అమరావతి, ఆంధ్రప్రభ: ఫ్యామిలీ డాక్టర్ల సేవలు మార్చి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. ఈమేరకు చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్నాయి. సిబ్బంది లేని చోట్ల ఖాళీలను ఆఘమేఘాలమీద భర్తీ చేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని విలేజ్ హెల్త్ క్లినిక్‌ల ద్వారా ఫ్యామిలీ డాక్టర్ల సేవలు అందనున్నాయి. ఈక్రమంలో ఆసుపత్రుల నిర్మాణ పనుల్ని ముమ్మరం చేశారు. విలేజ్ క్లినిక్‌లకు 104 వాహనల ద్వారా వైద్య సిబ్బంది, పరికరాలు, మందులు చేరనున్నాయి. ఇందుకోసం అదనంగా రూ.67 కోట్లతో 282, 104 వాహనాల కొనుగోళ్లు చేశారు. ఫ్యామిలీ డాక్టర్ వైద్య విధానం అధికారికంగా ప్రారంభమయ్యేనాటికి ఏ విలేజ్ హెల్త్ క్లినిక్‌లోనూ మందులు, సిబ్బంది, రియేజంట్లు, పరికరాల కొరత లేకుండా చర్యలు చేపడుతున్నారు.
అన్ని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ సెంటర్లలోని పిల్లలందరికీ ఫ్యామిలీ డాక్టర్ వైద్య విధానంలో వైద్య పరీక్షలు నిర్వహించేలా యాక్షన్‌ప్లాన్ రూపొందించారు. ఆయా పరీక్షల్లో ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు తేలితే వారికి మెరుగైన వైద్యాన్ని అందించేందుకు తగిన ఏర్పాట్లు చేయనున్నారు. ఫ్యామిలీ డాక్టర్ల వైద్య విధానం గిరిజన ప్రాంతాల్లోని ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చనుంది. ఈ విధానం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ఏరియా, జిల్లా ఆసుపత్రులపై పని ఒత్తిడి తగ్గడంతో పాటు పేదలు ప్రైవేటు ఆసుపత్రుల బాట పట్టి వైద్య కోసం పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదన్నది ప్రభుత్వ అభిప్రాయం.
ట్రయల్ రన్ సక్సెస్..
ఫ్యామిలీ డాక్టర్ల ట్రయిల్ రన్ గత సంవత్సరం అక్టోబర్ 21న ప్రారంభించారు. ఇప్పటి వరకు సుమారు 30 లక్షల మంది గ్రామీణ వాసులకు ఫ్యామిలీ డాక్టర్ ఇంటికి వెళ్ళి వైద్య సేవలు అందించారు. 104 వాహనంతో డాక్టర్, వైద్య సిబ్బంది విలేజ్ క్లినిక్‌ను సందర్శించి గ్రామాల్లోనే వైద్య సేవలు అందిస్తున్నారు. వృద్ధులు, దివ్యాంగులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్ళే అవసరం లేకుండా ఉచితంగా గ్రామాల్లోనే వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందిస్తున్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఆసుపత్రుల్లో చికిత్సపొంది ఇంటివద్ద విశ్రాంతి తీసుకుంటున్న వారిని కలుసి ఆరోగ్య వివరాలు సేకరిస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇద్దరు వైద్యుల్ని ప్రభుత్వం నియమించింది. 67 రకాల మందులు, 14 రకాల ర్యాపిడ్ కిట్స్‌ను విలేజ్ క్లినిక్స్‌లో అందుబాటులో ఉంచారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌లో భాగంగా ప్రతి విలేజ్ క్లినిక్‌ను నెలలో రెండు సార్లు ఫ్యామిలీ డాక్టర్ సందర్శిస్తారు. జనాభా 4వేలు దాటి ఉంటే మూడోసారి కూడా పంపేందుకు ఏర్పాట్లు- చేస్తున్నారు.
ఫ్యామిలీ డాక్టర్ల సేవలు ఇలా..
ఈ ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా వైద్యాధికారి, మిగిలిన బృందం గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య కేంద్రాలను నెలలో రెండుసార్లు సందర్శిస్తారు. అక్కడ ట్రీట్మెంట్‌తో పాటూ ఆరోగ్య శ్రీ సేవలపైనా ఆరా తీస్తారు.. ప్రాథమిక వైద్య సేవల్లో భాగంగా.. ప్రతి 2వేలమందికి ఒక విలేజ్ హెల్త్ క్లినిక్ ఏర్పాటు చేశారు. ఇక్కడ 24 గంటలు సేవలు అందుబాటులో ఉంటాయి.. ఈ క్లినిక్‌లకు వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్స్‌గా నామకరణం చేశారు. 6,313 సబ్ సెంటర్స్.. అలాగే మరో 3,719 విలేజ్ హెల్త్ క్లినిక్‌లను మంజూరు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 10032 వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్‌లను ఏర్పాటు చేసి.. ఒక్కో క్లినిక్ పరిధిలో 2వేలమందికి సేవలు అందిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా కొత్త భవనాల్లో ఈ విలేజ్ హెల్త్ క్లినిక్‌లు ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడ ఓ ఏఎన్‌ఎం, ఒక ఎమ్‌ఎల్‌హెచ్‌పీ ఆశా వర్కర్ సేవలందిస్తారు.
ఈ విలేజ్ క్లినిక్‌లలో అన్ని రకాల వైద్య సేవలు, మందులు అందుబాటులో ఉంటాయి. గ్రామ స్థాయిలో నయం కాని ఆరోగ్య సమస్యలు ఉన్న వారిని వైఎస్సార్ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులకు రిఫర్ చేస్తారు. ఎఎన్ ఎం అక్కడ ఆరోగ్య మిత్రగా వ్యవహరిస్తారు. చిన్న పిల్లలు, గర్భిణిలకు కూడా వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి. అలాగే ఈ వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్‌లకు టెలీ మెడిసిన్, టెలీ హబ్‌ల ద్వారా మెడికల్ ఆఫీసర్‌తో పాటూ ప్రత్యేక సర్వీసులు అందుబాటులోకి వస్తాయి. ఆ తర్వాత మెల్లిగా వైద్య సేవలను ఇంటికే అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆశా వర్కర్లు వైద్యం అవసరమైన వారిని గుర్తిస్తారు. దీనితో పాటు అంగన్వాడీలు, స్కూళ్లను సందర్శించి అక్కడి విద్యార్ధుల ఆరోగ్య సమస్యలను తెలుసుకుని అవసరమైన మందులను పంపిణీ చేస్తారు.
విలేజ్ హెల్త్ క్లీనిక్స్ కీలకం..
భవిష్యత్తులో వైద్య సేవలన్నీ వైఎస్‌ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ లలోనే అందుబాటులోకి తెచ్చే విధంగా ప్రణాళికలు రూపొందిస్తురు. విలేజ్ హెల్త్ క్లినిక్ వైద్య బృందానికి సిహెచ్ ఓలే టీం లీడర్‌గా వ్యవహరించనున్నారు. ప్రజలు తమకు గతంలో అందిన, ఇప్పుడు అందుతున్న వైద్య సేవలను బేరీజు వేసుకుని ప్రస్తుత సేవలపై సంతృప్తి వ్యక్తం చేసే విధంగా విలేజ్ హెల్త్ క్లినిక్స్ పనితీరు ఉండేలా కసరత్తు చేస్తున్నారు. ఫ్యామిలీ ఫిజీషియన్ విధానంపై సెర్ప్ ఆధ్వర్యంలోని విలేజ్ ఆర్గనైజేషన్ల ద్వారా గ్రామీణుల్లో అవగాహన కల్పించడం కోసం స్థానిక పెద్దల సహకారం తీసుకోవాలని తీసుకోనున్నారు. భవిష్యత్‌లో ప్రభుత్వం ఆరోగ్యశ్రీ, ఎన్‌సిడి స్కీన్రింగ్, ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్‌తో ఏకీకృతం చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అవసరమైన వారికి ఫ్యామిలీ డాక్టర్ రెగ్యులర్ ఫాలో అప్ ఉంటుంది. ఆయుష్‌మాన్ భారత్ ఆరోగ్యఖాతాను ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌తో అనుసంధానించడం ద్వారా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌ను సాధించొచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
విలేజ్ క్లినిక్స్‌లో ఎదురయ్యే సమస్యలపై తక్షణమే స్పందించే విధంగా అధికారులకు సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మండలస్థాయి అధికారులు, జేసీ, కలెక్టర్‌లకు వీటిపై పర్యవేక్షణ బాధ్యతను అప్పగించారు. 108, 104 వాహనాల నిర్వహణపై ప్రతిరోజు సమీక్ష చేసే విధంగా ఏర్పాట్లు చేశారు. ప్రతి గ్రామంలో విలేజ్ క్లినిక్స్ సిబ్బంది ప్రతి కుటుంబాన్నీ కలుసుకుని విలేజ్ క్లినిక్స్ సేవలను వివరించనున్నారు. తాము అందుబాటులో ఉంటున్న తీరు, అందుతున్న సేవలపై ప్రతికుటుంబానికీ వారి ద్వారా వివరాలు తెలియజేసే విధంగా వైద్యశాఖ చర్యలు చేపట్టింది. వలంటీర్ల తరహాలో విలేజ్ క్లినిక్ సిబ్బంది కూడా క్రమం తప్పకుండా అవుట్ రీచ్ ప్రోగ్రాం ద్వారా రోగులను కలుసుకుని వారి ఆరోగ్య పరిస్థితిపై సమీక్ష చేయనున్నారు.