కాలిఫోర్నియో – వెంకి పెళ్లి సుబ్బిశెట్టి చావుకొచ్చిందనే ఓ సామెత.. అది ఇప్పుడు నిజమైంది.. బాస్మతీయేతర బియ్యం ఎగుమతిపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో అమెరికాలో తెలుగు ప్రజలకు బియ్యం లభించక ఆందోళన చెందుతున్నారు. ఉన్న కొద్దిపాటి బియ్యం కొనేందుకు పలు షాపుల వద్ద ఎన్నారైలు క్యూ కట్టారు. కొన్ని చోట్ల అయితే బియ్యం కోసం ఎన్నారైలు ఎగబడ్డారు. ఒకేసారి పదుల సంఖ్యలో బియ్యం బ్యాగులు కొనుగోలు చేస్తున్నారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. బియ్యం ఎగుమతులపై భారత ప్రభుత్వం నిషేధం ఎప్పుడు ఎత్తేస్తుందోనన్న భయంతో అవసరానికి మించి కూడా కొందరు ఎన్నారైలు బియ్యం కొనుగోలు చేయడంతో ఈ పరిస్థితి తలెత్తింది..
కాగా ఒక్కసారిగా బియ్యానికి డిమాండ్ పెరగడంతో దుకాణదారులు ప్రత్యేక బోర్డులను ఏర్పాటు చేశారు. ఒక్కరికి ఒక్క బియ్యం బ్యాగ్ మాత్రమే విక్రయిస్తామని రాసిపెట్టారు. 15 డాలర్ల విలువ చేసే కిరాణ సామాన్లు కొంటేనే బియ్యం బ్యాగు కొనుగోలు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఒక కస్టమర్‌ను ఒక్కసారి మాత్రమే షాపులోకి అనుమతిస్తామని చెప్పారు. సోనా మసూరిలో ఏ రకం బియ్యం తీసుకున్నా ఒక్క కుటుంబానికి ఒక్క బియ్యం బస్తా మాత్రమే విక్రయిస్తామన్నారు. అలాగే బియ్యం ధరను కూడా 20 శాతం పెంచేశారు.. ఇక ఆన్ లైన్ స్టోర్ లో బియ్యం ఆప్షన్ మాయమైంది..