Friday, November 22, 2024

Agriculture | విస్తరించిన నైరుతి.. జోరందుకున్న‌ సాగు పనులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఆలస్యంగానైనా నైరుతి పలకరించడంతో రాష్ట్ర వ్యాప్తంగా సాగుపనులు ముమ్మరంగా సాగుతున్నాయి. పలు జిల్లాల్లో రైతులు విత్తనాలు వేయడం ప్రారంభించారు. ఆలస్యంగానైనా సాగుకు నైరుతి రుతుపవనాలు ప్రాణం పోశాయని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.వర్షాలు కురవడంతోరోజూ వేలాది ఎకరాల్లో పత్తి, సోయా, కంది తదితర విత్తనాలను రైతులు విత్తుతుతున్నారు. ఆలస్యంగా వచ్చిన నైరుతి రుతువపనాలు ముఖ్యంగా పత్తిసాగుకు ప్రాణం పోశాయి. ఏటా జులై 15వరకు పత్తి విత్తనాలు విత్తేందుకు సమయం ఉంటుంది. అయితే ఏటా జూన్‌ 5కల్లా పలకరించే నైరుతి రుతుపవనాలు ఈఏడాది జూన్‌ 20నాటికీ కూడా పలకరించకపోవడంతో అదనులో వర్షాలు కురుస్తాయో లేదోనన్న ఆందోళనలో పత్తి రైతులు కూరుకుపోయారు.

రెండు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులుగా వరంగల్‌, హన్మకొండ, ములుగు, భూపాలపల్లి, మమహూబాబాద్‌, ఆదిలాబాద్‌, మహబూబ్‌నగర్‌, నిర్మల్‌ తదితర జిల్లాల్లో వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయి. నేల తడిసి విత్తనాలు వేసేందుకు అనువైన పరిస్థితులు నెలకొనడంతో ప్రస్తుతం రైతులు జోరుగా పత్తి విత్తనాలు నాటుతున్నారు. వర్షాలు ఆలస్యమైనా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 15లక్షల ఎకరాల్లో రైతులు పత్తి విత్తనాలు విత్తారు. అయితే వర్షాలు ఆలస్యం కావడంతో వాటిలో సగం ఎండిపోయాయి. కొన్ని మొలకెత్తినా ఒకేఆకుతో ఎదిగాయి.

తాజా వర్షాలతో ఆ మొక్కలు ప్రాణం పోసుకోనున్నాయి. ఈ ఏడు రాష్ట్రంలో దాదాపు 60లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. రాష్ట్రంలో పత్తి సాగులో మొదటిస్థానంలో వరంగల్‌, ఆ తర్వాత నల్గొండ, కరీంనగర్‌ జిల్లాలు ఉన్నాయి. వికారాబాద్‌, సూర్యాపేట జిల్లాల్‌ పెద్ద ఎత్తున కంది సాగవుతుండగా, నిజామాబాద్‌ జిల్లాలో తొలకరికి సోయాబిన్‌ విత్తనాలను రైతులు విత్తారు. వారంపాటు వర్షాలు ఇదే మాదిరిగా కురిస్తే పత్తి, కందితోపాటు వరి సాగు కూడా ముమ్మరం కానుందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు.

- Advertisement -

నాలుగు రోజులపాటు భారీ వర్షాలు…

నైరుతి రుతుపవనాల ప్రభావంతో రానున్న నాలుగు రోజులపాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ నెల 27 వరకు రాష్ట్రానికి భారీ వర్ష సూచన ఉందని హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. శనివారం ఆదిలాబాద్‌, కొమరంబీమ్‌ ఆసీఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, నల్గొండ, సూర్యాపేట, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి జిల్లాల్లో, ఆదివారం ఆదిలాబాద్‌, కొమరంబీమ్‌ ఆసీఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో, సోమవారం ఆదిలాబాద్‌, కొమరంబీమ్‌ ఆసీఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరకిసిల్ల జిల్లాల్‌ఓ భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది.

మరిన్ని ప్రాంతాలకు విస్తరించిన నైరుతి…

తెలంగాణ రాష్ట్రంలోకి గురువారం ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు శుక్రవారం మరిన్ని ప్రాంతాలకు విస్తరించాయి. ఈ మేరకు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. గురువారం ఖమ్మంలోకి ప్రవేశించిన రుతుపవనాలు నిజామాబాద్‌ వరకు విస్తరించాయని తెలిపింది. రానున్న 1, 2 రోజుల్లో తెలంగాణ అంతటా విస్తరించే అవకాశం ఉంది. అదే సమయంలో వాయివ్య బంగాళాఖాతం పరిసరాల్లోని ఒడిశా, పశ్చిమబెంగాల్‌ తీరాలకు దగ్గరలో సగటు సముద్ర మట్టం నుంచి 7.6 కి.మీ వరకు ఆవర్తనం కొనసాగుతోందని ఎత్తుకు వెళ్లేకొద్దీ అది నైరుతి దిశగా కొనసాగుతోందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ సానుకూల పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement