Monday, November 25, 2024

TS | పతనమవుతున్న పత్తి ధరలు.. నష్టాల ఊబిలోకి రైతన్నలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెల్ల బంగారంగా పిలుచుకునే పత్తిసాగు ఈ ఏడాది రైతులకు తీవ్ర నష్టాలను మిగులుస్తోంది. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులకు తోడుచీడపీడల తాకిడికి పత్తి దిగుబడి ఆశించిన స్థాయిలో రాలేదు. ఇది చాలదన్నట్టు వచ్చిన అంతంతమాత్రం పత్తి దిగుబడులను మార్కెట్‌కు తరలిస్తే ధరలు అమాంతం పడిపోవడంతో కనీసం పెట్టుబడి వ్యయం కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు తలలు పట్టుకుంటున్నారు. ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో వర్షాలు లేకపోవటంతో పంట ఎదుగుదల లోపించింది.

జూన్‌, జులై మాసాల్లో వర్షాలు రైతులతో దాగుడు మూతలాడటంతో రైతులు, ఒకటికి రెండు మూడు సార్లు విత్తనాలు విత్తుకోవాల్సి వచ్చింది. దీనికి తోడు తెగుళ్లు సోకి పంట ఎండిపోవటంతో కర్షకులకు కష్టాలు తప్పలేదు. ఆశించిన స్థాయిలో ఎదుగుదల లేకపోవటంతో రైతులు అదనపు పెట్టుబడులు పెట్టారు. వ్యయ ప్రయాసల కొర్చి చేతికందిన నాలుగు దూది పూలు ఏరుకుందామనేలోపే అన్నదాతలపై తుపాను ఊహించని పిడుగులా పడింది. వర్షపు నీటిలో తడిసిన పత్తి రంగు మారి రైతుకు గుండె కోత మిగిల్చింది.

ప్రతి ఏటా రాష్ట్రంలో దాదాపు 75లక్షల ఎకరాల్లో పత్తి సాగయ్యేది. ఈసారి కూడా 75లోల ఎకరాల్లో పత్తి సాగవుతుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. కానీ వర్షాభావ పరిస్థితుల కారణంగా, రుతుపవనాలు ఆలస్యంగా రావడంతో కేవలం 46.5లక్షల ఎకరాల్లోనే తెలంగాణ వ్యాప్తంగా పత్తిని రైతులు సాగు చేశారు. గతేడాది 60 లక్షల ఎకరాల్లో పత్తి సాగవగా ఈ ఏడాది 46.50 లక్షల ఎకరాల్లోనే సాగుచేశారు.

- Advertisement -

సాధారణంగా సీజన్‌ అనుకూలిస్తే ఎర్రనేలల్లో 10 నుంచి 12 క్వింటాళ్లు, నల్లరేగడి భూముల్లో 15-20 క్వింటాళ్ల వరకు పత్తి దిగుబడి వచ్చేది. కానీ ఈసారి ఎర్రనేలల్లో 3 క్వింటాళ్లు, నల్లరేగడి భూముల్లో 5 క్వింటాళ్లకు మించి పంట చేతికి రాలేదు. ఎకరాకు కనీసం 3 క్వింటాళ్లు దిగుబడి రావటమే గగనంగా మారిందని చాలా మంది రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు.

పాతాళానికి పడిపోయిన ధరలతో చేతికొచ్చిన కొద్దిపాటి పత్తిని ఎక్కడ అమ్మాలో అన్నదాతలకు దిక్కుతోచట్లేదు. ఈ పరిస్థితుల్లో పత్తి రైతులకు గిట్టుబాటు ధర దక్కేలా కొనుగోళ్లు చేస్తామన్న సీసీఐ(కాటన్‌ కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియా) అలంకారప్రాయంగానే మారింది. పంట కొనుగోళ్లకు సవాలక్ష కొర్రీలు విధిస్తుండడంతో రైతులు సిసిఐ వైపు కన్నెత్తి చూడడం లేదు. ఈ ఏడాది తక్కువ విస్తీర్ణంలో పత్తిసాగవడంతో పత్తికి మార్కెట్‌లో మంచి ధర ఉంటుందని బావించిన రైతులకు నిరాశే మిగులుతోంది.

గతేడాది క్వింటాల్‌ పత్తి రూ.10 నుంచి రూ. 12 వేల వరకు పలికిన ధర ఈసారి రూ.6500 మించి పలకడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని వ్యవసాయ మార్కెట్లలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ధర పడిపోవడంతోపాటు వర్షాలకు పత్తి రంగు మారిందని, నాణ్యత లేదంటూ వ్యాపారులు మరిన్ని కొర్రీలు పెడుతున్నారు. పెరిగిన కూలీల రేట్లు, రవాణా ఖర్చుల నేపథ్యంలో పత్తిసాగుతో నష్టాలు మూటగట్టు కోవాల్సిందేనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణలో మొత్తం 380 జన్నింగ్‌ మిల్లులున్నాయి. రానున్న ఎనిమిది నెలల పాటు మిల్లుల్లో జన్నింగ్‌ చేయాలంటే కోటీ 20 లక్షల బేళ్ల పత్తి కావాలి. ఈ ఏడాది 40 లక్షల బేళ్లకు మించి రాదని అంచనా వేస్తున్నట్లు జిన్నింగ్‌ మిల్లుల సంఘం ఆవేదన వ్యక్తం చేస్తోంది.

గుజరాత్‌ మిల్లుల వ్యాపారులు కూడా తెలంగాణకు వచ్చి పత్తి కొంటుండడంతో అయిదారు నెలలు జన్నింగ్‌ చేయడానికి కూడా పత్తి దొరకదని మిల్లుల యాజమానులు వాపోతున్నారు. పెరిగిన పెట్టుబడి వ్యయం, కూలీల ఖర్చు నేపథ్యంలో క్వింటా పత్తికి రూ.11వేలు చెల్లిస్తేనే గిట్టుబాటు అవుతుందని రైతులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకొని పత్తికి గిట్టు బాటు ధర కల్పించాలని వేడుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement