కామారెడ్డి, (ప్రభ న్యూస్): అవినీతి నిరోధక శాఖ అధికారులమని మూడు రోజులుగా కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పని చేసే జిల్లా స్థాయి అధికారుల్లో ఆరుగురికి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. తమను టార్గెట్ చేసి లక్షల్లో డబ్బులు డిమాండ్ చేస్తున్నారని కొంతమంది బాధితులు ఇవ్వాల (మంగళవారం) జిల్లా ఎస్పీని ఆశ్రయించారు. ఈ ఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మూడు రోజులుగా ఆరుగురు జిల్లా స్థాయి అధికారులకు ఏసీబీ అధికారులమనే పేరుతో ఫోన్ కాల్స్ చేస్తూ లక్షల్లో డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
లేదంటే మీ బాగోతం బయట పెడతామని బెదిరింపులకు దిగుతున్నట్టు వారి ఫిర్యాదు ఆధారంగా తెలుస్తోంది. ఏసీబీ డీఎస్పీ కార్యాలయం నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పి బెదిరింపులకు దిగుతున్నారని, దీంతో జిల్లా అధికారులు ఎస్పీ శ్రీనివాసరెడ్డిని కలిసి ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. జిల్లా ఎస్పీ ఫోన్ కాల్ పరిశీలించి ఫేక్ కాల్స్ నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.