హైదరాబాద్, ఆంధ్రప్రభ: ప్రస్తుతం పరీక్షల సమయం. విద్యార్థులు పుస్తకాలతో కుస్తీ పట్టి పరీక్షలకు సిద్ధమవుతున్నారు. అయితే పరీక్షల సమయంలో కంటి సంరక్షణలో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకు 20:20:20 సూత్రాన్ని పాటించాలంటున్నారు. ప్రతి 20 నిమిషాలకు 20 అడుగుల దూరాన్ని 20 సెకన్లపాటు చూడాలని ఎల్‌వీప్రసాద్ కంటి వైద్యులు చెబుతున్నారు. పరీక్షల కారణంగా విద్యార్థులు ఆందోళన, నిస్సత్తువ, నీరసం, మానసిక ఒత్తిడికి గురవుతుంటారు. సమయం తక్కువ ఉండడం చదవాల్సింది ఎక్కువగా ఉండడంతో రోజుల్లో ఎక్కువ సేపు విద్యార్థులు చదువులకే కేటాయించాల్సి వస్తోంది.
ఇలా చదవడం కంటికి మంచిది కాదు..
మధ్య మధ్యలో విశ్రాంతి లేకుండా అదే పనిగా ఎక్కువసేపు పుస్తకాలు, ట్యాబ్‌లు దగ్గరగా పెట్టుకుని చదివితే నిద్రలేమి, కనురెప్పలను ఆర్పకపోవడం కారణంగా కళ్లు అలసిపోవటంతోపాటు పొడిబారిపోయి కళ్ల దురద సమస్య తలెత్తే ప్రమాదముంది. విరామం లేని చదువుల కారణంగా తలనొప్పి, చూపు చెదరడం, మరియు కొన్నిసార్లు అది మైగ్రేనుకు కూడా దారితీసే ప్రమాదముందని వైద్యులు చెబుతున్నారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు…
ఈ నేపథ్యంలో పరీక్షల సమయంలో విద్యార్థులు అధ్యయనం కారణంగా కంటి సమస్యల బారిన పడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా బాధ్యతగా వ్యవహరించాలని, తగిన జాగ్రత్తలను విద్యార్థులకు అలవాటు చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. పరీక్షలకు ప్రిపేర్ అయ్యే ముందు ఓసారి కంటి వైద్య నిపుణుడితో పిల్లలకు టెస్టులు చేయించటం మంచిది. కళ్ల జోడు వాడే విద్యార్థులు మంచి పవర్ ఉన్న కళ్లజోడునే వాడాలి. ఎక్కువసేపు అదే పనిగా చదవకుండా తరచూ విరామం తీసుకోవాలి. సుదీర్ఘమైన అధ్యయనం సమయాల్లో తరచుగా కళ్ళను ఆర్పడం మరిచిపోవద్దు. కళ్లను ఆర్పటం వల్ల కళ్లు పొడిబారడం, దురద మరియు కంటి అలసటను నివారించొచ్చు. కూర్చునే భంగిమ మరియు చదివే దూరం సరిగ్గా ఉంచడం మెడ మరియు వెన్ను నొప్పి బారిన పడకుండా ఉండొచ్చు. విద్యార్ధులు తమ వెన్నెముకను నిటారుగా ఉంచే మరియు అతిగా మెడ వంచకుండా చదవటాన్ని విద్యార్థుల్లో ప్రోత్సహించాలి. అధ్యయనంలో వీలైనంత వరకు డిజిటల్ గాడ్జెట్లను పరిమితంగా ఉపయోగించాలని డాక్టర్లు సిఫార్సు చేస్తున్నారు. ఎయిర్ కండిషనర్/కూలర్ లేదా ఫ్యాన్‌కు ముందు ఎదురుగా కూర్చోని చదవొద్దు. అలా చేస్తే కళ్ళు పొడిబారే ప్రమాదముంది. మంచి వెలుతురు, గాలి ప్రసరిస్తున్న గదిలో కూర్చోనే చదవాలి. విద్యార్ధులు ప్రతిరోజూ కనీసం 6 నుండి 8 గంటల పాటు నిద్ర పోయేటట్లు తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..