Sunday, November 24, 2024

చక్కెర ఎగుమతులపై నిషేధం పొడగింపు.. 2023 అక్టోబర్‌ 31 వరకు ఆంక్షలు

చక్కెర ఎగుమతులపై విధించిన నిషేధాన్ని భారత ప్రభుత్వం పొడగించింది. ఈ నిషేధం వచ్చే ఏడాది అక్టోబర్‌ వరకు అమలులో ఉంటుంది. దేశీయ మార్కెట్‌లో ధర పెరుగుతున్న దృష్ట్యా చక్కెర ఎగుమతులను గతేడాది జూన్‌ 1 నుంచి ఈ ఏడాది అక్టోబర్‌ 31 వరకు కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. ఈ నిర్ణయం మన దేశంలో ద్రవ్యోల్బణాన్ని అరికట్టేందుకు ఉపయోగపడుతుందని కేంద్రం భావిస్తున్నది. చక్కెరతోపాటు గోధుమలపై విధించిన ఎగుమతి నిషేధం కూడా అమలులో ఉన్నది. రికార్డు స్థాయిలో పంచదార ఎగుమతి నేపథ్యంలో ధరలు పెరిగాయి.

- Advertisement -

ప్రపంచంలో చక్కెర ఉత్పత్తిలో భారతదేశం అతిపెద్ద దేశం కాగా, బ్రెజిల్‌ తర్వాత రెండో అతిపెద్ద ఎగుమతిదారుగా నిలిచింది. బంగ్లాదేశ్‌, ఇండోనేషియా, మలేషియా, దుబాయ్‌ దేశాలు మన వద్ద ఉత్పత్తయ్యే చక్కెరను అత్యధికంగా కొనుగోలు చేస్తున్నాయి. గత ఏడాది దేశం పెద్ద మొత్తంలో చక్కెరను ఎగుమతి చేసింది. గతేడాది 60 లక్ష మెట్రిక్‌ టన్నుల వరకు ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, 70 ఎల్‌ఎంటీ ఎగుమతైంది. ఈ ఏడాది కూడా రికార్డు స్థాయిలో 82 ఎల్‌ఎంటీల చక్కెర ఎగుమతి జరిగింది.

ఇండియన్‌ షుగర్‌ మిల్స్‌ అసోసియేషన్‌ ప్రకారం, ఈ సీజన్‌లో మన దేశంలో 35 మిలియన్‌ టన్నుల చక్కెర ఉత్పత్తి కాగా, 27 మిలియన్‌ టన్నులను వినియోగించింది. గత సీజన్‌లో దాదాపు 8.2 మిలియన్‌ టన్నుల నిల్వలతో కలిపి 16 మిలియన్ల మిగులు ఉన్నట్లు గణాంకాలు చెప్తున్నాయి. చక్కెర ఎగుమతులను మిగులుగా ఉన్న 16 మిలియన్లకు పరిమితం చేయాలనే ప్రభుత్వ ప్రణాళిక చాలా ముందు జాగ్రత్తగా కనిపిస్తున్నది. అలాగే, గోధుమలపై విధించిన నిషేధం ఇంకా కొనసాగుతున్నది. పెరుగుతున్న గోధుమల ధరలను దష్టిలో పెట్టుకుని ఈ ఏడాది మేలో వాటి ఎగుమతులపై భారత ప్రభుత్వం నిషేధం విధించింది. దేశీయంగా పెరుగుతున్న ధరలను నియంత్రించే చర్యల్లో భాగంగా గోధుమల ఎగుమతులపై భారత్‌ ఆంక్షలు పెట్టింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement