ఉమ్మడి వరంగల్, ప్రభన్యూస్ బ్యూరో: వరి సాగుచేసిన రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే క్వింటాకు 500 రూపాయలు బోనస్ కలిపి ఇస్తామని ఎన్నికల సందర్భంగా ప్రకటించారు. అనుకున్నట్లుగానే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. డిసెంబర్ 9 తర్వాత వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం మద్దతు ధరకు అదనంగా 500 రూపాయలు కలిపి ఇస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటుందా అనే ఆందోళన రైతుల నుంచి వ్యక్తం అవుతున్నది.
ఇప్పటికే రెండు హామీలను ఆరోగ్యశ్రీ పథకం అమలుతోపాటు ఆడబిడ్డలకు మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభిస్తూ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని ప్రారంభించారు. రెండు గ్యారంటీలను నిలబెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీని కూడా వెంటనే అమలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో రైతులు ధాన్యం అమ్ముకోకుండా నిలువ చేసుకోండి.. అధికారంలోకి రాగానే బోనస్ కల్పిస్తామన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తుందా.. లేదా? అని రైతులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో 8 లక్షల ఎకరాలలో వరి సాగు
ఉమ్మడి వరంగల్ జిల్లాలో 8 లక్షల ఎకరాల్లో రైతులు వరి పంటను సాగు చేశారు. ఇప్పటికే సుమారు రెండు లక్షల ఎకరాల్లో వరికోతలు కోసి ధాన్యం నిలువలు కొనుగోలు కేంద్రాల్లో ఉన్నాయి. కొంతమంది రైతులు తమ పంట పొలాల్లోనే ధాన్యం నిలువ చేసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సందర్భంగా ధాన్యం అమ్ముకోవద్దని, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే బోనస్ కల్పిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధాన్యం అమ్ముకోకుండా నిలువ చేశారు.
ఎకరానికి సగటున 20 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వస్తుంది. ఈ లెక్కన ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక కోటి 60 లక్షల క్వింటాల ధాన్యం ఉత్పత్తి అవుతుందని రైతులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం వరికి ఏ-గ్రేడ్ ధాన్యానికి క్వింటాకు 2,230 రూపాయలు మద్దతుగా ప్రకటించింది. కామన్ గ్రేడ్ ధాన్యానికి 2,200 రూపాయలను ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తామన్న క్వింటాకు 500 రూపాయల బోనస్ కలిపి ఇస్తే క్వింటాకు 2,700 రూపాయల ధర లభిస్తుందని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
బోనస్ తక్షణమే అమలు చేయాలి
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తక్షణమే వరికి బోనస్ ప్రకటిస్తామని ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటుందని ఆశతోనే అధికార బీఆర్‌ఎస్ పార్టీని కాదని కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చామని రైతులు చెప్తున్నారు. క్వింటాకు 500 రూపాయలు బోనస్ చెల్లిస్తే కనీసం ఎకరాకు పదివేల రూపాయల లాభం వస్తుందని రైతులు చెప్తున్నారు.
గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2004లో ప్రభుత్వం ఏర్పడిన సందర్భంగా వరికి 200 రూపాయల బోనస్ ఇస్తామని వెంటనే అమలు చేశారని రైతులు గుర్తు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రైతులకు బోనస్ చెల్లించి ఆదుకోవాలని కోరుతున్నారు.
గత ఏడాది మే 6న వరంగల్‌లో జరిగిన రైతు గర్జన సభలో వరికి క్వింటాకు 2,500 రూపాయలు మద్దతు ధర కల్పిస్తామని రాహుల్ గాంధీ సభ వేదికగా రైతు డిక్లరేషన్ ప్రకటించారని గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వరికి క్వింటాకు 2,500 రూపాయల మద్దతు ధరతోపాటు అదనంగా ఇస్తామన్న 500 రూపాయల బోనస్ కలిపితే వరికి క్వింటాకు 3,000 రూపాయల మద్దతు ధర రైతుకు లాభసాటిగా ఉంటు-ందని రైతుల అభిప్రాయపడుతున్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాకు రూ. 80కోట్ల అదనపు ఆదాయం
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే ఈ ఏడాది వానాకాలం పంటలకు రైతులు సాగుచేసిన ఒక కోటి 60 లక్షలు ఎకరాలకు 80 కోట్ల రూపాయల అదనపు ఆదాయం లభిస్తుందని రైతులు చెబుతున్నారు. ప్రభుత్వ మద్దతు ధర, బోనస్ కలిపి ఎకరాకు సగటున 54,000 వరకు ఆదాయం వస్తుందని రైతులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేయకుండా వెంటనే ఇస్తామన్న బోనస్ 500 రూపాయలను అమలు చేయాలని రైతుల డిమాండ్ చేస్తున్నారు.