Tuesday, November 19, 2024

Exclusive – పేద‌ల ప్రాణాలే పెట్టుబడి… కల్తీ కల్లుతో అక్ర‌మార్జ‌న‌!

నిర్మ‌ల్ కేంద్రంగా మ‌త్తు ర‌సాయ‌నాల ర‌వాణా
క‌ల్లు క‌ల్తీ కోసం భారీ ఎత్తున నిల్వ‌లు
స‌మాచారం అందుకున్న క్ష‌ణాల్లో మెరుపుదాడులు
రూ.43 ల‌క్ష‌ల విలువైన మ‌త్తు ప‌దార్థాలు ప‌ట్టివేత‌
ముగ్గురిపై కేసు నమోదు .. ఒకరి అరెస్టు
నిందితుడిపై ఇప్ప‌టికే ఎనిమిది కేసులు

ద‌స‌రా పండ‌గ జ‌రుగుతున్న రోజులు. మామూళ్ల రోజుల‌కంటే క‌ల్లు విక్ర‌యాలు ఐదు రెట్లు పెరిగే అవ‌కాశం ఉంది. తెలంగాణ‌లో క‌ల్లు కొర‌త‌గా ఉండ‌డం… పండ‌గ రోజుల్లో నాణ్య‌త చూడకుండా తాగేవారు అధికంగా ఉంటార‌న్న న‌మ్మ‌కం.. ఈ రెండింటిని ఆస‌రాగా చేసుకుని ర‌సాయ‌నాల‌తో క‌ల్లు, సారా త‌యారీకి కొంద‌రు సిద్ధ‌ప‌డుతున్నారు. అలాంటి వారికి నిషేధిత మ‌త్తు ర‌సాయనాలు స‌ర‌ఫ‌రా చేసేందుకు నిర్మ‌ల్ ప‌ట్ట‌ణం వేదిక అయింది. ఈ ర‌సాయ‌నాల‌తో త‌యారు చేసిన క‌ల్లు తాగితే ప్రాణాలు హ‌రించుకుపోతాయి. అయినా పేద‌ల ప్రాణాలు ప‌ణ్ణంగా పెట్టి అక్ర‌మార్జ‌న‌కు కొంద‌రు సిద్ధ‌ప‌డుతున్నారు. అయితే స‌మాచారం అందుకున్న వెంట‌నే రాష్ట్ర ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్ట‌ర్ క‌మ‌లాసింగ్ ఆఘ‌మేఘాల‌పై దాడులు నిర్వ‌హించేందుకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఒక్క నిర్మ‌ల్‌లోనే రూ.43 ల‌క్ష‌ల విలువైన మ‌త్తు ప‌దార్థాలు ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని విచారిస్తే ఇంకా ఎంత నిల్వ‌లు ఉన్నాయో బ‌య‌ట‌ప‌డతాయి.
—ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, నిర్మ‌ల్


ప‌ట్టుబ‌డిందిలా…
రాష్ట్ర ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్ట‌ర్ క‌మ‌లాసింగ్ ఆదేశాల మేర‌కు నిర్మ‌ల్ జిల్లా కేంద్రంలో హైదరాబాద్ ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ సూప‌రింటిండెంట్ ప్ర‌దీప్ ఆధ్వ‌రంలో సిబ్బంది గురువారం మెరుపుదాడులు చేశారు. నిర్మ‌ల్ ప‌ట్ట‌ణంలోని ద్వారకా నగర్ కాలనీలో గాల గంధం శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో నిల్వ ఉంచి 3.3 కిలోల అల్పాజోలం ను స్వాదీనం చేసుకున్నారు. ఆయ‌న్ని విచారించ‌గా శాంతినగర్ కాలనీలోని ఓ ఇంట్లో 26 బస్తాలలో నిల్వ చేసిన‌ 728 కిలోల విలువ చేసే క్లోరో హైడ్రేడ్ ప‌ట్టుబ‌డింది.

- Advertisement -

మ‌హారాష్ట్ర‌, రాజ‌స్థాన్ నుంచి దిగుమ‌తి
మ‌హారాష్ట్ర సోలాపూర్ లో శ్రీ‌నివాస్ అనే వ్య‌క్తి నుంచి క్లోరో హైడ్రేడ్‌, రాజ‌స్థాన్ లోని రూప్ సింగ్ నుంచి అల్పాజోలం కొనుగోలు చేసిన‌ట్లు ఎక్స్‌జ్ పోలీసుల విచార‌ణలో తేలింది. ఈ సందర్భంగా సూప‌రింటిండెంట్‌ ప్రదీప్ రావు మాట్లాడుతూ.. స్వాధీనం చేసుకున్న సామాగ్రి విలువ రూ.43 లక్షలు ఉంటుందని చెప్పారు. శ్రీనివాస్ గౌడ్ పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. గతంలో నిందితుడు శ్రీ‌నివాస్ గౌడ్‌పై ఏడు కేసులు, పీడీ యాక్టు కేసు ఉందని చెప్పారు. ముగ్గురిపై కేసు న‌మోదు చేశామ‌ని, ఒక‌రిని అరెస్టు చేశామ‌ని, మ‌రో ఇద్ద‌రిని అరెస్టు చేయాల్సి ఉంద‌ని తెలిపారు.

క‌ల్లులో క‌ల్తీ కోసమే దిగుమ‌తి…
ద‌స‌రా న‌వ‌రాత్రి ఉత్స‌వాలు సంద‌ర్భంగా క‌ల్లుకు డిమాండ్ పెరుగుతోంది. అయితే క‌ల్లు ఉత్ప‌త్తి కూడా త‌గ్గిపోవ‌డంతో క‌ల్తీ క‌ల్లు విక్ర‌యించ‌డానికి అక్ర‌మ వ్యాపారులు సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ నేప‌థ్యంలో మ‌హారాష్ట్ర‌, రాజ‌స్థాన్ నుంచి ర‌సాయ‌నాలు నిర్మ‌ల్‌కు చెందిన శ్రీ‌నివాస్ గౌడ్ నిల్వ చేసుకున్నారు.

క‌ల్లు త‌యారీకి…
పది గ్రాముల అల్పోజోలంతో వంద పెట్టెల కల్తీ కల్లు తయారు చేయచ్చు. సాధార‌ణ క‌ల్లు కంటే మ‌త్తు కూడా అధికంగా ఇస్తుంది. అందుకే ఈ క‌ల్లు తాగిన వారు ఇలాంటి క‌ల్లు కోసం అల‌వాటు ప‌డిపోతారు. ఈ ర‌సాయ‌నం వినియోగించ‌డం వ‌ల్ల కొద్ది నెల‌ల‌కే కాలేయం దెబ్బ‌తింటుంది. త‌ద్వారా ఈ క‌ల్లు తాగిని ప‌ది నెల‌లోనే ప్రాణాలు పోయే అవ‌కాశం ఉంటుంది. అలాగే అల్పోజోలం, క్లోరో హైడ్రెడ్‌తో సారా కూడా త‌యారు చేయొచ్చు. అల్పోజోలం కిలో ధ‌ర రూ.ప‌ది ల‌క్ష‌ల‌పైనే ఉంటుంది. కిలో అల్పోజోలంతో ఎంత క‌ల్లు త‌యారు చేయొచ్చో ఊహించుకోవ‌చ్చు.

నిందితుడిపై ఎనిమిది కేసులు
ప్రభుత్వం నిషేధించిన ఆల్పోజోలం, క్లోరో హైడ్రేడ్‌లను రాజస్థాన్‌, సోలార్‌ నుంచి తక్కువ ధరలకు తెచ్చి వివిధ ప్రాంతాల్లో వారికి అమ్మకాలు చేస్తున్నారంటే శ్రీ‌నివాస్ గౌడ్ వెనుక సూత్ర‌దారులు ఎంద‌రో ఉండి ఉంటార‌ని ప‌లు అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. నిందితుడు శ్రీ‌నివాస్ గౌడ్‌పై 2016 నుంచి 2024 వరకు వివిధ‌ ప్రాంతాల్లో ఎనిమిది కేసులు నమోదు చేశారు. చివరకు పీడీ యాక్ట్‌ కూడ పెట్టారు. అయినా అక్రమ వ్యాపారాన్ని వదులుకోలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement