హైదరాబాద్ నగరంలో లాక్‌డౌన్ కారణంగా మధ్యాహ్నం నుంచి రెస్టారెంట్లు, హోటళ్లు బంద్ అవుతుండడంతో చాలా మంది ఫుడ్‌ను ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకుని ఇంటికి తెప్పించుకుని తింటున్నారు. దీంతో పలు రెస్టారెంట్లు ఆన్‌లైన్ ఆర్డర్లపై అదనంగా పన్నులు వేస్తూ వినియోగదారుల నుంచి దోపిడీ చేస్తున్నాయి. కొత్తగా హ్యాండ్లింగ్, ప్యాకేజింగ్ ఛార్జీల పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నాయి.
రెస్టారెంట్‌లో ఓ ధర.. ఆన్‌లైన్‌లో మరో ధర
ఇటీవల హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి అప్పుడప్పుడు హోటల్‌కు వెళ్లి బిర్యానీ తినేవాడు. మటన్ బిర్యానీకి గానూ రూ.265 చెల్లించి వచ్చేవాడు. లాక్‌డౌన్ కారణంగా ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయాలనుకున్నాడు. అందులో బిల్లు రూ.405గా చూపించింది. అంతేకాదు, అదనంగా డెలివరీ పార్ట్‌నర్ రుసుము రూ.22, పన్నులు, ఇతర ఛార్జీల కింద రూ.40 మొత్తం బిల్లు రూ.467 కట్టాల్సి వచ్చింది. అంటే, అదనంగా మొత్తం రూ.202 చెల్లించుకున్నాడు. అంతేకాదు, ఇతర ఆహార పదార్థాలకు కూడా ప్యాకేజింగ్ ఛార్జీలు, పన్నులు అంటూ అదనంగా వసూలు చేస్తున్నారు.
కాగా ఇటీవల హైదరాబాద్‌లోని ఓ రెస్టారెంటుకు దోపిడీపై ఓ కస్టమర్ ఫిర్యాదు చేయగా, ఆ రెస్టారెంటుకు రూ.10వేల జరిమానా విధించి, కేసు ఖర్చుల కింద వినియోగదారుడికి అదనంగా మరో రూ.5 వేలు చెల్లించాలని ఫోరం చెప్పింది. అంతేగాక నష్ట పరిహారం కింద వినియోగదారుల సంక్షేమ నిధికి రూ.50వేలు చెల్లించాలని ఆదేశించింది.