,523 వెయింగ్ మిషన్లు,11,000 మాయిశ్చర్ మీటర్లు, 4,958 పాడి క్లీనర్లు అందుబాటులో ఉన్నాయన్నారు. రాష్ట్రంలో ఈనెల 10వ తేదీ నాటికి 5774 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని, 28 జిల్లాలో 3760 కేంద్రాల్లో కొనుగోళ్ళు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ఈ కేంద్రాల ద్వారా 1 లక్షా 56 వేల మంది రైతుల నుంచి 2121 కోట్ల విలువైన 11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు తరలించామన్నారు. యాసంగి, వానాకాలం ధాన్యం సీఎంఆర్ గడువులోపు పూర్తి చేయాలని అధికారులను మంత్రి గంగుల ఆదేశించారు. ధాన్యం కొనుగోలుపై అప్రమత్తంగా ఉన్నామని, ఇప్పటి వరకు రైతుల నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు. కొనుగోళ్ళలో ఏదైనా ఇబ్బంది ఉంటే 180042500333 నెంబర్‌తో పాటు 1967 టోల్ ఫ్రీ నెంబర్లను సంప్రదించాలని రైతులను ఆయన కోరారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..