Friday, November 22, 2024

”కంటి వెలుగు” ప్రపంచ రికార్డు.. 44 లక్షల మందికి పైగా పరీక్షలు, 9.80 లక్షల మందికి కళ్లద్దాలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : ప్రజల ఆరోగ్య సంరక్షణ లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ ప్రారంభించిన ”కంటి వెలుగు” పథకానికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు దక్కింది. చిన్న, పెద్దా తేడా లేకుండా పద్దెనిమిదేళ్లు నిండిన అన్ని వర్గాలకు ఈ పతాకాన్ని వర్తింపజేయడం పట్ల రాజకీయాలకు అతీతంగా హర్షధ్వానాలు వినిపిస్తున్నాయి. ఇక్కడికి వచ్చిన అనేక రాష్ట్రాల ముఖ్య మంత్రులు ప్రత్యేక ఆకర్షితులై, వారి రాష్ట్రాల్లో అమలుకు కసరత్తు చేస్తున్నారు. రాజకీయంగా విభేదాలు కొనసాగుతున్నప్పటికీ అనేక మంది కేంద్ర మంత్రులు కూడా ఈ పథకాన్ని ప్రశంసించారు. నిరాటంకంగా, నిర్విరామంగా ఈ ఏడాది జూన్‌ 15 వరకు కంటి వెలుగు పథకాన్ని కొనసాగించాలని కేసిఆర్‌ సర్కారు నిర్ణయించింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. రాష్ట్ర వ్యాప్తంగా కంటి వెలుగు పథకం కింద వైద్య, ఆరోగ్య శాఖ 44 లక్షలకు పైగా మందికి పైగా పరీక్షలు నిర్వ#హంచింది. ఫిబ్రవరి 18న స్కీమ్‌ రెండవ దశలో నెలరోజుల మార్కును చేరుకుంది. ఈ సమయంలో దాదాపు 9.80 లక్షల మంది ఉచిత ప్రిస్క్రిప్షన్‌ గ్లాసులను అందుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

రాష్ట్రంలో అంధత్వాన్ని నివారించేందుకు ఉద్దేశించిన ‘కంటి వెలుగు’ పథకం రెండో దశను తెలంగాణ సీఎం కేసీఆర్‌ జనవరి 19న ప్రారంభించారు. ప్రభుత్వం తెచ్చిన స్కీమ్‌లో భాగంగా 1500 మంది కంటి వైద్యుల బృందం 100 రోజుల పాటు అన్ని జిల్లాల్లో పర్యటించింది. ఈ క్రమంలో కంటి పరీక్షలు, దృష్టి పరీక్షలు నిర్వహించడంతో పాటు కళ్లద్దాలను ఉచితంగా అందజేసి సాధారణ కంటి జబ్బులకు మందులు అందజేస్తున్నారు. రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు కంటి చూపు సమస్యతో బాధపడుతున్నారని ‘కంటి వెలుగు’ కార్యక్రమానికి సంబంధించిన అధికారులు వెల్లడించారు. దూరంగా ఉన్న వస్తువులు కనిపించకపోవటం అనేది ఒక సాధారణ వ్యాధి, మరికొందరిలో దగ్గరగా ఉండే వస్తువులు కనిపించవు.. ఇలాంటి లోపాలను సరిచేసేందుకు వైద్యులను సంప్రదించటం ముఖ్యం. కానీ గ్రామాల్లోని పేద వర్గాల ఆర్థిక స్తోమత లేక అందత్వంలోనే మగ్గిపోతున్నారు. 40 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులు సాధారణంగా దగ్గరి వస్తువులు కనిపించటం లేదని కంటి చూపు మందగించిందని ఫిర్యాదు చేస్తుంటారు. ఇలాంటి సమస్యకు తెలంగాణ ప్రభుత్వం కంటి వెలుగు స్కీమ్‌ కింద వైద్యులు ప్రిస్క్రిప్షన్‌ మేరకు గ్లాసెస్‌ ఉచితంగా అందిస్తోంది. వీటితో పాటు విటమిన్‌ ఎ, డీ, బీ కాంప్లెక్స్‌ మాత్రలను సైతం ప్రభుత్వం నిర్వహిస్తున్న శిబిరాల్లో అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement