Tuesday, November 26, 2024

అడుగడుగానా అడ్డంకులు.. మిల్లర్ల తీరుతో విసిగిపోతున్న రైతులు, అధికారులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఆరుగాలం కష్టించి పంట పండించిన రైతులకు గిట్టుబాటు ధర కల్పించి వారు అప్పుల ఊబిలో కూరుకుపోకుండా కాపాడే లక్ష్యంతో దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ధాన్యం కొనుగోళ్లకు రాష్ట్రంలోని రైస్‌ మిల్లర్ల తీరు అడుగడుగునా ఆటంకాలను సృష్టిస్తోంది. ఇప్పటిటీ గడువు పై గడువు పొడిగించినా సకాలంలో సీఎంఆర్‌ అందించకుండా, ధాన్యం అన్‌లోడింగ్‌ సమయంలో తరుగు పేరుతో క్వింటాకు 10కిలోల దాకా తగ్గిస్తూ ఇలా అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్న మిల్లర్లు తాజాగా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసేది లేదని తెగేసి చెబుతున్నారు. తడిసిన ధాన్యాన్ని కొనేది లేదని నిజామాబాద్‌ జిల్లా రైస్‌ మిల్లర్లు ఏకంగా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయడంపై పౌరసరఫరాలశాఖ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కనివినీ ఎరగని ప్రకృతి విపత్తుతో రైతులు అల్లాడుతున్నా తమ వ్యాపారమే తమకు ముఖ్యం అన్ని రీతిలో మిల్లర్లు వ్యవహరిస్తుండడం పలు విమర్శలకు తావిస్తోంది.

ఒకటి, అరశాతం తేమ అధికంగా ఉన్నా వెనక్కి…

రైతులు ఆరుగాలం కష్టించి సాగు చేసిన పైరు నుంచి పంట చేతికందే సమయంలో అకాల వర్షాలు కోలుకోలేని దెబ్బతీశాయి. కోసిన తర్వాత ధాన్యంలో తేమ ఉండడం సాధారణమే. అయితే వాతావరణం సహకరించకపోవడంతో ధాన్యాన్ని 17శాతం లోపే తేమ మేరకు ఆరబోయడం రైతులకు సవాల్‌గా మారింది. ఈ పరిస్థితుల్లో 17శాతం కంటే ఒకటి, అరశాతం తేమ ఎక్కువగా ఉన్నా మిల్లర్లు నిర్ధాక్షిణ్యంగా ధాన్యాన్ని వెనక్కు పంపిస్తున్నారు. ఖమ్మం జిల్లా లోని వైరా, కూసుమంచి మండలాల్లో కాంటా అయిన తర్వాత రైతుల ధాన్యం వెనక్కి వచ్చింది. ధాన్యం మొలకొచ్చిందవనే నెపంతో మిల్లర్లు తిరస్కరించారనిరైతులు వాపోతున్నారు.

ధాన్యంలో తేమ 17శాతం కంటే ఎక్కువగా ఉందని, వర్షానికి తడిచాయని రైతులకు మిల్లర్లు తిప్పి పంపుతుండడంతో పలు జిల్లాల్లో రైతులు, అధికారులు తలలు పట్టుకుంటున్నారు. తడిసిన ధాన్యం ఒకటి, అర శాతం తేమ ఎక్కువగా ఉన్నా కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం మిల్లర్లను ఎన్నిసార్లు కోరినా ఫలితం ఉండడం లేదు. ఒకటి, రెండు బస్తాల్లో మొలకలు వచ్చినా ధాన్యం అంతటిని వెనక్కి పంపిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. మరోవైపు పలు జిల్లాల్లోని కొనుగోలు కేంద్రాల్లో కాంటా అయిన తర్వాత వారం, పది రోజులపాటు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ఉంటుండడంతో తేమ పెరిగి ధాన్యం మొలకెత్తుతోందని, దానికి కూడా మిల్లర్లు, అధికారులు రైతులను బలి చేస్తున్నారన్న ఆగ్రహం వ్యక్తమవుతోంది.

- Advertisement -

సీఎంఆర్‌ ఇప్పటికీ పెండింగే…

గడువులోగా సీఎంఆర్‌ను రైస్‌ మిల్లర్లు పౌరసరఫరాలశాఖకు తిరిగి అప్పగించకపోవడం కొనుగోళ్ల ప్రక్రియను ప్రశ్నార్థకంగా మారుస్తోంది. మిల్లర్లు పథకం ప్రకారమే ధాన్యాన్ని మిల్లింగ్‌ చేయడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మిల్లుల సామర్థ్యాన్ని బట్టి ధాన్యాన్ని కేటాయించినా సకాలంలో మిల్లింగ్‌ కావడం లేదు. ఏప్రిల్‌ 30తో సీఎంఆర్‌ గడువు ముగిసినా ఇంకా గతేడాది 2021-22 రబీకి చెందిన దాదాపు 11లక్షల టన్నుల సీఎంఆర్‌ పెండింగ్‌లో ఉంది. అదే సమయంలో 2022-23 వానాకాలం ధాన్యం తాలూకు సీఎంఆర్‌ కూడా గణనీయంగా పెండింగ్‌లో ఉంది. మూడు, నాలుగుసార్లు సీఎంఆర్‌ గడువు పెంచినా మిల్లర్లు సీఎంఆర్‌ బియ్యాన్ని పూర్తిస్థాయిలో తిరిగి ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్‌ 30 తేదీతో సీఎంఆర్‌ గడువు ముగిసింది. అయినప్పటికీ మిల్లర్లు ఆ బాధలు ఏవో రైతులు, రాష్ట్ర ప్రభుత్వం పడుతుందన్నట్లుగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం పలు విమర్శలకు తావిస్తోంది. ఓ దశలో మిల్లర్లను నమ్ముకుంటే ధాన్యం కొనుగోళ్లు, సీఎంఆర్‌ ప్రక్రియ సజావుగా సాగదన్న నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. ఇతర రాష్ట్రాల్లోని మిల్లులు, గోదాముల్లోనూ తెలంగాణ ధాన్యాన్ని నిల్వ చేయాల్సిన పరిస్థితులు వచ్చాయి.

నాసిరకంగా సీఎంఆర్‌ బియ్యం…

అంతో ఇంతో పూర్తయిన సీఎంఆర్‌ బియ్యంలోనూ మిల్లర్లు అక్రమాలకు పాల్పడుతున్న వైనం పలుచోట్ల వెలుగుచూస్తోంది. పౌరసరఫరాలశాఖతో కుమ్మక్కైన మిల్లర్లు సీఎంఆర్‌ కింద నాసిరకం బియ్యాన్ని సరఫరా చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లకు పంపిణీ చేసే సన్నబి య్యం ముక్కిపోయి వస్తున్నాయని , వాసన వస్తున్నాయని పలు జిల్లాల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. ప్రభుత్వం సూచించిన దానికంటే ఎక్కువ శాతం నూకలు ఉంటున్నట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి. మిల్లర్లు…. ధాన్యం సీఎంఆర్‌ బియ్యాన్ని బహిరంగ మార్కెట్‌లో అక్రమంగా అమ్ముకుంటూ పీడీఎస్‌ బియ్యాన్ని రీసైక్లింగ్‌ చేస్తూ సీఎంఆర్‌ కింద అప్పగిస్తున్నారు. ఈ అంశంపై పౌరసరఫరాల సంస్థ కార్పోరేషన్‌కు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతుండడంతో ఉన్నతస్థాయి విచారణకు పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్‌ రవీందర్‌సింగ్‌ ఆదేశించినట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement