ప్రభ ప్రతినిధి, భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహాదేవపూర్ మండలం కాలేశ్వరంలో బుధవారం ప్రాణహిత పుష్కరాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 24 వరకు ప్రాణహిత పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విస్తృత ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు. పుష్కర ప్రారంభం బుధవారం రోజున బుధవారం కలెక్టర్ కాళేశ్వరం లో క్షేత్ర స్థాయిలో పర్యటించి, ఏర్పాట్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాన ఘాట్ వద్ద వచ్చే భక్తులకు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు ఘాట్ వద్ద త్రాగునీటి సౌకర్యం, మహిళా భక్తులకు దుస్తులు మార్చుకునే గదులు, షవర్ లను పరిశీలించారు. భక్తుల కొరకు తాత్కాలిక మరుగుదొడ్ల ఏర్పాట్లును చూశారు. పారిశుద్ధ్య సిబ్బంది నిరంతరం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాణహిత పుష్కరాలు విధులు నిర్వహిస్తున్న వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు తమ షిఫ్ట్ లో విధుల్లో చేరిన సుమయంలో సంబంధిత గ్రూపు నందు ఫోటోను అప్లోడ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. వైద్య ఆరోగ్య సిబ్బంది ఏర్పాటుచేసిన ఆరోగ్య కేంద్రాలలో అత్యవసర మందులను సిద్ధంగా ఉంచినట్లు ఆయన పేర్కొన్నారు.
కాళేశ్వరం లో 4 వైద్య శిబిరాలు ఏర్పాటుచేసినట్లు, అందులో వేసవి దృష్ట్యా ఓఆర్ఎస్ తదితర అత్యవసర మందులను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. కాళేశ్వరం లో గల ప్రాధమిక ఆరోగ్య కేంద్రం, మహాదేవపూర్ లో గల సామాజిక ఆరోగ్య కేంద్రాలను అన్ని రకాల మందులతో, 24 గంటలు సిబ్బంది విధులు ఉండేట్లు చర్యలు చేపట్టి, పుష్కరాలకు వచ్చే భక్తులకు సేవలకు సిద్ధం చేశామన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్ర పరిశీలన చేయాలని కలెక్టర్ అన్నారు. కాళేశ్వరం నుండి సిరించ కు ఉచిత బస్సు సేవలను ఏర్పాటు చేశామన్నారు. భద్రత విషయంలో పటిష్ట చర్యలు చేపట్టినట్లు, 600 మంది పోలీసులు నియమించి, ప్రధాన ప్రదేశాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేసినట్లు, కమాండ్ కంట్రోల్ రూమ్ సిద్ధం చేసి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉన్నట్లు ఆయన అన్నారు. దేవాలయం లోపల భక్తుల రద్దీ ని బట్టి, క్యూ లైన్లు, ప్రసాదం కౌంటర్లు ఏర్పాటుచేసినట్లు కలెక్టర్ తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..