గోదారమ్మ బాహువుల్లో మరో సంగమేశ్వరం
పాపికొండల నడుమ గండి పోచమ్మ
మరో చరిత్ర సృష్టించనున్న మాతృశ్రీ ఆలయం
ఆరుమాసాల విరామానంతరం భక్తులకు దర్శనం
ఇటు పాపికొండల యాత్ర.. అటు భక్త జన హోరు
కార్తీక మాసంలో వనవిహరానికి తరలివస్తున్న జనం
అమ్మను దర్శించుకునేందుకు అన్ని ఏర్పాట్లు
ఆంధ్రప్రభ స్మార్ట్, దేవీపట్నం, (ఏఎస్ఆర్ జిల్లా) : కార్తీక మాసంలో అటు ఆధ్యాత్మిక శోభ.. ఇటు సామూహిక వన భోజన సందడి. ఆ బాల గోపాలం ఆటపాటల కేరింతల హేళి. వన విహారం మరుపురాని మధురానుభూతి. ఇవ్వనీ సరే.. ఉరుకు పరుగుల గోదారమ్మ పాపికొండల నడుమ గుంభనంగా.. ప్రశాంతంగా జల పరుపు పరిస్తే.. లాహిరి లాహిరి అంటూ తన్మయంతో లాంచీ యానంలో మైమరచిపోయే పర్యాటక జనం.. మరో మహత్తర సన్నివేశాన్ని మిస్ కాకుడదనుకుంటారు. అదే మాతృశ్రీ గండి పోచమ్మ దర్శన భాగ్యం.
ఆరు నెలలపాటు..
భక్తుల పాలిట కొంగు బంగారమై.. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా గండి పోచమ్మ తల్లి పేరుగాంచింది. అమ్మ దర్శనం చేసుకుని.. ఆ తర్వాత పాపికొండల్లో జల విహార యాత్రలో ఆనంద పరవశంలో మునిగి తేలి.. అడవి తల్లి ఒడిలో వన భోజనాల జాతరలో సందడి చేయని పర్యాటకులు ఉండరు. పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ నేపథ్యంలో.. కృష్ణమ్మ ఒడిలో సంగమేశ్వర ఆలయ చరిత్రను గోదారమ్మ పొత్తిళ్లలో గండిపోచమ్మ ఆలయం నవ చరిత్ర సృష్టిస్తోంది. ఆరుమాసాల జల దిగ్బంధనం నుంచి పోచమ్మ తల్లి తేరుకుని భక్తులకు దర్శనం ఇవ్వబోతోంది. బుధవారం నుంచే భక్తులకు దర్శన బాగ్యం కలగనుంది..
మరో సంగమేశ్వరం..
అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం పూడిపల్లి పంచాయతీ గొందూరు గ్రామంలో వేంచేసిన గండి పోచమ్మ తల్లి ఆలయం గోదావరి తీరంలోనే ఓ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఇప్పటి వరకూ గోదావరి ఒడ్డున పుణ్యక్షేత్రంగా వెల్లివిరిసిన ఈ పుణ్యక్షేత్రం భవిష్యత్తులో.. మరో సంగమేశ్వర పుణ్యక్షేత్రంగా మారబోతోంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాగానే.. ప్రాజెక్టు బ్యాక్ వాటర్లో ఈ ఆలయం నిమజ్జనం కానుంది. ఇదే విషయాన్ని ఈ ఏడాది వరదలు నిరూపించాయి. గోదారి వరద పరవళ్లతో అమ్మవారి ఆలయం తెరుచుకోలేదు.
గోదారి ప్రవాహం తగ్గడంతో..
వరద నీటిలో పోచమ్మ ఆలయం మునిగిపోయింది. రహదారులు జలదిగ్బంధనం అయ్యాయి. భక్తులకు దర్శనం నిలిపివేశారు. పోచమ్మ తల్లి ఆలయంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు గోదావరి వరద నీటిలో మునిగిపోగా ఆలయానికి వెళ్లే ప్రధాన మార్గం జలదిగ్బంధనంలో చిక్కుకుంది. ఈ కారణాలతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అప్పట్లో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు గోదావరి నీటిమట్టం భారీగా తగ్గింది. ఆలయం పూర్తిగా వరద నీటి నుంచి బయటపడడంతో అధికారులు ఆలయ సంప్రోక్షణ చేశారు. ఆలయానికి వెళ్లే ప్రధాన రోడ్లు ప్రయాణానికి అనుకూలంగా ఉన్నాయి. గండి పోచమ్మ తల్లి దర్శనం కోసం భక్త జనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు.
పకడ్బందీ భద్రత ఏర్పాట్లు
ఆది, మంగళవారాల్లో విశేష సంఖ్యలో పోచమ్మ తల్లి దర్శనానికి తరలి వస్తారు. ఈ స్థితిలో ఆలయం వద్ద ప్రత్యేక భద్రత, రక్షణ ఏర్పాట్లు చేసినట్టు దేవస్థాన అధికారులు చెప్పారు. ఇంకా గోదావరిలో నీటిమట్టం ఎక్కువగానే ఉందని, భక్తులు ఎవరు నది లోపలికి దిగి స్నానాలు చేయవద్దని సూచించారు. దేవస్థానం తరుపున ఏర్పాటు చేసిన స్నాన ఘట్టం వద్ద మాత్రమే స్నానాలు చేయాలని, ఇతర రేవుల్లో స్నానాలతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు.
నేటి నుంచి దర్శన భాగ్యం..
బుధవారం నుంచి గండి పోచమ్మ తల్లి దర్శనాలకు ఏర్పాటు చేసినట్టు.. భక్తులు దర్శించు కోవచ్చని అధికారులు తెలిపారు. గోకవరం నుంచి ఇందుకూరు పేట, పోతవరం, దండంగి మీదుగా అమ్మవారి ఆలయానికి వాహనాల్లో రావొచ్చని తెలిపారు. రాజమండ్రి మీదుగా వచ్చే భక్తులు పురుషోత్తపట్నం మీదగా రావచ్చని భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు ఆలయ అధికారులు తెలియజేశారు.
ఇక సందడే సందడి
అల్లూరు జిల్లా, రంపచోడవరం ఏజెన్సీ దేవీపట్నం మండలంలోని గోందూరు గ్రామంలో వెలిసిన మాతృశ్రీ గండి పోచమ్మ ఆలయ తలుపులను ఆరు నెలల తర్వాత తెరిచారు.. కార్తీక మాసం కావడం పాపికొండల పర్యటన ఇక్కడి నుంచే మొదలవతుంది. అటు పాపికొండల యాత్ర.. ఇటు గండిపోచమ్మ దర్శనంతో.. ఈ కార్తీక మాసంలో పర్యాటక జనం సందడే సందడి