రష్యాకు చెందిన అతిపెద్ద యుద్ధనౌక మాస్క్వా నౌక ధ్వంసంతో అందులోని అణ్వాయుధాలు సముద్రంలో కలిసినట్లు నిపుణులు అనుమానిస్తున్నారు. ఈ నౌకపై కనీసంగా రెండు అణు వార్హెడ్లు ఉన్నట్లు అంచనావేస్తున్నారు. మాస్క్వాపై మంచి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఉంది. కానీ, ఉక్రెయిన్ దళాలు దాడికి ముందు బైరక్తర్ టీబీ-2 డ్రోన్లను ప్రయోగించి రష్యా నౌక ఎయిర్ డిఫెన్స్ దృష్టి మళ్లించాయి. ఆ తర్వాత రెండు నెప్ట్యూన్ క్షిపణులను ప్రయోగించి నౌకను ధ్వంసం చేశాయి. ‘ది బ్లాక్‌సీ ఇన్స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్’ ప్రాజెక్టు మేనేజర్ ఆండ్రీ ్లకమెన్కో అంచనా ప్రకారం మాస్క్వా నౌకలో కనీసం రెండు అణు వార్ హెడ్లు ఉన్నాయి. కాకపోతే నౌకలో పేలుడు చోటు చేసుకొన్నాక అణ్వాయుధాలను ఏం చేశారన్న వివరాలు వెల్లడికాలేదు. ఈ నౌకపై పీ-1000 వుల్కాన్ క్యారియర్ కిల్లర్ క్షిపణులను అమర్చారు. దీంతో వీటికి అమర్చేలా ‘టాక్టికల్ న్యూక్లియర్ వార్ హెడ్’లను కూడా ఈ నౌకలో భద్రపర్చే అవకాశం ఉంది. ఇవి నీట మునిగితే మరో ‘బ్రోకెన్ యారో’ ఘటనగా నిలిచే అవకాశం ఉంది. అణ్వాయుధాలకు సంబంధించి పేలుడు లేకుండా జరిగే ప్రమాదాలను అమెరికా సైన్యం బ్రోకెన్ యారోగా పిలుస్తుంది. దీంతో భవిష్యత్తులో నల్లసముద్ర తీరంలోని టర్కీ, రొమానియా వంటి దేశాలు రష్యాను ఈ వార్హెడ్లపై ప్రశ్నించే అవకాశం ఉంది. రష్యా వద్ద 2022 నాటికి మొత్తం 6,000 అణు వార్హెడ్లు ఉన్నాయి.
మాస్క్వా సిబ్బంది సజీవం..?
నల్ల సముద్రంలో నీటమునిగిన రష్యన్ యుద్ధనౌక మాస్క్వాలోని నేవీ సిబ్బంది సజీవంగా ఉన్నారు. నౌక మునక ఘటన తర్వాత తొలిసారి ఓ పరేడ్‌లో వారంతా కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోను రష్యన్ రక్షణ మంత్రి విడుదలచేశారు. క్రిమియన్ పోర్టుసిటీ సెవాస్టోపోల్‌లో 120 నావికులు కవాతు చేస్తుండగా, వారితో నేవీ కమాండర్ ఇన్ చీఫ్ అడ్మిరల్ నికోలాయ్ యెవ్మెనోవ్ కలుసుకున్నట్లు ఈ చిత్రంలో కనిపించింది. అయితే ఈ కవాతు చిత్రం మునుపటిదా? లేక తాజాదా? అన్నదానిపై మాత్రం స్పష్టతలేదు. మాస్క్వా సిబ్బంది ప్రస్తుతం సెవాస్టోపోల్‌లోని నేవీ స్థావరంలో ఉన్నారని, నౌకదళంలో సేవలు కొనసాగిస్తారని అడ్మిరల్ యెవ్మెనోవ్ పేర్కొన్నారు. నౌక కెప్టెన్ అంటోన్ కుప్రిన్ మరణించాడని రష్యా పేర్కొంది. అయితే, మాస్క్వాపై జరిగిన దాడిలో ఎంత మంది ప్రాణాలు కోల్పోయారన్న విషయంపై ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. కీవ్ మాత్రం మొత్తం 510 మంది సిబ్బంది మరణించినట్లు పేర్కొంది. అమెరికాకు చెందిన నౌకాదళ నిపుణులు మాత్రం తమ ఉపగ్రహ చిత్రాలను విశ్లేషించి దాదాపు 200 మందికిపైగా మరణించి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
సైనిక కర్మాగారాన్ని ధ్వంసం చేశాం
కీవ్‌పై రష్యా క్షిపణుల వర్షం కురిపించింది. కీవ్ వెలుపల సైనిక కర్మాగారంపై తాజాగా దాడి చేసినట్లు మాస్కో రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ‘ఆదివారం ఖచ్చితత్వంతో ప్రయోగించిన క్షిపణులు కీవ్ ప్రాంతంలోని బ్రోవరీ సెటిల్మెంట్ సమీపంలోని సైనిక కర్మాగారాన్ని ధ్వంసం చేశాయి’ అని మంత్రిత్వ శాఖ టెలిగ్రామ్‌లో ఒక ప్రకటన చేసింది. తమ భూభాగంపై విధ్వంసాలకు దిగితే.. కీవ్‌పై క్షిపణుల వర్షం తప్పదని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ గత హెచ్చరించింది. ‘రష్యా భూభాగంపై ఏదైనా ఉగ్రదాడులు లేదా విధ్వంసానికి పాల్పడాలని చూస్తే కీవ్‌పై క్షిపణి దాడులు మరింత పెరుగుతాయి’ అని రష్యా రక్షణశాఖ ప్రకటించింది. రష్యా సరిహద్దు నగరాలను లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ క్షిపణి దాడులు చేస్తోందని క్రెవ్లిున్ ఆరోపిస్తోంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..