అమరావతి, ఆంధ్రప్రభ: గ్రామీణ పేదలకు ఆరోగ్య సమస్యలపై అవగాహన కోసమే ఫ్యామిలీ డాక్టర్ల విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వస్తోందని వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపుల్ సెక్రటరీ ఎంటి కృష్ణబాబు వెల్లడించారు. ఫ్యామిలీ డాక్టర్ల కాన్సెప్ట్ పై బుధవారం విజయవాడలో మాస్టర్ ట్రైనర్స్‌కు ఏర్పాటు చేసిన వర్క్‌షాప్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆగస్ట్ 15న ఫ్యామిలీ డాక్టర్ల విధానాన్ని సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రారంభిస్తారన్నారు.
ప్రస్తుతం చిన్న ఆరోగ్య సమస్యలకు సైతం దూరాన ఉన్న నగరాల్లోని ఆసుపత్రులకు ప్రజలు పరుగులు తీస్తున్నారని, ఈ పరిస్థితుల్లో మార్పు తెచ్చి గ్రామీణ పేదల్లో వైద్య సేవలపై అవగాహన కల్పించి ఏ స్థాయిలో చికిత్స పొందాలో సూచించేందుకే సీఎం ఫ్యామిలీ డాక్టర్ల విధానానికి శ్రీకారం చుట్టారన్నారు. ఐదువేల మందికి ఒక ఆరోగ్య ఉప కేంద్రం ఉండాలనే నిబంధన ఉండగా ప్రతి రెండువేల జనాభాకు ఒక వైఎస్‌ఆర్ హెల్త్ క్లినిక్‌ను ఏర్పాటు చేసి మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్లను ప్రభుత్వం నియమించిందన్నారు. అదనంగా మరో 1500 మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ల పోస్టుల్ని భర్తీ చేస్తున్నట్లు తెలిపారు.
70 రకాల మందులు అందుబాటులోకి
ఆగస్ట్ ఒకటో తేదీకి ప్రతి హెల్త్ క్లినిక్‌లో ఆరు నెలలకు సరిపడే విధంగా 70 రకాల మందుల్ని, 30 రకాల పరికరాలను అందుబాటులోకి తేనున్నట్లు కృష్ణబాబు తెలిపారు. మండలంలో ఉన్న రెండు పీహెచ్‌సీల్లో ఒక్కో దాంట్లో ఇద్దరు డాక్టర్లు ఉంటారని, ఒక్కొక్కరికీ ఐదు లేదా ఆరు క్లినిక్స్ బాధ్యతను అప్పగించనున్నట్లు చెప్పారు. మొబైల్ మెడికల్ యూూనిట్ (ఎంఎంయు)ల్లో డాక్టర్లు గ్రామాలను సందర్శిస్తారన్నారు. మొబైల్ ఆసుపత్రుల్లా ఎంఎంయులు పనిచేస్తాయన్నారు. రోజుకు ఒకరు చొప్పున గ్రామాలను సందర్శిస్తారన్నారు. ప్రతి డాక్టర్‌కు ఒక మొబైల్ ఫోన్ కేటాయిస్తామని, డాక్టర్ మారినా ఫోన్ నెంబర్‌లో ఎలాంటి మార్పు ఉండని విధంగా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.