న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో దళితులు, గిరిజనులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని మాజీ మంత్రి మారెప్ప విమర్శించారు. న్యూఢిల్లీ వచ్చిన ఆయన ఆంధ్రప్రదేశ్ భవన్‌లో బుధవారం మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి, మాజీ డిప్యూటీ స్పీకర్ కుతూహలమ్మ మృతికి మారెప్ప సంతాపం తెలిపారు. అనంతరం ఆయన రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై స్పందించారు. ఎస్సీ, ఎస్టీల అభివృద్ది కోసం కేంద్రం ఇచ్చిన నిధులను జగన్మోహన్ రెడ్డి దారి మళ్లిస్తున్నారని, దళిత ఉద్యోగులను కూడా వేధిస్తున్నారని ఆరోపించారు.
గతంలో జీవో వన్ వంటి జీవోలు ఉండి ఉంటే ప్రజల్లో తిరిగి ఉండేవాడివా అని ఆయన ముఖ్యమంత్రి జగన్‌ను ప్రశ్నించారు. అమరావతి రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు అన్యాయం జగన్ అన్యాయం చేశారని దుయ్యబట్టారు. రాష్ట్రంలోనే కాదు ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్‌లోనూ దళితులకు తీవ్ర అవమానాలు జరుగుతున్నాయని మారెప్ప ఆరోపించారు. మాజీ మంత్రి అయిన తనను కూడా తీవ్రంగా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు.