హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఏళ్లకు ఏళ్లు ఇండ్లను విడిచిపెట్టి, యూనివర్సిటీల్లో, హాస్టళ్లలో, కిరాయి రూముల్లో ఉంటూ టీచర్ ఉద్యోగాల కోసం అభ్యర్థులు సన్నద్ధమవుతున్నారు. కానీ ఇంత వరకూ టీచర్ ఉద్యోగాల నోటిఫికేషన్ వెలువడదాయే…కొలువులు రావాయే…పెళ్లిళ్లు కావాయే అని బీఎడ్, డీఎడ్ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బడిపంతులు ఉద్యోగమంటే మక్కువతో బీఎడ్, డీఎడ్ చేసి ఆ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారు సుమారు 4 లక్షల మంది వరకు ఉన్నారు. తమ కలల కొలువు ఎప్పుడొస్తుందోనని నిరీక్షిస్తున్నారు. రాష్ట్రంలో టీఆర్టీ (టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్) నోటిఫికేషన్ మినహా ఇప్పటికే దాదాపు అన్ని నోటిఫికేషన్లు వెలువడ్డాయి.
కేవలం టీచర్ పోస్టుల కోసమే ఎదురు చూస్తున్న వారు 4 లక్షల మందిలో సంగం మంది పైనే ఉంటారు. ఏజ్‌బార్‌కు దగ్గరపడుతుండడం, పెళ్లి చేసుకోవాలనే ఒత్తిడి రావడంతో ప్రిపరేషన్‌కు పుల్‌స్టాప్ పెట్టాల్సి వస్తుందని పలువురు అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న ప్రభుత్వ ప్రకటనలు నమ్మి వయసు మీరుతున్న అభ్యర్థులెందరో కోచింగ్ సెంటర్లలో వేలకు వేలు పోసి శిక్షణతోపాటు హాస్టళ్లలో ఉంటున్నారు. చివరి ప్రయత్నంలో అయినా ఉద్యోగం సాధించాలన్న పట్టుదలతో నిరీక్షిస్తున్నారు. టీఆర్టీకి ఎదురుచూస్తూ పెళ్లిళ్లు వాయిదా వేసుకున్న వారు వేలాదిమంది అభ్యర్థులు ఉన్నారు. టెట్ పాసై టీఆర్టీకి ఎదురచూస్తూ పరీక్ష రాసిన తర్వాతే పెళ్లి చేసుకోవాలని లక్షలాది మంది అభ్యర్థులు తమ వివాహాలను కూడా వాయిదా వేసుకుంటున్నారని అభ్యర్థులు తెలుపుతున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 26,074 ప్రభుత్వ పాఠశాలల్లో 15 వేల వరకు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వం 2022 మార్చిలో అసెంబ్లిలో 13వేల ఖాళీలను విద్యాశాఖలో భర్తీ చేస్తామని ప్రకటించింది. అందులో 10 వేల వరకు టీచర్ పోస్టులే ఉన్నాయి. ఆ ఖాళీలను భర్తీ చేయడంలో భాగంగానే 2022 జూన్ 12న టెట్ నిర్వహించారు. టెట్ నిర్వహించి కూడా నేటికి సరిగ్గా ఏడాది పూర్తయింది. కానీ ఇంత వరకూ టీఆర్టీ నోటిఫికేషన్ కూడా వేయలేదు. ఆర్థికశాఖ కూడా దానికి సంబంధించిన అనుమతినివ్వకపోవడంతో బీఎడ్, డీఎడ్, టెట్ అర్హత కలిగిన అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎన్నికల గడువు ముంచుకొస్తుంది. ఎన్నికల ముందు టీఆర్టీ నోటిఫికేషన్ వస్తుందా? రాదా? అని నిరీక్షిస్తున్నారు.
ఆరేళ్లుగా నోటిఫికేషనే లేదు…
టీఆర్టీ నోటిఫికేషన్‌నుఇప్పట్లో వేసే ఆలోచనలో ప్రభుత్వం లేనట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలో చివరిసారిగా టీఆర్టీ నోటిఫికేషన్ 2017లో వెలువడింది. మళ్లి ఇంత వరకు దాదాపు ఆరేళ్లుగా టీఆర్టీ లేదా డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడనేలేదు. అయితే టీఆర్టీ నోటిఫికేషన్‌ను ఎన్నికల గడువుకు రెండు మూడు నెలల ముందే వేయాలి. లేకుంటే ఇక ఎన్నికలు అయిన తర్వాతే వేయాల్సి ఉంటుంది. టీఆర్టీ నోటిఫికేషన్‌కు టీచర్ల బదిలీలు, ప్రమోషన్లు అంశం కూడా ఒకింత ఆటంకంగా మారిందని విద్యావర్గాలు పేర్కొంటున్నారు. అయితే అభ్యర్థులు మాత్రం బదిలీలు, ప్రమోషన్ల అంశాన్ని టీఆర్టీతో ముడిపెట్టకుండా టీచర్ పోస్టులు వేయాలని డిమాండ్ చేస్తున్నారు.
టీఆర్టీ తప్ప అన్ని నోటిఫికేషన్లు వెలువడ్డాయి: రావుల రామ్మోహన్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం అధ్యక్షులు కేవలం టీఆర్టీ నోటిఫికేషన్ తప్ప దాదాపు మిగిలిన అన్నీ నోటిఫికేషన్లు వెలువడ్డాయి. ఇప్పటికే కొన్నింటి పరీక్షలు జరిగాయి. ఇంకా కొన్ని పోస్టులకు సంబంధించిన పరీక్షలు జరగాల్సి ఉంది. జూన్ 12కి టెట్ పరీక్ష నిర్వహించి సంవత్సరం పూర్తయింది. ఇంత వరకూ టీచర్ పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వలేదు. అభ్యర్థులు సొంతూళ్లకు దూరంగా ఉంటూ పెళ్లిళ్లను వాయిదా వేసుకుంటూ ప్రిపేర్ అవుతున్నారు. టీచర్ ఉద్యోగం కొట్టాలనే పట్టుదలతో చదువుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం నోటిఫికేషన్ వేయడంలేదు.