తమ డిమాండ్లు నెరవేర్చాలని రైతులు మరోసారి ఛలో ఢిల్లీ మార్చ్‌కు పిలుపునిచ్చారు. కొద్దిరోజుల క్రితం చేపట్టిన ఢిల్లీ మార్చ్ ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. దాంతో కొద్దిరోజులు ఆందోళనకు విరామం ఇచ్చారు. తిరిగి ఇవాళ ఢిల్లీ ముట్టడిస్తామని రైతు సంఘాలు స్పష్టం చేశాయి.
కాగా, బస్సు, రైళ్ల ద్వారా ఢిల్లీకి రైతులు బయల్దేరారు. రైతు నేతల ఢిల్లీ ముట్టడి పిలుపు నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. సరిహద్దుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధర, రైతులు, రైతు కూలీలకు పెన్షన్, రైతు రుణమాఫీ, కరెంట్ బిల్లుల టారిఫ్ పెంపుదల నిలిపివేత తదితర డిమాండ్లతో రైతులు కదం తొక్కారు. కిసాన్ మజ్దూర్ మోర్చా, సంయుక్త కిసాన్ మోర్చా నేతృత్వంలో రైతుల ఆందోళన కొనసాగుతోంది. తమ డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు రైతు సంఘాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ నెల 10వ తేదీన దేశవ్యాప్తంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రైల్ రోకో చేపడతామని రైతు నేతలు ప్రకటించారు. 4 గంటల రైల్ రోకో చేపట్టి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని చెబుతున్నారు. రైతు నేతల పిలుపుతో టిక్రి, సింఘు, ఘజిపూర్ సరిహద్దుల్లో పోలీసులు భద్రతను పెంచారు. బస్టాండ్, రైల్వే స్టేషన్, మెట్రో స్టేషన్లలో భద్రతను కట్టుదిట్టం చేశారు.