Wednesday, November 20, 2024

పత్తి రైతుల నిలువుదోపీడీ.. డిమాండ్‌ ఉన్నా మార్కెట్లలో తగ్గుతున్న ధర

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : సిండికేట్‌గా ఏర్పడుతున్న వ్యాపారులు పత్తి రైతులను నిలువుదోపీడీ చేస్తున్నారు. ఆరుగాలం కష్టపడి, అకాల వర్షాలకు ఎదురొడ్డి పత్తి పండించిన రైతులు ఇప్పుడు ధర పడిపోతుండడంతో ఆందోళనలో ఉన్నారు. వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి ధరను తగ్గిస్తున్నారు. దీంతో పత్తి రైతులు మార్కెట్‌కు రావాలంటేనే జంకుతున్నారు. ఈ ఏడాది పత్తి పంట దిగుబడి ఆశించినస్థాయిలో రాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 40లక్షల ఎకరాల్లో పత్తి సాగయింది. అయితే విస్తృతంగా కురిసిన భారీ వర్షాలకు పంట పత్తి ఎదగకపోగా.. గూడ వానలకు రాలిపోయింది. కాస్తో, కూస్తోకాసిన పత్తి కాయలు కూడా మురిగిపోయాయి. అక్టోబరు వరకు వర్షాలు కురియడంతో వాతావరణంలో తేమ మితిమీరి పెరిగి పత్తికాయలు పగలలేదు. దీంతో పత్తి దిగుబడి గణనీయంగా క్షీణించింది.

- Advertisement -

ఈ నేపథ్యంలో అక్టోబరు రెండో వారం నుంచి పత్తి మార్కెట్‌కు రాగా మద్దతు ధరకు మించి పలికింది. ఓ దశలో క్వింటా పత్తి ధర రూ.9వేల దాకా పలికింది. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వం క్వింటాకు పత్తి రూ.6380 మద్దతు ధరను కల్పించింది. మద్దతు ధరకు మించి పత్తి మార్కెట్‌కు వస్తుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. వారం రోజులుగా వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి నాణ్యమైన పత్తికి కూడా రూ.8వేలకు మించి ధర పెట్టడం లేదు. వరంగల్‌ ఏనమాముల మార్కెట్‌తోపాటు రాష్ట్రంలోని ప్రముఖ వ్యవసాయ మార్కెట్లలో ఇప్పుడు ఇదే పరిస్థితి నెలకొంది. వ్యాపారులు ధర తగ్గిస్తుండడంతో మార్కెట్లకు వస్తున్న పత్తి రోజు రోజుకూ తగ్గుతోంది. 100 క్వింటాళ్ల పత్తి వచ్చే వ్యవసాయ మార్కెట్‌కు కేవలం రోజూ 20 నుంచి 30 క్వింటాళ్ల పత్తి మాత్రమే వస్తోంది. క్వింటాల్‌ పత్తికి రూ.1500 దాకా తగ్గుతుండడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గతేడాది క్వింటాలు పత్తి ధర రూ.10వేలను దాటింది. ఈసారి కూడా అవే పరిస్థితులు నెలకొంటాయనుకుంటే వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడిన ధరలు తగ్గిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో బేల్‌ పత్తి ధర రూ.36వేల నుంచి రూ.38వేల దాకా పలుకుతున్నా రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్‌లలో వ్యాపారులు ధరలు తగ్గిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. రోజు రోజుకూ పత్తి ధర తగ్గుతుండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడిన పత్తి ధరను తగ్గిస్తే అప్పుల్లో కూరుకుపోతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా పత్తికి కనీస మద్దతు ధరలు రానప్పుడు సీసీఐ రంగంలోకి దిగుతుంది. కానీ సీసీఐ కూడా కమర్షియల్‌ ట్రేడింగ్‌ చేస్తే వ్యాపారులు పోటీ పడి పత్తిని కొనుగోలు చేసే అవకాశం ఉందని. ఈ నేపథ్యంలో పత్తి ధరలు తగ్గకుండా ఉండేందుకు సీసీఐ ద్వారా కమర్షియల్‌ ట్రేడింగ్‌ జరపాలని రైతులు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement