Friday, November 22, 2024

నైజీరియాలో పేలుడు, 109 మంది మృతి.. చమురు శుద్ధి కర్మాగారంలో భారీ ప్రమాదం

దక్షిణ నైజీరియాలోని ఇమనో రాష్ట్రంలో ఉన్న చమురు శుద్ధి కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. వందలాది మంది సిబ్బంది అక్కడ పనిచేస్తున్నారు. ప్రమాదం కారణంగా పెద్దఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. ఈ దుర్ఘటనలో 109 మంది సజీవదహనం అయ్యారు. వీరిలో చాలామంది గుర్తుపట్టలేనంతగా కాలిపోయారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ అక్రమ చమురు శుద్ధి కర్మాగారంలో.. నిర్వాహకులు, విక్రేతలు సమావేశమయ్యారు. అయితే ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో వందమందికి పైగా మరణించారని, మరికొందలు ప్రాణాలు కాపాడుకోవడానికి చెట్లపైకి ఎక్కారని అధికారులు తెలిపారు. రివర్స్‌, ఇమో స్టేట్‌ మధ్య సరిహద్దులో ఈ ఘటన జరిగిందని రివర్స్‌ స్టేట్‌ పోలీస్‌ ప్రతినిధి గ్రేస్‌ ఇరింగే కోకో తెలిపారు. అయితే ప్రమాదానికి నిర్థిష్ట కారణం తెలియరాలేదు. ఆఫ్రికాలో భారీగా ముడి చమురు ఉత్పత్తి చేసే దేశాల్లో నైజీరియాలో ఒకటి. అక్కడ రోజుకు సుమారు రెండు మిలియన్‌ బ్యారెల్స్‌ క్రూడాయిల్‌ ఉత్పత్తి అవుతుంది.

అయితే నైజీరియాలో అక్రమంగా ముడిచమురును శుద్ధిచేయడం సర్వసాధారణం. పైప్‌లైన్‌లను ధ్వంసం చేసి ముడిచమురు దొంగిలించిన అనంతరం.. దానిని శుద్ధి చేసినతర్వాత బ్లాక్‌ మార్కెట్‌లో విక్రయిస్తారు. పైగా నైజీరియాలోని అధికారిక చమురుశుద్ధి కర్మాగారాలు సైతం సామర్థ్యానికి అనుగుణంగా పనిచేయవు. దీనివల్ల దేశవ్యాప్తంగా తరచూ ఇంధన కొరత, ధరలు పెరుగుతుంటాయి. ఇలాంటి సందర్భాల్లో సులువుగా డబ్బు సంపాదించేందుకు కొందరు అక్రమార్కులు పైప్‌లైన్ల నుంచి దొంగిలించిన చమురును చట్టవిరుద్ధంగా శుద్ధిచేస్తుంటారు. ఈ క్రమంలో ప్రమాదాలు జరుగుతుంటాయని అధికారులు వెల్లడించారు. చట్టవిరుద్ధ చమురుశుద్ధి కార్యకలాపాలను నియంత్రించేందుకు చేపట్టిన చర్యలు సత్ఫలితాలివ్వడం లేదని పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement