Saturday, November 23, 2024

స్పైస్‌జెట్‌ సేవల విస్తరణ.. 26 నుంచి దశలవారీగా నాన్‌ స్టాప్‌ విమాన సర్వీసులు..

న్యూఢిల్లి : అంతర్జాతీయ, దేశీయ నెట్‌వర్క్‌ను విస్తరించే దిశగా అడుగులు వేస్తున్నట్టు ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌ ప్రకటించింది. ఈ మేరకు సోమవారం ఓ కీలక ప్రకటన చేసింది. దేశీయంగా, అంతర్జాతీయంగా నాన్‌ స్టాప్‌ విమాన సర్వీసులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిపింది. అదనపు ఫ్రీక్వెన్సీ కోసం.. మరికొన్ని కొత్త విమానాలను కూడా ఉపయోగించేందుకు నిర్ణయించినట్టు సంస్థ వివరించింది. స్పైస్‌జెట్‌ చీఫ్‌ కమర్షియల్‌ ఆఫీసర్‌ శిల్ప భాటియా మాట్లాడుతూ.. నాన్‌ స్టాప్‌ సర్వీసులు ఏప్రిల్‌ 26 నుంచి ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. దఫాల వారీగా ఈ విమానాలు అందుబాటులోకి వస్తాయని వివరించారు. కొత్త విమానాలు సర్వీసుల్లోకి చేరడంతో.. జాతీయ, అంతర్జాతీయ స్పైస్‌జెట్‌ సేవలు మరింత బలోపేతం అవుతాయని అభిప్రాయపడ్డారు. ప్రయాణికుల నుంచి వస్తున్న డిమాండ్‌, కోరిక మేరకు సేవల విస్తరణ జరుగుతున్నదని, అహ్మదాబాద్‌ నుంచి ఒమన్‌లోని మస్కట్‌కు నాన్‌ స్టాప్‌ విమాన సర్వీసు అందుబాటులోకి వచ్చినట్టు వివరించారు. ముంబై నుంచి బంగ్లాదేశ్‌లోని ఢాకా, కోజికోడ్‌ నుంచి సౌదీ అరేబియాలోని జెడ్డా, రియాద్‌కు, ముంబై నుంచి సౌదీ అరేబియాలోని జెడ్డా, రియాద్‌కు నాన్‌ స్టాప్‌ సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు.

సరికొత్త మార్గాల్లో సేవలు..

అదేవిధంగా దేశీయంగా కూడా కొత్త రూట్స్‌లో సేవలు అందిస్తున్నామని శిల్ప భాటియా ప్రకటించారు. అహ్మదాబాద్‌-గోవా, అహ్మదాబాద్‌-బెంగళూరు, అహ్మదాబాద్‌-షిర్డీ, ముంబై-తిరుపతి, ముంబై-గువాహటికి స్పైస్‌ జెట్‌ సేవలు అందుతాయని తెలిపారు. ఢిల్లి-జబల్‌పూర్‌, ఢిల్లి-లేహ్‌, అహ్మదాబాద్‌-డెహ్రాడూన్‌, హైదరాబాద్‌-షిర్డీ, ముంబై-గోవా, ముంబై-శ్రీనగర్‌ మార్గాల్లో కూడా ఫ్రీక్వెన్సీలను పెంచుతున్నట్టు ప్రకటించారు. నాన్‌ స్టాప్‌ సర్వీసులతో పాటు కొత్త మార్గాల్లో సేవలు అందుబాటులోకి తీసుకురావడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. కరోనా కారణంగా సంస్థ చాలా ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొందని, ఈ సేవలతో కొంత ఆర్థికపరమైన ఒత్తిడి తగ్గే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా ఏవియేషన్‌ ఇండస్ట్రీ మొత్తం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు గుర్తు చేశారు. విమానయాన సేవలు పెరగడంతో.. ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందని, ఫలితంగా టూరిజం, హోటల్స్‌ ఆర్థికంగా వృద్ధి చెందుతాయని వివరించారు. స్థానికంగా ఉన్న సంస్థలకు మరింత ఆర్థికపరమైన ప్రోత్సాహం కూడా అందుతుందని తెలిపారు. దేశీయ, అంతర్జాతీయ సేవలు అందించే రూట్స్‌లో బోయింగ్‌ 737, క్యు400 విమానాలను ఉపయోగించనున్నట్టు వివరించారు. బుకింగ్‌ కోసం స్పైస్‌జెట్‌ అధికారిక వెబ్‌సైట్‌ లేదా మొబైల్‌ యాప్‌ను ఎంచుకోవాల్సిందిగా సూచించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement