ఆన్ లైన్ గేమ్స్ ఆడి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని పోలీసులు, ఇతరులు ఎంత మొత్తుకుంటున్నా కొందరు పెడచెవిన పెడుతున్నారు. ఫలితంగా అప్పులపాలై వారి ప్రాణాల మీదకు తెచ్చుకోవడమే కాక కుటుంబసభ్యుల ప్రాణాలను కూడా బలిగొంటున్నారు. తమిళనాడులో ఇలాంటి ఘటనే శుక్రవారం చోటు చేసుకుంది. అప్పుల బాధతో ఒకే కుటుంబంలోని నలుగురు ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది.
కృష్ణగిరి జిల్లా హోసూరులో మోహన్ తన కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. అతడికి తల్లి వసంత (61), భార్య రమ్య (36), కొడుకు అన్వయ్ (10) ఉన్నారు. అయితే… మోహన్‌కు ఆన్ లైన్‌లో గేమ్స్ ఆడడం అలవాటుగా మారింది. ఆన్ లైన్ రమ్మీ ఆడుతూ.. అందులో డబ్బులు పెట్టేవాడు. తన దగ్గర ఉన్న డబ్బులు అయిపోవడంతో…ఇతరుల దగ్గర అప్పు చేసేవాడు. ఇలా లక్షలాది రూపాయలు అప్పులు చేశాడు. అందులో పెట్టిన డబ్బు తిరిగి రాకపోవడం, అప్పు ఇచ్చిన వాళ్లు ఒత్తిడి తేవడంతో మోహన్ మానసికంగా కృంగిపోయాడు. తీవ్రమైన ఒత్తిడి రావడంతో ఆత్మహత్యే శరణ్యమని కుటుంబం భావించింది. దీంతో ఈరోజు తల్లి, భార్య, కొడుకులు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అనంతరం మోహన్ సినీ పక్కీలో ముఖానికి ప్లాస్టిక్ కవర్ చుట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో కలకలం రేపుతోంది. ఆన్ లైన్ గేమ్స్ ఆడుతూ.. జీవితాలు నాశనం అవుతున్నాయని, వెంటనే తమిళనాడులో ఆన్‌లైన్ గేమ్స్ ను నిషేధించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
ఈ వార్త కూడా చదవండి: సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. ఐదుగురు మృతి