రిలయన్స్ జియో తన 5జీ సర్వీస్లను శరవేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే దేశంలోని చాలా ప్రధాన నగరాల్లో 5జీ సేవలు అందిస్తున్న జియో తాజాగా మరో 50 నగరాల్లో వీటిని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ప్రకటించింది. కొత్తగా సేవలు ప్రారంభించిన నగరాల్లో వినియోగదారులు వెల్కమ్ ఆఫర్ను వినియోగించుకోవచ్చని తెలిపింది. ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండానే 1జీబీపీఎస్ కంటే ఎక్కువ వేగంతో అపరిమిత డేటాను వినియోగించుకోవచ్చని జియో తెలిపింది. తాజాగా ప్రకటించిన వాటితో కలిపి ఇప్పటి వరకు జియో 5జీ సేవలు 184 నగరాలు, పట్టణాల్లో అందుబాటులోకి వచ్చాయి.
కొత్తగా 17 రాష్ట్రాల్లో 50 నగరాల్లో ఈ సేవలు ప్రారంభించినట్లు తెలిపింది. తెలంగాణలోని నల్లగొండ, ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు, కడప, నర్సారావుపేట, ఒగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, విజయనగరంలో జియో 5జీ సేవలు ప్రారంభించారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు అస్సాం, ఛత్తీస్గఢ్, గోవా, హరియాణ, ఝార్ఖండ్, కర్నాటక, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని పలు నగరాల్లో కొత్తగా జియో సేవలును ప్రారంభిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు జియో 5జీ సర్వీస్లను 2023 డిసెంబర్ 31 నాటికి అందిస్తామని రిలయన్స్ జియో ప్రకటించింది.