Friday, November 22, 2024

ఎంఎంటీఎస్‌ను పొడిగించండి, ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయండి.. కేంద్రానికి ఎంపీ వెంకటరెడ్డి విజ్ఞప్తి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తెలంగాణలోని భువనగిరి నియోజకవర్గంలో ఉన్న రాయగిరి వరకు ఎంఎంటీఎస్ ఫేజ్ 2ను పొడిగించాలని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో భేటీ అయిన కోమటిరెడ్డి తన నియోజకవర్గ పరిధిలోని సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఎంఎంటీఎస్ రెండో దశ పనుల పొడిగింపు అంశంపై చర్చించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయం తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి చెందిందని, ఆయన దర్శనానికి వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారని కోమటిరెడ్డి కేంద్రమంత్రికి వివరించారు. అలాగే విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, రైతులు రోజువారీ పనుల కోసం హైదరాబాద్‌‌కు రాకపోకలు సాగిస్తుంటారని చెప్పారు.

ఎంఎంటీఎస్‌ను ఘట్‌‌కేసర్ నుంచి రాయగిరి వరకు పొడిగించాలని కోరారు. ఎంఎటీఎస్‌ రెండోదశకు 2/3 వంతున పనులు చేపట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పందాలు చేసుకుని ఏళ్లు గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన వాటా ఆలస్యం కారణంగా కార్యరూపం దాల్చడం లేదని ఆయన అశ్విని వైష్ణవ్‌కు తెలిపారు. కేంద్రం ప్రత్యేక చొరవ తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి భాగస్వామ్యం లేకుండా వెంటనే పనులు ప్రారంభించి పూర్తి చేయాలని వినతిపత్రం సమర్పించారు. కోమటిరెడ్డి అభ్యర్థనపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు. కేంద్రమే మొత్తం ఖర్చు భరించి రాయగిరి వరకు ఎంఎంటీఎస్ ఫేజ్-2 పనులు ప్రారంభించి పూర్తి చేసేలా చూస్తామని హామీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement