Sunday, October 20, 2024

Exclusive – కమలం కళకళ …. అభివృద్ధి వెలవెల

కమలంకళకళ అభివృద్ధి వెలవెల

నిధుల వరద రావాలి.. అదే బీజేపీ అజెండా కావాలి

వికసిత్‌ తెలంగాణతోనే కమల వికాసం

లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అనూహ్య విజయం

ఎన్నడూ లేని రీతిలో 8 ఎంపీ స్థానాల్లో గెలుపు

కేంద్ర కేబినెట్‌లో రెండు మంత్రి పదవులు

- Advertisement -

అసెంబ్లిలోనూ పెరిగిన బలం..

రాష్ట్రంలో పెరిగిన ఓట్‌షేర్‌

విజేతల్లో ఉద్దండులు..

అయినా పనితీరు నిరాశాజనకం నిధులు రాబట్టడంలో విఫలం

ఏపీలో పరిస్థితి భిన్నం

కేంద్రంనుంచి సంపూర్ణ మద్దతు దండిగా నిధులు..

తేరుకుంటున్న ఆంధ్ర

తెలంగాణపై కేంద్రం చిన్నచూపు

అందని నిధులు..బడ్జెట్‌లో విదిలింపులు

నియోజకవర్గాల్లో అభివృద్ధి మృగ్యం

పరిస్థితి మారాలి.. నిధులు వెల్లువలా రావాలి

రాష్ట్ర బీజేపీ సారధి కిషన్‌రెడ్డి చొరవ చూపాలి

ఎంపీల మధ్య సమన్వయం కీలకం

అఖిలపక్షంతో హస్తినకు వెళ్లాలి

అప్పుడే సత్ఫలితాలు రాజకీయ విశ్లేషకుల సూచన

న్యూస్‌ నెట్‌వర్క్‌ ఇన్‌ఛార్జ్‌ – ఆంధ్రప్రభ

మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో దక్షిణాదిలో కర్నాటక తరువాత తెలంగాణలోనే భారతీయ జనతా పార్టీకి మంచి ఆదరణ లభించింది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పటికీ.. ఆ పార్టీతో ఢీ అంటే ఢీ అనేలా… సమఉజ్జీలా 8 స్థానాల్లో విజయం సాధించింది. అందుకు ప్రజల సంపూర్ణ మద్దతే కారణం. ప్రజల అండగా నిలిచినందుకు కేంద్రం కూడా తగిన ప్రాధాన్యత కల్పించింది. రాష్ట్రం నుంచి ఇద్దరికి కేంద్రమంత్రి మండలిలో చోటు ఇచ్చింది. కానీ ప్రజల ఆశలకు తగ్గట్టు ఆ పార్టీ ఎంపీలు పనిచేయడం లేదన్న అసంతృప్తి ప్రజల్లోపెరుగుతోంది కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో చొరవ చూపలేకపోతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ప్రధానంగా బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నుంచి ఈ విమర్శలు పెరుగుతున్నాయి. ప్రజల్లోనూ ఆ భావన ఉంది. అటు ఏపీకి కేంద్రం సమృద్ధిగా నిధులిస్తోంది. తెలంగాణలో ఆ పరిస్థితి లేదు. అడిగేవారు లేక ఈ పరిస్థితి. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని, వచ్చే అసెంబ్లి ఎన్నికల్లో అధికారం చేపట్టాలని ఉవ్విళ్లూరుతున్న కమలనాధుల అజెండా మారాలి. ఎవరికివారే యుమునా తీరే వైఖరి విడనాడి ఏకతాటిపై పనిచేయాలి. వికసిత్‌ భారత్‌ మాదిరిగానే వికసిత్‌ తెలంగాణ నినాదం అందుకోవాలి. బీజేపీ రాష్ట్ర సారధి కిషన్‌ రెడ్డి ఆ బాధ్యత తీసుకోవాలి. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పక్షాలతో హస్తినకు వెళ్లి నిధులు రాబట్టాలి. తాము ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలను ప్రగతిబాటలోకి తీసుకువచ్చామని ఎంపీలు నిరూపిస్తే ఓట్లవర్షం కురుస్తుందని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.

హైదరాబాద్‌, : మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో మంచి ఫలితాలు సాధించింది. ఎప్పుడూ లేని విధంగా ఏకంగా ఎనిమిది స్థానాల్లో విజయం సాధించింది. మంచి వాగ్ధాటి కలిగిన బండి సంజయ్‌, ఈటల రాజేందర్‌, అనుభవజ్ఞుడైన కిషన్‌ రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి, ధర్మపురి అరవింద్‌.. డీకే అరుణ… ఇలా ఉద్దండులకు జనం పట్టంకట్టారు. గత ఎన్నికలతో పోలిస్తే రాష్ట్రంలో బీజేపీ వోట్‌ షేర్‌ 16 శాతం నుంచి ఏకంగా 35 శాతానికి.. అంటే రెట్టింపుకు పైగా పెరిగింది. వేరే రాష్ట్రం నుంచి అయినప్పటికీ రాష్ట్రానికి చెందిన లక్ష్మణ్‌ రాజ్యసభకు ఎన్నికయ్యారు. వీరంతా లోక్‌సభలో తమ ప్రాంత సమస్యలపై గళం విప్పుతారని, నిధులు దండిగా రాబడతారని ఆశించారు. కానీ ప్రజలు ఆశించినంతగా వారు పనిచేయడం లేదన్న అంసతృప్తి పెరుగుతోంది.

పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు నిధుల వరద పారిస్తున్న కేంద్రం తెలంగాణకు విదిలిస్తోంది. అయినా రాష్ట్ర బీజేపీ ఎంపీలు ప్రశ్నించడం లేదు. నిధులు రాబట్టేందుకు కృషి చేయడం లేదు. ఇది సాధారణ పౌరుల మాటే కాదు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నేతలు తరచూ చేస్తున్న బహిరంగ విమర్శలు. దీనికి కారణం రాష్ట్ర బీజేపీలో ఏర్పడిన గందరగోళం. నాయకుల మధ్య అంతరాలు. అభిజాత్యాలు. ఆధిపత్య పోరాటాలు. అందరూ ఉద్దండులే. కానీ సమన్వయం లేదు. చొరవ లేదు. ఒకవేళ వారు లోక్‌సభలో గట్టిగా గళం విప్పి.. నిధులు రాబడుతున్నట్టయితే.. ఆ విషయాన్ని బలంగా చెప్పాల్సి ఉంటుంది. కానీ అదీ చేయడం లేదు. ఏతావాతా బీజేపీ ఎంపీల పనితీరుపై పెదవి విరుస్తున్నవారు ఎక్కువవుతున్నారు.

దక్షిణాదిలో బలం పెంచుకునేందుకు, అన్నీ కలసివస్తే వచ్చే శాసనసభ ఎన్నికల్లో విజయదుందుభి మోగించి అధికారం చేపట్టేందుకు అవకాశం ఉందని జాతీయ నాయకత్వం భావిస్తోంది. కానీ అంతకుముందు చేయాల్సిన పనులపై రాష్ట్ర నేతలు దృష్టి సారించడం లేదు. ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన నేతలకు, పాతకాలపు నేతలకు మధ్య సమన్వయం కొరవడింది. ఫలితంగా బీజేపీ సమస్యలు ఎదుర్కొంటోంది.గత లోక్‌సభ ఎన్నికల్లో సాధించిన 8 ప్రాంతాల్లో సికింద్రాబాద్‌ మినహా మిగిలినవన్నీ వెనుకబడిన ప్రాంతాలే. గెలిచినవారిలో నలుగురు ఓబీసీ వర్గాలకు చెందినవారే. బండి సంజయ్‌, ఈటల రాజేందర్‌, ధర్మపురి అరవింద్‌, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌ ఓబీసీ, బీసీ వర్గాలకు చెందినవారు.

ఆదిలాబాద్‌ ఎంపీ గోడం నగేష్‌ గిరిజనుడు. వీరంతా ఉద్దండులే. సమస్యలను ధాటీగా చెప్పగలవారే. గట్టిగా నిలదీసి నిధులు రాబట్టగలిగేవారే. రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడటంలో,నిలదీయడంలో వీరు ఇప్పుడిప్పుడే చొరవ చూపుతున్నారు. కానీ కేంద్రం నుంచి రాష్ట్రానికి మేలు చేసే విషయంలో పెద్దగా ఫలితం సాధించడం లేదు.

వచ్చే శాసనసభ ఎన్నికల్లో బీజేపీ మంచి ఫలితాలు సాధించాలంటే, వెనుకబడిన ప్రాంతాల్లో బీజేపీ అభివృద్ధి చేసి చూపించాలి. అప్పుడే ఓట్లు అడిగే హక్కు, అధికారం ఉంటాయి. సమయాన్ని వృధా చేసుకుంటే తర్వాత చింతించాల్సి వస్తుంది.

