న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఖమ్మం జిల్లాలో జాతీయ రహదారి సమస్యలపై బీఆర్‌ఎస్ నేతలు చేసిన విజ్ఞప్తులపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. బీఆర్‌ఎస్ లోక్‌సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారధి, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మంగళవారం కేంద్రమంత్రి గడ్కరీని న్యూఢిల్లీలోని ఆయన కార్యాలయంలో కలిసి పలు అంశాలపై లేఖలు సమర్పించారు. ఖమ్మం – అశ్వారావుపేట జాతీయ రహదారి సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. తన నియోజకవర్గం సత్తుపల్లి మీదుగా వెళ్లే జాతీయ రహదారులను మరింత విస్తరించాల్సిందిగా, రోడ్లకు ఇరువైపులా డ్రైన్స్ మంజూరు చేయాల్సిందిగా ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గడ్కరీని కోరారు.
తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా గుండా వెళ్లే జాతీయ రహదారులు, వాటి విస్తరణ, కొత్తగా కట్టిన కలెక్టరేట్ వద్ద అలైన్మెంట్ మార్పు, డ్రైన్స్ మంజూరు చేయాల్సిన అవసరాన్ని ఆయనకు వివరించారు. జాతీయ రహదారిలోని తల్లాడ, కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి పట్టణాల్లో అంతర్గత రహదారుల విస్తరణ, మురుగు కాల్వల నిర్మాణం, సెంట్రల్ లైటింగ్ వంటి అంశాలపై ఎంపీ నామా గతంలోనే ప్రతిపాదనలు సమర్పించారు. మళ్లీ రాజ్యసభ ఎంపీలతో కలిసి నితిన్ గడ్కరీకి వినతిపత్రం అందజేశారు.
ఎంపీలు, ఎమ్మెల్యే తన దృష్టికి తెచ్చిన అంశాలను సావధానంగా విన్న ఆయన సానుకూలంగా స్పందించారు. ఆయా అంశాలపై చర్యలు చేపట్టవలసిందిగా అధికారులకు ఆదేశాలిచ్చారు. కల్లూరు మండలం లింగాల, వేంసూర్ వద్ద రెండు ఎంట్రీ ఎగ్జిట్ల ఏర్పాటుకు కేంద్ర మంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఎంపీలు వెల్లడించారు. గడ్కరీకి ధన్యవాదాలు తెలుపుతూ బీఆర్‌ఎస్ నేతలు ఆయనను శాలువాతో సత్కరించారు.