Monday, November 18, 2024

మార్కెట్లో నకిలీ పత్తి విత్తనాలు.. నిందితుల అరెస్ట్‌, రిమాండ్‌

నల్లగొండ, ప్రభన్యూస్‌ ప్రతినిధి: నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న ముఠాను నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలో పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బుధవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్పీ అపూర్వ రావు ఆ వివరాలు వెల్లడించారు. బుధవారం ఉదయం 3 గంటల సమయంలో మునుగోడు ఎస్‌ఐ సతీష్‌ రెడ్డి, సిబ్బంది పెట్రోలింగ్‌ చేస్తున్న క్రమంలో మునుగోడు బస్‌ స్టాండ్‌ వద్ద అనుమానాస్పదంగా ఇద్దరు వ్యక్తులు సంచరిస్తుండగా వారి వద్దకు వెళ్లి తనిఖీ చేశారు. వారి వద్ద ఎటువంటి ఆధారాలు లేని పత్తి విత్తనాల ప్యాకెట్లను గమనించారు.

పోలీసులు ఇచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్న వ్యవసాయ అధికారులు ప్యాకెట్లను చెక్‌ చేసి నకిలీ పత్తి విత్తనాలుగా ధ్రువీకరించారు. దీంతో నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా తాము ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన కర్నాటి మధుసూదన్‌ రెడ్డి (నంద్యాల జిల్లా, ఆళ్లగడ్డ తాలూకా, గోవిందన్న గ్రామం), గురిజాల వీర బాబు (తూర్పుగోదావరి జిల్లా, తాళ్లూరు మండలం, గండేపల్లి గ్రామం)గా తేలింది.

- Advertisement -

వీరిద్దరూ కొంత కాలంగా నంద్యాల పరిసర ప్రాంతాల రైతుల నుండి తక్కువ ధరకు పత్తి విత్తనాలు కొంటూ.. వాటిని గుంటూరు తరలించి అక్కడ హరి కృష్ణారెడ్డికి చెందిన పాత పత్తి మిల్లులో నాణ్యత లేని పత్తి విత్తనాలను ప్రాసెస్‌ చేసి తమ వద్ద ఉన్నటు-వంటి గుర్తింపు లేని మేఘన, అరుణోదయ పేరుతో ఉన్న ప్యాకెట్లలో ప్యాక్‌ చేసి విక్రయించేవారు.

గుంటూరు నుండి మునుగోడులో రైతులకు, విత్తన విక్రయ డీలర్లకు విక్రయించేందుకు వచ్చారు. నిందితులు అందించిన వివరాల మేరకు హరి కృష్ణారెడ్డికి చెందిన పాత మిల్లు నుండి మిగిలిన నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకొని నిందితులను రిమాండ్‌కు తరలించారు. గతంలో కర్నాటి మధుసూదన్‌ రెడ్డి రెండు సార్లు నకిలీ పత్తి విత్తనాలు అమ్ముతూ పట్టు-బడగా అతనిపై పీడీ యాక్ట్‌ కేసులు నమోదు అయ్యాయని, ఈ కేసుల్లో అతను జైలుకు కూడా వెళ్లాడని తెలిపారు. అలాగే ఈ కేసును ఛేదించినందుకు నల్లగొండ డీఎస్పీ నర్సింహారెడ్డి, చండూరు సీఐ అశోక్‌ రెడ్డి, మునుగోడు ఎస్‌ఐ సతీష్‌ రెడ్డి, కట్టంగూరు ఎస్‌ఐ విజయ్‌, సిబ్బంది నాగరాజు, రామ నరసింహలను ఎస్పీ అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement