Monday, November 25, 2024

Big story | రైతన్నలు జర జాగ్రత్త…. మార్కెట్లను ముంచెత్తిన నకిలీ విత్తనాలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లోనూ నకిలీ విత్తనాలు మార్కెట్లను ముంచెత్తాయి. బ్రాండెడ్‌ విత్తన కంపెనీల ముసుగులో నకిలీ విత్తనాలు అమ్ముకునేందుకు విత్తన మాఫియా సిద్ధమైంది. ఏటా మాదిరిగానే ఈసారి కూడా పనికిమాలిన విత్తనాలను కట్టబెట్టి రైతులను నిండా ముంచే ముఠాల ఆగడాలు రాష్ట్ర వ్యాప్తంగా అడ్డుఅదుపులేకుండా కొనసాగుతున్నాయి. పోలీసులు, వ్యవసాయశాఖ అధికారులు, టాస్క్‌ ఫోర్స్‌ బృందాలుదాడులు నిర్వహిస్తున్నా నకిలీ విత్తనాల అమ్మకం యథేచ్ఛగా కొనసాగుతోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రకరకాల డి స్ట్రిబ్యూషన్‌ కంపెనీల పేరు మీద బ్రాండెడ్‌ కంపెనీల లోగోలతో దర్జాగా నకిలీ విత్తనాల అమ్మకాలు కొనసాగుతున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వం నకిలీ విత్తనాల తయారీపై ఉక్కుపాదం మోపుతున్నా, సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు విత్తన మాఫియా నిందితులపై పీడీ యాక్టు కేసులు నమోదు చేసున్నా ఫలితం అంతంతమాత్రంగానే ఉందని పలు ఎన్‌జీవోలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం వానాకాలం సీజన్‌ సమీపించిన నేపథ్యంలో తెలంగాణలో నకిలీ విత్తనాల హవా కొనసాగుతూనే ఉంది. సరిహద్దు రాష్ట్రాల నుంచి యథేచ్ఛగా కాలం చెల్లిన, నాసిరకం విత్తనాలు తెలంగాణలోని అన్ని ప్రాంతాల రైతులకు అందుబాటులోకి వచ్చేశాయి. తక్కువధర, అధిక దిగుబడి, త్వరగా పంట చేతికొస్తుందని రైతులను నమ్మిస్తున్న వ్యాపారులు అన్నదాతలను నిండా ముంచుతున్నారు.

- Advertisement -

కొంతమంది ఏజెంట్లను పెట్టుకుని మరి నేరుగా గ్రామాల్లోకే వచ్చి రైతులకు నకిలీ విత్తనాలను అంటగడుతున్నారంటే విత్తన మాఫియా ఆగడాలు ఏస్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ప్రముఖ కంపెనీల బొమ్మ చూపించి భారీ దిగుబడిని ఎరగా వేసి రైతులకు విక్రయిస్తున్నారు. అమ్మిన విత్తనాల తాలూకు రశీదును కూడా ఇవ్వడం లేదు. విత్తన భాండాగారంగా అవతరించిన తెలంగాణకు ఎక్కువ మత్తంలో ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్‌, కర్ణాటక, ఛత్తీస్‌గడ్‌, గుజరాత్‌ రాష్ట్రాల నుంచే నాసిరకం విత్తనాలు సరఫరా అవుతున్నాయి. నకిలీ విత్తనాల కట్టడికి రాష్ట్రాల సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినా ఫలితం ఉండడం లేదు. ఎక్కువశాతం నకిలీ విత్తనాలు రైళ్ల ద్వారానే రవాణా అవుతున్నట్లు తెలుస్తోంది. ప్రతీ వ్యవసాయ సీజన్‌లో రాష్ట్రంలోని దాదాపు 5లక్షల మందికి తక్కువ కాకుండా వివిధ పంటలను సాగు చేసే రైతులు నకిలీ విత్తనాలతో నష్టాలను చవిచూస్తున్నారు.

తెలంగాణలో ఏటా 50లక్షలకు పైగా క్వింటాళ్ల విత్తనాలు అవసరం. రాష్ట్రంలో ప్రధాన పంట వరి కాగా… పత్తి, మొక్కజొన్న, మిరప తదితర పంటలు సాగవుతున్నాయి. దీంతో మేలురకం విత్తనాలకు భారీగా డిమాండ్‌ ఉండడంతో రైతుల అవసరాలను, వ్యవసాయంలో అదనులో విత్తనం నాటటం వంటి అంశాలను ఆసరాగా చేసుకుంటునర్న నకిలీ వ్యాపారులు వరి, పత్తి, మొక్కజొన్న, మిరప తదితర పంటల తాలూకు నకిలీ విత్తనాలను యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నిత్యం ఏదో ఒకచోట నకిలీ విత్తనాల అమ్మకాల రాకెట్‌ బయటపడుతూనే ఉంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ నకిలీ విత్తన మాఫియా నెట్‌ వర్క్‌ పలు రాష్ట్రాల్లో విస్తరించడం, పక్కా నెట్‌వర్క్‌తో రైతులను మోసాలకు గురిచేస్తుండడంతో నామమాత్రపు దాడులు, కేసులతో ప్రయోజనం లేకుండా పోతోందని వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవల వరంగల్‌లో నకిలీ విత్తన సిండికేట్‌ బయటపడింది. పోలీసులు వరంగల్‌లో తీగలాగితే నాలుగు రాష్ట్రాల్లో డొంక కదిలింది. ఆ దాడుల్లో ఏకంగా 2కోట్ల 11లక్షల రూపాయల విలువైన నకిలీ పత్తివిత్తనాలను సీజ్‌ చేశారు. గుజరాత్‌కు చెందిన ఒక లైసెన్స్‌డ్‌ కంపెనీ పేరు మీద కర్ణాటకలో నకిలీ విత్తనాలు తయారు చేస్తున్నట్లుగా విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో నకిలీ విత్తన మాఫియాను నియంత్రించడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన వ్యవస్థలను, విధానాలను, చట్టాలను రూపొందించాల్సిన అవసరం ఉందని రైతులు, వ్యవసాయశాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో రుషి సీడ్స్‌, శ్రీ గణేష్‌ సీడ్స్‌ పేర్లతో వచ్చేవన్నీ నకిలీ పత్తి విత్తనాలని, వాటిని కొనుగోలు చేయొద్దని రైతులను పోలీసులు, వ్యవసాయశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఇటీవలే సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో 7 మంది సభ్యుల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. పావని బ్రాండ్‌ పేరుతో నకిలీ విత్తనాలను విక్రయిస్తున్నట్లు తేలింది. మేలురకం విత్తనాలను గుర్తింపు పొందిన వ్యాపారుల నుంచే కొనుగోలు చేయాలని రైతులకు వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. విత్తనాల కొనుగోలు సమయంలో రశీదును తప్పకుండా తీసుకోవాలని స్పష్టం చేస్తున్నారు. విత్తన ప్యాకెట్లను వాటి తయారీ, ఉత్పత్తి, ఎక్స్‌పైరీ వంటి అన్ని విషయాలు సమగ్రంగా ఉన్నాయో లేదో చూసుకుని కొనుగోలు చేయాలని తేల్చి చెబుతున్నారు. ఎలాంటి సందేహం వచ్చినా వెంటనే మండల వ్యవసాధికారులను సంప్రదించాలని సూచిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement