బెంగుళూరులో భారీగా పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. చిక్కనాయకనహళ్లి ప్రాంతంలో ప్రయివేటు పాఠశాల పక్కనే ఉన్న ఖాళీ ప్రదేశంలో పార్క్ చేసిన ట్రాక్టర్‌లో పేలుడు పదార్థాలను పోలీసులు గుర్తించారు. వీటిలో జిలెటిన్ స్టిక్స్, ఎలక్ట్రికల్ డిటోనేటర్లతో పాటు ఇతర పేలుడు పదార్థాలు ఉన్నట్లు నిర్ధారించారు. ఆ ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తున్న సిబ్బంది ఈ పేలుడు పదార్థాలను గుర్తించినట్లు పోలీసులు పేర్కొన్నారు.
ట్రాక్టర్ యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. కొద్ది రోజుల క్రితం బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలుడు జరిగిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో నగర వ్యాప్తంగా పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. చిక్కనాయకనహళ్లిలో పేలుడు పదార్థాలు భారీగా లభ్యం కావడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
మార్చి 1వ తేదీన రామేశ్వరం కేఫ్‌లో బాంబు బ్లాస్ట్ జరగడంతో 9 మంది తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడి చిత్రాలను దర్యాప్తు బృందాలు విడుదల చేశాయి. నిందితుడి ఆచూకీ చెప్పిన వారికి రూ. 10 లక్షల నగదు రివార్డును ఇస్తామని ఎన్ఐఏ ప్రకటించింది.