హైదరాబాద్, ఆంధ్రప్రభ : నిన్న మొన్నటి వరకు వ్యవసాయ మార్కెట్లలో క్వింటాల్ ఉల్లిపాయల ధర రూ.2వేలకు పైగా ధర పలుకగా… గడిచిన నెల రోజ లుగా రూ.500 నుంచి రూ.800 కు పడిపోవడంతో ఉల్లి సాగు చేసిన రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. ఆరుగాలం కష్టించి సాగుచేసిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవడంతో కనీసం పెట్టుబడులు కూడా వచ్చే అవకాశాలు లేవని, అప్పులపాలవడం ఖాయమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో ఉల్లిపాయల ధర ధర రోజు రోజుకూ పడిపోతోంది. జనవరి మొదటి వారంలో క్వింటా ఉల్లిపాయల ధర రూ.2వేల నుంచి రూ.2100 దాకా పలికింది. అయితే మూడు వారాలుగా మార్కెట్‌లో క్వింటాల్ ఉల్లి ధర రూ.800 నుంచి రూ.500క పడిపోయి ఆ పంట సాగు చేసిన రైతులకు కన్నీళ్లు పెట్టిస్తోంది.
అసలే ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు అనుకూలించక , అధిక వర్షాలకు, చీడపీడలు ఆశించి ఉల్లి దిగుబడి గణనీయంగా తగ్గిందని రైతులు వాపోతున్నారు. అయినా ఎలాగో అలాగ అనేక కష్టాలను ఎదుర్కొని పొందిన అరకొర దిగుబడికి కూడా మార్కెట్‌లో గిట్టుబాటు ధరలు రాకపోవడంతో ఏమి చేయాలో పాలుపోని స్థితిలో రైతులు ఉన్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే ఎకరాకు దాదాపు 45 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా ఈ ఏడాది అధిక వర్షాలు చీడపీడల కారణంగా ఎకరాకు 20 క్వింటాళ్ల లోపే దిగుబడి వచ్చింది. దిగుబడి తగ్గిన కారణంగా మార్కెట్‌లో గిట్టుబాటు ధరకు మించి ధర వస్తుందని ఆశించిన రైతులకు నిరాశే మిగులుతోంది.
బహిరంగ మార్కెట్‌లో కిలో 20కే…
రైతులకు వ్యవసాయ మార్కెట్‌లో కన్నీళ్లనే మిగులుస్తోన్న ఉల్లి… బహిరంగ మార్కెట్‌లో మాత్రం వ్యాపారులకు కాసుల పంట పండిస్తోంది. ఇప్పటికీ పలు దుకాణాలు, కూరగాయాల మార్కెట్లలో కిలో ఉల్లి రూ.20 నుంచి రూ.25 దాకా అమ్ముతున్న పరిస్థితులు నెలకొన్నాయి. వచ్చిన అరొకర దిగుబడిని మార్కెట్‌కు తీసుకొస్తే కిలోకు రూ.5 కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు. మార్కెట్‌లో క్వింటా ఉల్లి ధర రూ.500 నుంచి రూ.800 మేరకే పలుకుతోందని ఆవేదన వ్యక్‌ం చేస్తున్నారు.రాష్ట్రంతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా విపణిలోకి ఉల్లి దిగుబడులు పెద్ద ఎత్తున వస్తుండడంతో ధర పడిపోతోందని వ్యాపారులు చెబుతున్నారు. మరో నెల రోజుల పాటు పంట మార్కెట్‌కు వస్తుందని, పంట రాబడి పెరిగితే ధర మరింత దిగజారనుందని వ్యాపారులు స్పష్టం చేస్తున్నారు.
ఉల్లిగడ్డను నిల్వ చేసే గిడ్డంగులు, ఇతర సదుపాయాలు రైతులకు అందుబాటులో లేకపోవడంతో పండిన పంటను కొద్ది రోజుల్లోనే వారు మార్కెట్‌కు తరలిస్తున్నారు. దీంతో వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి రైతులను అడ్డగోలుగా దోచుకుంటూ తాము చెప్పిన ధరకే రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీల ఛైర్మన్లు కూడా దళారులకు, వ్యాపారులకే కొమ్ముకాస్తూ నిలువునా దోచుకుంటున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.