Saturday, January 4, 2025

TG | నకిలీ సర్టిఫికెట్ల తయారీ ముఠా గుట్టురట్టు

సిరిసిల్ల, (ఆంధ్రప్రభ): సిరిసిల్ల పట్టణం, టాస్క్‌ఫోర్స్ పోలీసులు నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు. ఐదుగురు నిందితులను అరెస్టు చేసి నకిలీ డాక్యుమెంట్లు, స్టాంపులు, సెల్ ఫోన్లు, డాక్యుమెంట్ల తయారీ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

మంగళవారం సిరిసిల్ల పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ అఖిల్‌ మహజన్‌ వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…

ఇటీవల కాలంలో నకిలీ షూరిటీ సర్టిఫికెట్‌ పెట్టుకొని రిమాండ్‌ అయిన ఓ కేసులో బెయిల్‌ వచ్చేలా చేసిన విషయమై విచారణ చేయగా సిరిసిల్ల పట్టణ పరిధిలోని గాంధీనగర్‌కి చెందిన రిటైర్డ్‌ టీచర్‌ సిరిపురం చంద్రమౌళి.. బోయినపల్లి తహసీల్దార్‌, సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌, గ్రామ పంచాయతీ సెక్రటరీ పేరుతో పాటు కొంత మందివి నకిలీ స్టాంపులు, వీఐపీల పేరుతో ప్రభుత్వ ఆఫీసుల నుండి జారీ చేసే సర్టిఫికెట్లు తయారు చేస్తున్నట్లు గుర్తించామన్నారు.

తమకు అందిన సమాచారం మేరకు చంద్రమౌళిని అదుపులోకి తీసుకొని విచారించగా సిరిసిల్ల సాయినగర్‌కు చెందిన పోలు ప్రకాష్‌, శివనగర్‌కు చెందిన డాక్యుమెంట్‌ రైటర్‌ బొడ్డు శివాజీ, శీలం రాజేష్‌లు సహకరిస్తున్నారని తెలిసిందన్నారు.

అలాగే చందుర్తి మండలం అనంతపల్లి గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్‌ చిలుక బాబు వీరి వద్ద నకిలీ ఫ్యామిలీ సర్టిఫికెట్‌ పొంది లబ్ధి పొందారని, బిట్ల విష్ణు అనే వ్యక్తి వీరి వద్ద నకిలీ వాల్యువేషన్‌ సర్టిఫికెట్‌ తీసుకొని ఇతరులకు ఇచ్చినట్లు వెలుగులోకి వచ్చిందన్నారు.

- Advertisement -

ఈ కేసుపై లోతుగా విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కేసుకు సంబంధించి నిందితులలో ఐదుగురిని అరెస్టు చేసి మంగళవారం రిమాండ్‌కి తరలించడం జరిగిందన్నారు. శీలం రాజేశ్‌ పరారీలో ఉన్నాడని వివరించారు. ఈ సమావేశంలో డిఎస్పీ చంద్రశేఖర్‌ రెడ్డి, సిఐ కృష్ణ, టాస్క్‌ఫోర్స్‌ సిఐ సదన్‌ కుమార్‌, టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement