Thursday, November 21, 2024

జిల్లాకో ఎగుమతుల హబ్‌.. వచ్చే బడ్జెట్‌లో భారీగా నిధులు ప్రకటించే ఛాన్స్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్రం నుంచి కేవలం ఐటీ ఎగుమతులపైనే కాకుండా ఇతరత్రా ఉత్పత్తుల ఎగుమతులపైనా
ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన వన్‌ డిస్ట్రిక్ట్‌ వన్‌ ప్రోడక్ట్‌ అనే స్కీమ్‌లో చేరింది. వన్‌ డిస్ట్రిక్ట్‌ వన్‌ ప్రోడక్ట్‌ పేరుతో పోర్టల్‌ను కూడా ప్రారంభించి జిల్లాల వారిగా లభించే ఉత్పత్తులను కొంత మేర ప్రాసెస్‌ చేసి వాటిని నేరుగా అక్కడి నుంచి గ్లోబల్‌ మార్కెట్‌కు ఎగుమతి చేసే విధంగా కార్యాచరణ రూపొందించింది. ఇందుకుగాను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే స్వల్ప మొత్తంలో నిధులను కూడా కేటాయించింది. అయితే ఈ స్కీమ్‌తో పాటు మరో ఎగుమతులను ప్రోత్సహించే స్కీమ్‌లను కలిపి కేంద్ర ప్రభుత్వం త్వరలో మరో కొత్త స్కీమ్‌ను వచ్చే బడ్జెట్‌లో ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

దేశవ్యాప్తంగా పైలట్‌ పద్ధతిన అమలు చేయనున్న ఈ స్కీమ్‌ను తెలంగాణలోని జిల్లాల్లోనూ ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నట్లు పరిశ్రమశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇంతేకాక ఈ స్కీమ్‌ కోసం వచ్చే బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించనుందని, ఇందుకు ధీటుగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా స్కీమ్‌ కోసం నిధులు ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ పథకం విజయవంతమైతే తెలంగాణ జిల్లాల్లో వివిధ రంగాల వారిగా తయారయ్యే ఉత్పత్తులు భారీ ఎత్తున ప్రపంచ మార్కెట్‌కు ఎగుమతి కావడం ఖాయంగా కనిపిస్తోంది.

- Advertisement -

ఎగుమతులకు కావాల్సిన మౌళిక సదుపాయల ఏర్పాటు…

ఒక జిల్లాలో, ఆ జిల్లాకు పక్కనే ఉన్న జిల్లాల్లో విరివిగా లభ్యమయ్యే ముడిసరుకు ఆధారంగా తయారు చేసే ఉత్పత్తుల కోసం ఒక క్లస్టర్‌ ఏర్పాటు చేసి అక్కడ ఆ ఉత్పత్తులను ప్రాసెస్‌ చేసేందుకు అవసరమైన యంత్ర సామాగ్రి తదితర మౌలిక సదుపాయలను ఏర్పాటు చేయనున్నారు. ఈ క్లస్టర్‌లో ఉత్పత్తులను తయారుచేసిన తర్వాత వాటిని ఎగుమతి చేయడానికి అవసరమైన ప్రత్యేక ప్యాకింగ్‌కు కావాల్సిన ఏర్పాట్లు చేయడంతో పాటు విదేశాలకు ఎగుమతి చేసేందుకు అవసరమైన రవాణా రోడ్‌మ్యాప్‌ను కూడా ఎక్స్‌పోర్ట్‌ జోన్‌లోనే సిద్ధం చేస్తారు. ఈ క్లస్టర్‌లలో ఆయా జిల్లాల్లోని స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళలు తయారీ, ప్యాకింగ్‌కు సంబంధించిన యూనిట్లు స్థాపించుకునేందుకు అవసరమైన రాయితీలను కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే ఇవ్వనున్నాయి. దీంతో ఇటు ఉత్పత్తుల తయారీని ప్రోత్సహించడంతో పాటు అటు ఎగుమతుల పరిమాణం పెంపు, ఎక్కువ మందికి ఉపాధి లభ్యత, ఆర్థిక వ్యవస్థకు ఎక్కువ విదేశీ మారకద్రవ్యం లభ్యత తదితర బహుళ ప్రయోజనాలు నెరవేరనున్నాయని అధికారులు చెబుతున్నారు.

రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఇప్పటికే ఉత్పత్తుల గుర్తింపు…

ఓడీఓపీ స్కీమ్‌లో భాగంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో విరివిగా లభ్యమయ్యే ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించే క్రమంలో ప్రభుత్వం ఇప్పటికే జిల్లాల వారిగా లభ్యమయ్యే అగ్రి, ఇతర ఉత్పత్తులను గుర్తించింది. వాటికి సంబంధించి ఎగుమతుల క్లస్టర్లు ఏర్పాటు చేస్తేనే వయబుల్‌గా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ఉదాహరణకు వరంగల్‌లో మిర్చి, ఆర్మూర్‌లో పసుపు, జగిత్యాలలో మామిడి లాంటి అగ్రి ఉత్పత్తులను ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఈ తరహాలోనే అన్ని జిల్లాల్లో ఉత్పత్తులను గుర్తించి ఎక్స్‌పోర్ట్‌ హబ్‌లు ఏర్పాటు చేస్తే ఎగుమతులు పెరిగి స్థానికంగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తున్నట్లు పరిశ్రమల శాఖ వర్గాలు చెబుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement