Friday, November 22, 2024

Big Story | 2025లో తీవ్రస్థాయి సౌర తుపాన్లు.. మునుపెన్నడూ చూడని విధ్వంసం ఉండొచ్చు..

ఇటీవల కాలంలో సౌరతుఫాన్లు పెను విధ్వంసాన్ని కలిగిస్తున్నాయి. భానుడి భగభగలకు జీవజాలం తోపాటు, కమ్యూనికేషన్‌ వ్యవస్థలు అస్తవ్యస్థం అవుతున్నాయి. రాబోయే కాలంలో ఈ సౌరతుఫాన్ల తీవ్రత మరింత అధికంగా ఉంటుందనే హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇలాంటి నివేదికలతో మళ్లిd సౌర తుఫాన్లపై చర్చ జరుగుతోంది. వచ్చే రెండేళ్లలో అంటే 2025 నాటికి సౌరతుఫాన్లు గరిష్ట స్థాయికి చేరుకుంటాయని వాషింగ్టన్‌ పోస్టు ఓ కథనాన్ని ప్రచురించింది. ఆ వేడిని తట్టుకునే రీతిలో నేటి డిజిటల్‌ సమాజం లేదని అందులో పేర్కొన్నారు.

బలమైన సౌర తుఫాను భూమిని తాకవచ్చు. ఇంటర్నెట్‌ అనుసంధాన ప్రపంచంలో ఇప్పటి వరకు జరగని అరుదైన ఘటన అవుతుంది. దానివల్ల ఇంటర్నెట్‌ వ్యవస్థకు తీవ్ర విఘాతం కలుగుతుంది. ఇది 1859 నాటి కారింగ్‌టన్‌ ఈవెంట్‌ను పోలివుంటుంది. అప్పట్లో కారింగ్‌టన్‌ కారణంగా టెలిగ్రాఫ్‌ లైన్లు దెబ్బతిన్నాయి. ఆపరేటర్లు విద్యుదాఘాతానికి గురయ్యారు. అలాగే 1989 సౌర తుఫాన్‌ క్యూబెక్‌ పవర్‌ గ్రిడ్‌ను కొన్ని గంటలపాటు స్తంభింపజేసింది అని వాషింగ్టన్‌ కథనం పేర్కొంది.
దీనిపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. ఇంటర్నెట్‌ యుగాంతం అయ్యే అవకాశాలు దగ్గరైనట్లు సోషల్‌ మీడియా యూజర్లు ట్రోల్‌ చేస్తున్నారు. కానీ 2025లో వచ్చే సౌర తుఫాన్ల వల్ల ఇంటర్నెట్‌కు సమస్య వాటిల్లే అవకాశాల గురించి మాత్రం నాసా ఎటువంటి ప్రకటన చేయలేదు.

సౌర తుఫాన్లు తీవ్రంగా ఉంటే ఎలా ఉంటుందన్న పరిస్థితిని ఇప్పటి వరకు ఎదుర్కోలేదని, ప్రస్తుతం ఉన్న మౌళికసదుపాయాలు ఏమౌతాయో చెప్పలేమని, ఆ ప్రభావాన్ని అంచనా చేయలేమని కాలిఫోర్నియా వర్సిటీ కంప్యూటర్‌ ప్రొఫెసర్‌ సంగీత అబూ జ్యోతి తెలిపారు. సోలార్‌ సూపర్‌స్టార్మ్స్‌.. ప్లానింగ్‌ ఫర్‌ ఆన్‌ ఇంటర్నెట్‌ అపోకలిప్స్‌ అన్న టైటిల్‌తో జ్యోతి రాసిన రిపోర్టు ఇప్పుడు చర్చనీయాంశమైంది. తీవ్రమైన సౌర తుఫాన్ల వల్ల సముద్రగర్భంలో ఉన్న కమ్యూనికేషన్‌ కేబుల్స్‌ కూడా దెబ్బతిననున్నట్లు ఆమె చెప్పారు. కొన్ని నెలల పాటు సూర్యుడు తన ప్రతాపాన్ని చూపే అవకాశాలు ఉన్నాయని, ఒక్క అమెరికాలోనే ప్రతి రోజు కనీసం 11 బిలియన్ల డాలర్ల నష్టం వాటిల్లే ప్రమాదముందని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement