Saturday, November 23, 2024

ఎగుమతి దారులు కొత్త మార్కెట్లను అన్వేషించాలి: ఉపరాష్ట్రపతి వెంక‌య్య‌

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: భారతదేశ ఆర్థిక ప్రగతిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు, ఎగుమతులను పెంచే దిశగా కొత్త మార్కెట్లను అన్వేషించాలని గౌరవ భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచించారు. సోమవారం చెన్నైలో ప్రత్యేక ఆర్థిక మండళ్లు (సెజ్), ఎగుమతి సంబంధిత యూనిట్లు (ఈఓయూ)లకు సంబంధించి ఎక్స్ పోర్ట్ ఎక్స్ లెన్స్ అవార్డులను ఉపరాష్ట్రపతి అందజేశారు. ఈ సందర్భంగా అవార్డులు అందుకున్న ఎగుమతిదారులందరినీ.. ఎగుమతులను పెంచుతూ ఆర్థిక వ్యవస్థ పురోగతిలో భాగస్వాములు కావడంతోపాటు ఉపాధికల్పన చేపడుతున్నందుకు ఉపరాష్ట్రపతి ప్రత్యేకంగా అభినందించారు.

ఎస్ఈజెడ్ లు ఈఓయూలు దేశ ఎగుమతుల వ్యవస్థలో మూడోవంతు ఎగుమతులు చేపడుతుండటం ప్రశంసనీయమన్నారు. మేకిన్ ఇండియా, లోకల్ టు గ్లోబల్, వ్యాపారానుకూల వాతావరణం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) వంటి వాటిని ప్రోత్సహించేందుకు ఎస్ఈజెడ్ లు చక్కటి వేదికలుగా ఉపయోగపడుతున్నాయని ఉపరాష్ట్రపతి వెంక‌య్య‌ పేర్కొన్నారు. ఎగుమతిదారుల కృషి కారణంగానే ఇటీవలి కాలంలో దేశ ఎగుమతులు ఎన్నోరెట్లు పెరిగాయన్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 418 బిలియన్ అమెరికన్ డాలర్ల రికార్డు స్థాయి ఎగుమతులు నమోదవడాన్ని శుభపరిణామంగా పేర్కొన్న ఉపరాష్ట్రపతి.. సేవల రంగంలోనూ 250 బిలియన్ డాలర్ల ఎగుమతులు నమోదవడాన్ని అభినందించారు. కరోనా సమయంలోనూ రికార్డు స్థాయిలో ఎగుమతులు జరగడంలో భాగస్వాములైన అందరినీ అభినందించారు.

ఈ ధోరణి కొనసాగించాల్సిన అవసరం ఉందన్న ఆయన, జిల్లా కేంద్రాలను ‘జిల్లా ఎగుమతి కేంద్రం’గా మార్చాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ద్వారా మన దేశంలో ఎగుమతులు మరింత ఊపందుకుంటాయన్నారు. మన దేశంలోని మొత్తం 775 జిల్లాల్లో మెజారిటీ జిల్లాలకు ఎగుమతుల కేంద్రంగా మారే సామర్థ్యం ఉందన్నారు. ఎగుమతులను ప్రోత్సహించేందుకు వ్యాపారానుకూల వాతావరణాన్ని ఏర్పాటుచేయడం, పరిశ్రమలకు అనువైన విధానాలు తీసుకురావడం వంటివాటిపై కేంద్రం దృష్టి సారించిందని తద్వారా ‘లోకల్ టు గ్లోబల్’ కు ఊతం అందుతుందని ఆయన అన్నారు. జీఐ (జియోగ్రాఫికల్ ఇండికేషన్) ట్యాగ్ ఉన్న ఉత్పత్తుల ఎగుమతి విషయంలో మరింత చొరవ తీసుకోవాలని ఎగుమతిదారులకు సూచించారు.

భారతదేశంలో యువత శక్తిసామర్థ్యాలకు కొదువలేదని.. దాన్ని గుర్తించి సరైన నైపుణ్య శిక్షణ అందించడం ద్వారా దేశ పురోగతిలో వారిని భాగస్వాములు చేయాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. ఇందుకోసం ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించుకుని ముందుకెళ్లాలన్నారు. ఇలా చేయని పక్షంలో ప్రస్తుతం భారతదేశానికి గొప్ప వరంగా ఉన్న యువ జనాభాను దుర్వినియోగం చేసుకున్న వారమవుతామన్నారు. తమిళనాడులో పారిశ్రామిక, తయారీ రంగానికి అనుకూలమైన వాతావరణం ఉందన్న ఉపరాష్ట్రపతి, అటొమొబైల్స్, విడిభాగాలు, వస్త్ర, తోలు పరిశ్రమలు, చిన్న, భారీ ఇంజనీరింగ్ ఉపకరణాలు, పంపులు, మోటార్లు, ఎలక్ట్రానిక్, సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్ తదితర రంగాల్లో తమిళనాడు సాధిస్తున్న పురోగతిని ప్రశంసించారు.

కార్యక్రమంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి అనుప్రియా సింగ్ పటేల్, తమిళనాడు రాష్ట్ర మంత్రి రామచంద్రన్, మద్రాస్ ఎక్స్ పోర్ట్ ప్రాసెసింగ్ జోన్ ఎస్ఈజడ్ డెవలప్మెంట్ కమిషనర్ డాక్టర్ ఎంకే షణ్ముగ సుందరం, జాయింట్ డెవలప్మెంట్ కమిషనర్ అలెక్స్ పాల్ సుందరంతోపాటు ఎగుమతిదారులు, పారిశ్రామికవేత్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement