Thursday, November 21, 2024

తరుగు పేరుతో మిల్లర్ల దోపిడీ..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తరుగు పేరుతో రైస్‌ మిల్లుల యాజమాన్యాలు రైతులను నిలువుదోపీడీ చేస్తున్నాయి. క్వింటా ధాన్యానికి మిల్లర్లు దాదాపు 10 కిలోల దాకా తరుగు తీస్తున్న ఘటనలు రాష్ట్రంలో చోటు చేసుకుంటున్నాయి. యాసంగి ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసినా… నష్టం వస్తుం దని తెలిసినా రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యం కొనుగోళ్లు చేస్తోంది. రైతులు నష్టపోవద్దన్న సదు ద్దేశ్యంతో నష్టాలను ఎదుర్కొనేందుకు సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వ సత్‌ సంకల్పానికి మిల్లర్లు గండి కొడుతున్నారు. వాస్తవానికి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తేమ శాతం 17శాతం ఉంటే… ఆతర్వాత రైతుకు ధాన్యంతో ఎలాంటి సంబంధం ఉండదు. అధికారులు ధృవీకరించాక ధాన్యాన్ని పౌరసరఫరాల శాఖనే మిల్లులకు చేరుస్తుంది. అయితే అక్కడ మిల్లర్లు తరుగు తీస్తున్నారని, అడ్డు పడితే ధాన్యం అన్‌లోడింగ్‌ చేసుకోవడం లేదని క్షేత్రస్థాయి సిబ్బంది వాపోతున్నారు. తక్కువలో తక్కువగా క్వింటాకు 4 నుంచి 5 కిలోల వరకు తరుగు తీస్తుండడం రాష్ట్ర వ్యాప్తంగా సర్వ సాధారణమైంది. దీంతో కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన ప్రకారం బిల్లు చెల్లింపులు జరుగుతాయనుకుంటున్న రైతు లకు అడిఆశలే మిగులుతున్నాయి. ఎకరాకు వరి సాగు చేసిన రైతుకు కొనుగోలు కేంద్రంలో 20 క్వింటాళ్ల మేర ధాన్యం తూకం జరుగుతుండగా మిల్లర్ల మాయా జాలంతో 18 క్విం టాళ్లకే బిల్లింగ్‌ అవుతోందని రైతు సంఘాల నేతలు వాపోతున్నారు. అంటే ఏకంగా ఎకరం పేరుమీద తరుగు కారణంగా రైతు తక్కువలో తక్కువ రూ.3వేలు మిల్లర్లకు సమర్పించుకోవాల్సి వస్తోందని ఆరోపిస్తున్నారు. క్వింటా ధాన్యానికి కనీసం 5 కిలోల తరుగుకు ఒప్పుకున్న రైతులకు చెందిన ధాన్యాన్ని మిల్లర్లు దిగుమతి చేసుకుంటుండడంతో తరుగు కష్టాలు రైతులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. తరుగు తీయొద్దని ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు జిల్లా మంత్రులు, అధికారులు ఎన్ని హెచ్చరికలు చేసినా రైస్‌ మిల్లర్లు తమ తీరును మార్చు కోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

యాసంగి ధాన్యంలో నూక శాతం అధికంగా ఉందనే సాకుతోపాటు త్వరగా కొనుగోళ్లు పూర్తి చేయాలన్న రైతుల అవసరాలను మిల్లర్లు క్యాష్‌ చేసుకుంటున్నారు. తరుగు పేరుతో రైతులను అందినకాడికి దోచుకుంటున్నారు. సన్నరకం ధాన్యానికి ఎలాంటి తరుగు తీయని మిల్లర్లు… దొడ్డు రకం ధాన్యం విష యంలో మాత్రం అడ్డూ అదుపు లేకుండా తరుగు తీస్తున్నారు. ప్రస్తుత యాసంగి సీజన్‌లో అధికంగా దొడ్డు ధాన్యా న్నే రైతులు పండిస్తారు. వానా కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సన్నరకం ధాన్యం సాగవుతుంటుంది. ప్రస్తుతం అకాల వర్షాల భయం వెంటాడుతుండడంతో తరుగు కటింగ్‌ శాతాన్ని మిల్లర్లు పెంచేశారు. కొనుగోలు చేసిన ధాన్యం కల్లాల్లో కనిపించొద్దని, వెం టనే మిల్లులకు తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు కూడా మిల్లర్ల దోపీడీపై చర్యలు తీసుకుని అరికట్టలేక పోతున్నారు. మిల్లర్లను బుజ్జగించి ధాన్యాన్ని మిల్లులకు తరలించడం తప్ప ఏమి చేయలేని పరిస్థితిలో అధికారులు కూరుకుపోయారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement