Saturday, November 23, 2024

పడిపోతున్న మిర్చి ధర, దిగుబడిని మింగేస్తున్న నల్లతామర.. దిగాలుపడుతున్న రైతాంగం

అమరావతి, ఆంధ్రప్రభ “ మిర్చి రైతు గుండెల్లో గుబులు గూడుకట్టుకుంటోంది.. మిర్చి ధరలు రోజురోజుకూ అనూహ్యంగా పడిపోతున్నాయి.. దిగుబడితో పాటు మిర్చి నాణ్యత తగ్గిపోవటమే దీనికి ప్రధాన కారణమని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. గత ఏడాది ఇదే సమయానికి శీతల గోదాముల్లో మిర్చి నిల్వలు సుమారు 30 లక్షల బస్తాలుండగా ఈ సంవత్సరం 5 లక్షల బస్తాలకు మించి లేవని అంచనా. కొత్త పంట రాక తీవ్రమైన మందగమన స్థాయికి చేరుకోవటానికి దిగుబడి భారీగా తగ్గిపోవటమే ప్రధాన కారణమని భావిస్తున్నారు. ఇపుడిపుడే చేతికందుతున్న పంటతో పాటు మరో రెండు నెలల్లో చేతికందే పంట నాణ్యతపై కూడా నమ్మకం కుదరకపోవటంతో ధరలు తగ్గుముఖం పడుతున్నట్టు మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. నల్లతామర భయంతో ఈ ఏడాది విచ్చలవిడిగా రసాయనాలు వాడటంతో పంట దిగుబడి, నాణ్యతపై తీవ్ర ప్రభావం చూపించినట్టు అంచనా. మార్కెట్లో మిర్చికి బాగానే డిమాండ్‌ ఉన్నా, గోదాముల్లో నిల్వలు కనిష్ట స్థాయికి చేరుకుంటున్నా కొత్త పంట నాణ్యతపై మార్కెట్లో అనుమానాలు అలుముకున్నాయి.

దీంతో చైనా, బంగ్లాదేశ్‌ ట్రేడర్ల నుంచి ఎగుమతి ఆర్డర్లు తగ్గుముఖం పట్టటంతో ధరలు అమాంతం పడిపోతున్నాయి. నాలుగు రోజుల క్రితం మేరకు క్వింటా గరిష్ట ధర రూ.22 వేలు ఉండగా ఇపుడు రూ.16 నుంచి రూ.18 వేలకు తగ్గిపోయింది. ధరలు మరింతగా పడిపోయే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో మిర్చి రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశీయంగా, అంతర్జాతీయంగా గడిచిన రెండేళ్ళుగా మిర్చికి డిమాండ్‌ పెరిగింది. కనీవినీ ఎరుగని స్థాయిలో ధరలు పెరిగాయి. ధరలు పెరగటం వల్లనే గత ఏడాది నల్లతామర వల్ల పంట దిగుబడిని నష్టపోయినా పెరిగిన ధరలు రైతులకు కొద్దిపాటి ఉపశమనం కలిగించాయి. కాకపోతే ఈ ఏడాది నల్లతామర నివారణ కోసం మోతాదుకు మించి విచ్చలవిడిగా రసాయనాలు వినియోగించటం వల్ల దిగుబడి, నాణ్యతపై తీవ్ర ప్రభావం చూపించినట్టు- మార్కెట్‌ వర్గాల అంచనా. ఫలితంగా ఒక వైపు పెట్టు బడి భారీగా పెరగటంతో పాటు మరో వైపు ధరలు తగ్గుముఖం పట్టటంతో రైతులు దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నారు.

25 క్వింటాళ్ళ నుంచి 10 క్వింటాళ్ళకు..

- Advertisement -

సాధారణ పరిస్థితుల్లో ఎకరాకు గరిష్టంగా 25 క్వింటాళ్ల దిగుబడి వచ్చే మిర్చి తామరపురుగు సోకిన తరువాత అనూహ్యంగా తగ్గిపోయింది. ఇపుడు 10 క్వింటాళ్ళకు మించి దిగుబడి వచ్చే పరిస్థితి కానరావటం లేదని రైతాంగంలో ఆందోళన వ్యక్తమవుతోంది. మరో వైపు తామర పురుగు నివారణ కోసం భారీగా ఖర్చు చేయాల్సి రావటంతో ఒక ఎకరాపై పెట్టుబడి లక్ష రూపాయల దాకా పెరిగినట్టు అంచనా. వివిధ ప్రాంతాల్లో పరిస్థితులను బట్టి ఎకరాకు రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల దాకా అయ్యే పెట్టుబడి ఇపుడు రూ.2.5 లక్షల నుంచి 3 లక్షల దాకా పెరిగిపోయింది. సాధారణ పరిస్థితుల్లో నెలకు రెండు సార్లు పురుగుమందులను పిచికారి చేస్తే సరిపోయేది.. తామర పురుగు వల్ల వారానికి రెండు సార్లు చొప్పున నెలకు 8 సార్లు పిచికారి చేయాల్సి వస్తోంది.. రసాయనాల ధరలు కూడా భారీగా పెరిగిపోయాయి.. రెండు వారాల క్రితం తామర పురుగు నివారణకు వాడే 34 మి.లీ మందు డబ్బా సుమారు రూ.2 వేలు ఉండగా, ఇపుడు రూ 3 వేలు పలుకుతోంది.

బ్లాక్‌ మార్కెట్లో పురుగుమందులను కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.. దీంతో వచ్చేదెంతో, పోయేదెంతో అర్ధంకాని అనిశ్చితి నెలకొందని రైతులు చెబుతున్నారు. మిర్చికున్న డిమాండ్‌ ను దృష్టిలో ఉంచుకుని పెట్టుబడి ఎక్కువయినా దిగుబడి బాగా వస్తే కొద్దో గొప్పో లాభాలు వస్తాయని ఆశపడ్డ రైతులు ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 5.71 లక్షల ఎకరాల విస్తీర్ణంలో సాగు చేశారు. నూటికి 60 నుంచి 70 శాతం పంటపై నల్లతామర ప్రభావం పూర్తిగానూ, మిగతా పంటపై పాక్షికంగా ఉన్నట్టు అంచనా. నల్లతామర నివారణకు రసాయనాలను అధిక మోతాదులో వినియోగించాల్సిన అనివార్య పరిస్థితులు ఏర్పడ్డాయి.. దీని వల్ల దిగుబడి సాధారణ పరిస్థితులతో పోలిస్తే 50 శాతం తగ్గిపోయింది.. ఈ నేపథ్యంలో రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోకుండా నల్లతామర పంటకు సోకటాన్ని ప్రకృతి వైపరీత్యాల జాబితాలో చేర్చి ప్రభుత్వం ఆదుకోవాలని రైతు సంఘాలు కోరుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement