Saturday, November 23, 2024

సంగారెడ్డి కలెక్టరేట్ లో రైతు ఆత్మహత్యా య‌త్నం..

  • ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పటించుకునే యత్నం.. అడ్డుకున్న కానిస్టేబుల్
  • బొరంప‌ట్ల‌ సర్పంచ్ అనుచరుడే తన భూమి కబ్జా చేసున్నాడని రైతు ఆరోపణ
  • ప్రజావాణిలో ఫిర్యాదు చేసేందుకు వస్తే పట్టించుకోవడం లేదని ఆవేదన

ప్రభ న్యూస్ బ్యూరో, ఉమ్మడి మెదక్ : సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రతి సోమవారం జరిగే ప్రజావాణిలో ఓ రైతు తన సమస్యను చెప్పుకునేందుకు వస్తే ఎవరు పట్టించుకోలేదని ఆరోపిస్తూ ఇక తనకు న్యాయం జరగదని భావించి అదనపు కలెక్టర్ రాజర్షి షా ముందే తాను ఇంటి నుండి తెచ్చుకున్న కిరోసిన్ డబ్బాలోని కిరోసిన్ ఒంటి పై పోసుకుని అగ్గిపెట్టే వెలిగించుకునే లోపు అక్కడే ఉన్న పలువురు రైతు చేతిలో ఉన్న అగ్గిపెట్టని లాక్కుని రైతు ఆత్మహత్యా యత్నాన్ని అడ్డుకున్నాడు. అధికారులందరి ముందు రైతు ఒక్కసారిగా ఆత్మహత్యా యత్నానికి ఒడిగట్టడంతో అక్కడున్న వారంతా ఆశ్చ‌ర్యానికి గుర‌య్యారు.

బొరంపట్ల సర్పంచ్ అనుచరుడే నా భూమిని కబ్జా చేశాడు : మల్లేశం, రైతు, బొరంపట్ల
నాది హత్నూర మండ‌లం బోర‌ప‌ట్ల గ్రామం. నాకు బొరంపట్ల గ్రామంలో సర్వే నెంబర్ 379/293 లో ఎకరం భూమి ఉంది. ఒకటే ఎకరం ఉండటం వ్యవసాయం చేస్తే కుటుంబ పోషణ భారమవ్వడంతో కుటుంబంతో సహా సిరిసిల్లలో చేనేతగా పనిచేస్తున్నాను.
నేను స్థానికంగా ఉండకపోవడంతో సర్పంచ్ అంజమ్మ అనుచరుడు దుర్గారెడ్డి కన్ను నా భూమిపై పడింది. నా భూమి ప్రభుత్వ సర్వే నెంబర్ లో వస్తుందని ఆ భూమిలో డ‌బుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం కోసం సర్వే చేయించాడు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం నా భూమిలో సర్వే చేస్తున్నారని నా భూమి పక్కన వారు సమాచారం ఇస్తే నేను సిరిసిల్ల నుండి వచ్చి దుర్గారెడ్డిని ప్రశ్నించగా నాది ప్రభుత్వ భూమేనని ఏమి చేసుకుంటావో చేసుకో అని ద‌బాయించాడు. రాజకీయంగా పలుకుబడి ఉండటంతో అధికారులైనా నా సమస్యను పరిష్కరిస్తారేమోనని వస్తే ప్రజావాణిలో ఎవరు పట్టించుకోవడం లేదు. నా ఆత్మహత్యతో నైనా నా కుటుంబానికి న్యాయం జరుగుతుందేమోనని ఆత్మహత్యా యత్నం చేశా.

విచారణ జరిపి న్యాయం చేస్తాం : రాజర్షి షా, ఆదనపు కలెక్టర్, సంగారెడ్డి
బొరంపట్ల గ్రామానికి చెందిన రైతు జక్క మల్లేశం భూమి స్థానిక సర్పంచ్ అనుచరులు ఆక్రమించుకున్నారని, అందులో డబుల్ బెడ్ రూమ్స్ కోసం సర్వే చేసి ఆక్రమించుకుంటారేమోననే భయంతో మల్లేశం ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించాడు. వెంటనే అడ్డుకున్నాం. రైతు భూమి విషయంలో పూర్తి స్థాయి విచారణ చేసి న్యాయం చేసే విదంగా కృషి చేస్తాం.

Advertisement

తాజా వార్తలు

Advertisement