హైదరాబాద్, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో ఖరీదైన వైద్యం పేదల చెంతకు ఉచితంగా చేరుతోంది. కార్పొరేట్ ఆసుపత్రులలో సైతం సాధ్యం కాని వైద్య చికిత్సలు సర్కారీ ఆసుపత్రులలో సాధ్యమవుతున్నాయి. ఆరోగ్యశ్రీ ద్వారా పూర్తి ప్రభుత్వ సహకారంతో ఒక్కో పేషెంట్‌కు రూ.15 లక్షల విలువ చేసే వైద్యం ఉచితంగా అందుతోంది. కేవలం గత నాలుగు నెలల్లో 50 కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీలు నిమ్స్ ఆసుపత్రిలో పూర్తయ్యాయి. ఆరోగ్యశ్రీ ద్వారా గడచిన నాలుగు నెలల్లో 50 మూత్ర పిండ మార్పిడి శస్త్ర చికిత్సలు విజయవంతంగా పూర్తి చేసి నిమ్స్ ఆసుపత్రి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నది.
కాగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014 నుంచి నిమ్స్ ఆసుపత్రి చరిత్రలో 862 కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు జరిగాయి. అప్పటి నుంచి ప్రతీ ఏడాది సగటున 100 కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు జరిగాయి. ఈ ఏడాది కేవలం నాలుగు నెలల్లోనే ఆరోగ్యశ్రీ కింద 50 మూత్రపిండ మార్పిడి ఆపరేషన్లు విజయవంతంగా పూర్తయ్యాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న జీవన్‌దాన్ కార్యక్రమం ద్వారా చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్న మూత్రపిండ మార్పిడి ఆపరేషన్లు అతి తక్కువ సమయంలో చేస్తున్నారు.
నిమ్స్ యూరాలజీ వైద్యులు మూత్రపిండ మార్పిడి ఆపరేషన్లతో పాటు ఎటువంటి అంతరాయం లేకుండా ఇతర యూరాలజీ శస్త్ర చికిత్సలను కొనసాగిస్తున్నారు. కాగా, అవయవ దానం కార్యక్రమంలో దేశంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది.
ఆర్గాన్ డొనేషన్‌లో తెలంగాణ టాప్ : మంత్రి హరీష్ రావు
4 నెలల్లో 50 కిడ్నీ మార్పిడి సర్జరీలు చేసి రోగులకు పునర్జన్మను ప్రసాదించిన నిమ్స్ వైద్యులను ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీష్ రావు అభినందించారు. సీఎం కేసీఆర్ మార్గనిర్దేశంలో అత్యంత ఖరీదైన వైద్యం పేదలకు చేరువైందనీ, తద్వారా అనేక మంది అవయవ మార్పిడి బాధితులకు పునర్జన్మ లభిస్తుందని కొనియాడారు.
గాంధీ ఆసుపత్రిలో రూ.35 కోట్లతో ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ సెంటర్ ఏర్పాటు చేసుకుంటున్నామనీ, ఇది పూర్తయితే అవయవ మార్పిడి సేవలు మరింత విస్తృతం అవుతాయన్నారు. ఆర్గాన్ డొనేషన్‌లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉందన్నారు.
అవయవ దానాన్ని ప్రోత్సహించి జీవన్‌దాన్‌లో పేరు నమోదు చేసుకుని ఎదురు చూస్తున్న వారికి నిండైన జీవితం అందించాలని ఈ సందర్భంగా ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.