దేశంలో మరోసారి బాంబు బెదిరింపు ఈ మెయిల్స్ కలకలం సృష్టించాయి. బీహార్‌లోని పాట్నా విమానాశ్రయ అధికారులకు బాంబు బెదిరింపు ఈ-మెయిల్‌లు అందడంతో మంగళవారం ఎయిర్ పోర్ట్ పరిసరాల్లో భయాందోళన నెలకొంది. మంగళవారం మధ్యాహ్నం 1:10 గంటలకు పాట్నా విమానాశ్రయం డైరెక్టర్‌కు బెదిరింపు ఈ-మెయిల్ వచ్చింది. దీంతో ఎయిర్ పోర్టు అంతటా భద్రతను కట్టుదిట్టం చేసినట్లు పాట్నా ఎయిర్ పోర్ట్ డైరక్టర్ తెలిపారు.
కాగా మంగళవారం ఇది రెండో బాంబు బెదిరింపు. అంతకుముందు గుజరాత్‌లోని వడోదరా విమానాశ్రయానికి బాంబు బెదిరింపు ఈ-మెయిల్ వచ్చింది. విమానాశ్రయ అధికారులు వెంటనే చర్యలు తీసుకున్నారు. పోలీసులను సంప్రదించి విమానాశ్రయ ఆవరణలో భద్రతను పెంచారు. బెదిరింపు ఈమెయిల్‌ను పంపిన వ్యక్తిని ట్రాక్ చేయడానికి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.
బూటకపు బాంబు బెదిరింపు చెన్నై నుంచి దుబాయ్ వెళ్లే విమానం ఆలస్యానికి కారణమైంది. ఈ విమానంలో 268 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానంలో బాంబు ఉన్నట్లు బెదిరింపు రావడంతో భద్రతా సంస్థలు విమానాన్ని క్షుణ్నంగా తనిఖీ చేశాయి. ఇదిలా ఉండగా సోమవారం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దుబాయ్ వెళ్తున్న విమానానికి మరో బాంబు బెదిరింపు వచ్చింది. జూన్ 17 ఉదయం 9:35 గంటలకు, ఢిల్లీ- దుబాయ్ ఫ్లైట్‌లో బాంబు ఉందని ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ ఆఫీసు, IGI ఎయిర్‌పోర్ట్‌కు ఈమెయిల్ వచ్చిందని పోలీసులు తెలిపారు. కోయంబత్తూరు, జైపూర్ ఎయిర్ పోర్టులకు కూడా బాంబు బెదిరింపు ఈమెయిల్స్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఎయిర్ పోర్టు పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు.
గత వారం ఢిల్లీలోని పలు మ్యూజియంలకు బాంబు బెదిరింపులు వచ్చాయని పోలీసులు తెలిపారు. కాగా అదంతా ఫేక్ అని తేల్చేసారు అధికారులు. ఢిల్లీలోని రైల్వే మ్యూజియంతోపాటు దాదాపు 10-15 మ్యూజియంలకు ఈమెయిల్స్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.