హైదరాబాద్, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉపాధిని విస్తృతం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. నవంబర్ రెండవ వారంలో హుస్నాబాద్‌లో మెగా ఫారిన్ జాబ్ మేళా నిర్వహించాలని సూచించారు. అర్హత కలిగిన నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి వారి స్కిల్స్ ఆధారంగా ఉద్యోగాలివ్వాలని తనను కలిసిన కంపెనీ ప్రతినిధులకు చెప్పారు.
వివిధ దేశాల వారీగా స్టాల్స్ ఏర్పాటు చేసేలా టాంకాం ప్రతినిధులతో శుక్రవారం మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశం నిర్వహించారు. హుస్నాబాద్ నిరుద్యోగ యువత ఫారిన్ జాబ్ మేళాకు ఎన్‌రోల్మెంట్ చేసుకోవాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి చెందిన దేశాల్లో భారీ వేతనాలతో ఉన్న ఉద్యోగ అవకాశాలు పొందేలా రవాణాబీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సచివాలయంలో టాంకాం ప్రతినిధులతో సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
హుస్నాబాద్ లో నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి వివిధ రంగాల్లో వారికి ఉన్న స్కిల్స్ ఆధారంగా వివిధ దేశాల్లో మంచి జీతాలతో ఉద్యోగ అవకాశాలు కల్పించేలా మెగా ఫారిన్ జాబ్ మేళాను ఏర్పాటు- చేయాలని నిర్ణయించారు. నవంబర్ మొదటి వారంలో జరిగే జాబ్ మేళా కోసం మండలాల్లో అవగాహన కల్పించాలని మూడు జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.
ప్రతి గ్రామంలో ఆసక్తి ఉన్న నిరుద్యోగ యువత డేటా సేకరించి వారికి ఆసక్తి ఉన్నా విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ప్రోత్సహించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ఇప్పటికే హుస్నాబాద్ నియోజకవర్గంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకి మంచి స్పందన వచ్చిందని, దాని ద్వారా 5 వేల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయని తెలిపారు.
విదేశాల్లో లక్షల్లో జీతాలు ఉన్న ఉద్యోగాలకు టాంకాం కంపెనీ ద్వారా నైపుణ్యల్లో శిక్షణ ఇచ్చి వారికి ఉద్యోగ భద్రత కల్పిస్తూ ఇక్కడి నుండి మంచి కంపెనీలకు పంపించడానికి ఉన్న మెరుగైన అవకాశాలను ఉపయోగించుకోవాలని సూచించారు.
ముఖ్యంగా జర్మనీ, జపాన్ , కెనడా, గల్ఫ్ దేశాలు, యూఎస్‌ఏ, యూకే, ఇజ్రాయేల్, న్యూజిలాండ్ దేశాల్లో ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు ఉండనున్నాయి. ఇప్పటికే టాంకాం ద్వారా శిక్షణ ఇచ్చి వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు అధికారులు తెలిపారు. సమావేశంలో స్పెషల్ సెక్రటరీ ఇండస్ట్రీస్ర్ టాంకాం సీఈఓ డా.విష్ణు వర్ధన్ రెడ్డి , టాంకాం జిఎం నాగ భారతి, షబ్నా టాంకాం మేనేజర్ ఇతర అధికారులు పాల్గొన్నారు.