Sunday, November 24, 2024

Big story : విస్తృతంగా టెలిమెడిసిన్‌ సేవలు.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో అమలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : కరోనా విపత్కర కాలంలో ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఎంతో మందికి వైద్య సేవలు అందించిన టెలీ మెడిసిన్‌ విధానాన్ని ఇకపై విస్తృత స్థాయిలో అందుబాటులోకి తీసుకోవాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ యోచిస్తోంది. ప్రత్యేకించి గ్రామాల్లోని, మారుమూల ఏజెన్సీ ప్రాంతాలకు ప్రభుత్వ వైద్యాన్ని మరింత మెరుగ్గా చేరువచేసేందుకు టెలిమెడిసిన్‌ సేవలు ఎంతగానో ఉపయోగపడతాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు బావిస్తున్నారు.ఈ మేరకు టెలిమెడిసిన్‌ సేవల సాధ్యాసాధ్యాలపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రజారోగ్యశాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ జీ. శ్రీనివాసరావు, రాష్ట్ర వైద్య విద్యా విభాగం డైరెక్టర్‌ డాక్టర్‌ రమేష్‌రెడ్డిని ఆయన ఇప్పటికే ఆదేశించారు. ప్రభుత్వ వైద్యం పేద, సామాన్య మారుమూల గిరిజన, ఏజెన్సీ ప్రాంతాలకు చేరాలంటే టెలిమెడిసిన్‌ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడం తప్పనిసరి అని ఇటీవల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పలు కమిటీలు, స్థాయి సంఘాలు స్పష్టం చేశాయి. తలనొప్పి, జ్వరం, వంటినొప్పులు, విషజ్వరాలు వంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలతోపాటు బీపీ, షుగర్‌ తదితర అసంక్రమిత వ్యాధుల కట్టడికీ టెలిమెడిసిన్‌ వైద్య సేవలు ఎంతగానో ఉపయోగపడుతాయని వైద్య నిపుణులతో కూడిన పలు సంఘాలు, కమిటీలు ఉద్ఘాటిస్తున్నాయి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకూ ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా టెలీమెడిసిన్‌ ద్వారా వైద్య సేవలు పొందే అవకాశం కల్పిస్తోంది. టెలిమెడిసిన్‌ వైద్య సేవలు అందుబాటులోకి వస్తే రోగికి ఆసుపత్రికి వచ్చేందుకు అయ్యే వ్యయం, ఇతరత్రా ఆర్థికపర ప్రయోజనాలు కలుగుతాయని, అదే సమయంలో ప్రభుత్వానికి కూడా ప్రజలకు ఒకటి, రెండు రూపాయల ఖర్చుతో మెరుగైన వైద్య సేవలు, సకాలంలో అందించే అవకాశం కలుగుతుందని వైద్య నిపుణుల నివేదిక మంత్రి హరీష్‌రావుకు సూచించింది. అదే సమయంలో దేశ వ్యాప్తంగా టెలిమెడిసిన్‌ సేవలను విస్తరించాల్సిన ఆవశ్యకతను పార్లమెంటరీ స్థాయి సంఘం కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా గుర్తు చేసపింది. టెలిమెడిసిన్‌ వైద్య సేవలను విస్తరించేందుకు చిత్తశుధ్దితో పలు కార్యక్రమాలను వెంటనే చేపట్టాలని ఆ సంఘం స్పష్టం చేసింది.

కరోనా విపత్కర కాలంలో పలు ప్రయివేటు, స్వచ్ఛంద సంస్థలు, తెలంగాణ ప్రజారోగ్యశాఖ కూడా టెలిమెడిసిన్‌ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. లాక్‌డౌన్‌ సమయంలో ఆసుపత్రులకు వెళ్లలేకపోవడం, వెళ్లాలన్నా భారీ ఖర్చుతో కూడుకున్న పరిస్థితుల్లో టెలిమెడిసిన్‌ వైద్య సేవలు వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులు ఎదుర్కొంటున్నవారితోపాటు కొవిడ్‌ సోకి బాధపడుతున్న వారికి, ఇతరత్రా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారికి నిశ్చయాత్మకమైన వైద్య సేవలను అందించాయి. రాష్ట్ర ప్రజారోగ్యశాఖతోపాటు పలు ప్రయివేటు ఆసుపత్రులు, ఎన్‌జీవోలు ప్రత్యేకంగా కంట్రోల్‌ రూంలను ఏర్పాటు చేసి రోగులకు కావాల్సిన వైద్య సలహాలను, మందులను ఉచితంగా సూచించాయి.

ఇప్పటికే పొరుగున్న ఉన్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం టెలిమెడిసిన్‌ సేవలను విస్తృతప్రాతిపదికన అందించేందుకు ‘ఫ్యామిలీ డాక్టర్‌’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించింది. గ్రామీణ ప్రజలకు ఏ చిన్న ఆరోగ్య సమస్య తలెత్తినా వెంటనే సంప్రదించేందుకు వీలుగా ప్రతీ పీహెచ్‌సీ వైద్యుడికి మొబైల్‌ ఫోన్లు అందజేయాలని నిర్ణయించింది. ప్రతీ పీహెచ్‌సీని వైద్యులు నెలలో రెండుసార్లు సందర్శించేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. గ్రామంలోని పౌరులకు ఏ చిన్న అనారోగ్య సమస్య తలెత్తినా ఫోన్‌ నంబర్‌ ద్వారా వైద్యుడిని సంప్రదించే అవకాశం కల్పిస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణులు తమ అనారోగ్య సమస్యను వైద్యుడికి వివరించి చికిత్సకు సంబంధించిన సలహాలు, సూచనలు పొందొచ్చు. గ్రామంలోని క్లినిక్‌కు వెళ్లి వైద్యుడు సూచించిన మందులు తీసుకోవచ్చు.

తెలంగాణలో ఇప్పటికే మధుమేహం, రక్తపోటు, ఇతర వ్యాధిగ్రస్థులను గుర్తించి వారి వివరాలను ఆన్‌లైన్‌లో ఇప్పటికే నమోదు చేశారు. ప్రతీ వ్యక్తికి యూనిక్‌ కోడ్‌ను ఇచ్చి, టెలిమెడిసిన్‌ సేవలు అందుబాటులోకి వస్తే.. క్లస్టర్ల వారీగా ప్రాంతాలను విభజించి ప్రజల ఆరోగ్య డేటాను సేకరించనున్నారు. ప్రతీ వ్యక్తికి యూనిక్‌ హెల్త్‌ ఐడీని ఇచ్చి.. అందులో గతంలో ఆ రోగి తీసుకున్న చికిత్స, వైద్య పరీక్షలు, సూచించిన మందులు తదితర వివరాలన్నీ అప్‌లోడ్‌ చేయనున్నారు. మధుమేహం, రక్తపోటు తదితర సమస్యలున్న వాీరి ఆరోగ్యం గురించి వాకబు చేయడం కూడా ఈ టెలిమెడిసిన్‌ సేవలతో సులువు కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement