- ధరల్లో తేడా.. తూకాల్లో మోసం
- పచ్చి ధాన్యం కొనుగోలు
- కొనుగోలు కేంద్రాల దరి చేరని రైతులు
ఆంధ్రప్రభ స్మార్ట్, వాజేడు : ములుగు జిల్లా ఏజెన్సీ గ్రామాల్లో రైతులను దళారులు దోపిడీ చేస్తున్నారు. ఆరుగాలం శ్రమించిన పంట దళారుల చెంతకు చేరుతోంది. నిబంధనల పేరుతో రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు చేరకుండా అనాదిగా దళారులనే ఆశ్రయించి మోసపోతున్నారు. కొలతల్లో … ధర చెల్లింపుల్లో తేడాలు ఉన్నా రైతులు గమనించలేకపోతున్నారు. దీంతో రైతులు నిలువునా దోపిడీకి గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
కళ్లాల వద్ద కొనుగోలు…
రైతులతో ముందుగా మాట్లాడుకుని వరి కోతల యంత్రాలను తెప్పించి వరి కోయించి అక్కడికక్కడే కాంట వేసి పచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. అయితే ఎకర వరి కోతకు యంత్రానికి రూ.రెండు వేలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే రైతు నుంచి రూ.3000 తీసుకుంటున్నారు. ఖరీఫ్‌లో కూలీల కొరత కారణంగా దళారులు తెచ్చే యంత్రాలపై రైతులు ఆధారపడుతున్నారు. అలాగే ఎప్పుడు వాతావరణం ఎలా ఉంటుందో తెలియకపోవడంతో ధాన్యం ఆర బెట్టకుండా కొనుగోలు చేసే వ్యాపారులు అడిగిన రేటుకు ఇచ్చేస్తున్నారు. డబ్బులు కూడా వెంటనే ఇవ్వడంతో రైతులు దళారులను ఆశ్రయిస్తున్నారు.
దోపిడీకి గురవుతున్న రైతు…
ఒక ఎకరా కోతలు చేయడానికి యంత్రం వినియోగించేటప్పుడు అదనంగా వెయ్యి రూపాయలు చెల్లిస్తున్నారు. అలాగే ధాన్యం కొనుగోలు కేంద్రాలల్లో విక్రయిస్తే క్వింటాకు రూ.2300 మద్దతు ధర లభిస్తుంది. అయితే ఆరబెట్టడం, రవాణా ఖర్చు ఇలా శ్రమపడే కంటే తమకు పచ్చి ధాన్యం విక్రయించాలని దళారులు చెబుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఎన్నో సమస్యలు ఉన్నాయని, డబ్బులు కూడా వెంటనే చెల్లించే పరిస్థితి లేదని రైతులకు భయపెట్టడంతో రైతులు తప్పనిసరిగా దళారులకు విక్రయిస్తున్నారు. దళారులు క్వింటాకు కేవలం రూ.1700 లు చెల్లిస్తున్నారు. ఒక క్వింటా వద్ద రూ.600 లను రైతులు నష్టపోతున్నారు. ఒక ఎకరాకు 20 క్వింటాల ధాన్యం దిగుబడి వస్తుంది. ఒక ఎకరా ఉన్న రైతు రూ.12000లు నష్టపోతున్నాడు.
తూకాల్లో మోసం…
కళ్లాల వద్ద కాంటా వేసి తూకాల్లో కూడా రైతులను మోసం చేస్తున్నారు. ఒక క్వింటా వద్ద సుమారు ఐదారు కిలోలు తేడా చూపిస్తారు. తొమ్మిది క్వింటాలు విక్రయించే రైతు అర క్వింటా నష్టపోతున్నాడు. ఈ విషయం రైతులు గమనించడం లేదు. కొందరు పురాతన కొలమానలతో కొలతలు చేపడుతున్నారు. మరికొందరు తూకపు రాళ్లు బదులు సాధారణ రాళ్లు ఉపయోగించి తూకం చేస్తున్నారు. అలాగే కాంటా వేసేటప్పుడు కాంటారాళ్లు లేకుండా పడిగట్టి ధాన్యాన్ని తూకం వేస్తున్నారు. దీంతో తూకాల్లో కూడా పెద్ద ఎత్తున మోసాలు జరుగుతున్నాయి.