ఇక్కడ కొన్ని కీలక విషయాలను గుర్తించాలి. గత ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి అండగా నిలిచారు. అన్ని ప్రాంతాల్లో ఓట్‌ షేర్‌ పెరిగింది. నిజామాబాద్‌లో ధర్మపురి అరవింద్‌ (48శాతం), కరీంనగర్‌లో బండి సంజయ్‌ (45శాతం), మల్కాజ్‌గిరిలో ఈటల రాజేందర్‌ (51శాతం), సికింద్రాబాద్‌లో కిషన్‌రెడ్డి (45 శాతం), ఆదిలాబాద్‌లో గోడం నగేష్‌ (46శాతం), చేవెళ్లలో కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి (48శాతం), మహబూబ్‌నగర్‌లో డీకే అరుణ (42శాతం), మెదక్‌లో రఘునందన్‌ రావు (34శాతం) ఓట్‌షేర్‌ సాధించారు.

రీజియన్ల వారీగా కూడా బీజేపీ ఓట్‌ షేర్‌ పెరిగింది. అంటే, ప్రజల నుంచి గట్టి మద్దతు లభించింది. అటు కేంద్రం కూడా పదవుల పంపకంలో న్యాయమే చేసింది. కేంద్రమంత్రులుగా కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కు అవకాశం కల్పించింది. మిగిలిన ఎంపీలకు పార్లమెంటరీ కమిటీల్లోను, పార్టీ ఎన్నికల కమిటీల్లోను చోటిచ్చింది. వీరంతా రాష్ట్రానికి ప్రయోజనం కల్పించే పనులు చేస్తారన్న ఆశలు కలిగాయి.

కానీ ఆశించిన రీతిలో ఫలితాలు కన్పించడం లేదు. బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగినా గట్టిగా ప్రశ్నించలేదు. ఇవన్నీ ప్రజల్లో అసంతృప్తికి కారణం.వచ్చే అసెంబ్లి ఎన్నికల్లో విజయం సాధించాలంటే ఈ లోక్‌సభ నియోజకవర్గాల్లో అభివృద్ధి కీలకంగా మారుతుంది. ఒక్కో లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో దాదాపు ఏడు శాసనసభ నియోజకవర్గాలు ఉంటాయి. అంటే ఎనిమిది లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో 56 శాసనసభ నియోజకవర్గాలుంటాయి. అందువల్ల ఆ ఎనిమిది లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో బీజేపీ ఎంపీలు గట్టిగా పనిచేస్తే, దండిగా నిధులు రాబడితే, విస్తృత అభివృద్ధి సాధిస్తే… తిరుగుండదు. ఆయా శాసనసభ నియోజకవర్గాల్లోనూ జెండా ఎగరేయవచ్చు.

గత శాసనసభ ఎన్నికల్లో 8చోట్ల ప్రజలు గెలిపించారు. ఎంపీలుగా ఆ ప్రాంతాల్లోను అభివృద్ధికి సహకరించాలి.గట్టిగా అడిగితే కేంద్రం కాదని చెప్పే పరిస్థితి ఉండదు. ఎందుకంటే తెలంగాణలో జెండా ఎగరేయాలని గత రెండు ఎన్నికల నుంచి జాతీయ నాయకత్వం తహతహలాడుతోంది. మరి సమస్య ఎక్కడ ఉంది?రాష్ట్ర బీజేపీలోని గందరగోళమే ఈ పరిస్థితికి కారణం. నాయకుల మధ్య సమన్వయం లేదని స్పష్టమవుతూనే ఉంది.

సభ్యత్వ నమోదు కార్యక్రమంలోనూ అదే వైఖరి. ప్రజాసమస్యలపై పోరాటంలోనూ ఎవరికి వారే.. యుమునా తీరే వైఖరి. ఒకే సమస్యపై ఒక్కొక్కరు తలోరకంగా మాట్లాడుతున్నారు. బీజేపీ నేతలు, ఎంపీలూ మంచి అనుభవజ్ఞులు, పోరాడే తత్వం కలిగినవారు. కానీ వారిని ఏకతాటిపైకి తేవడమే సమస్యగా మారింది. పార్టీలోని అంతర్గత వైషమ్యాలకు ముగింపు పలకాలి. ఏకతాటిపైకి అందరూ రావాలి. రాష్ట్ర ప్రయోజనాలకు పెద్దపీట వేయాలి. కేంద్రం నుంచి దండిగా నిధులు రాబట్టాలి. అభివృద్ధి చేసి చూపించాలి. అప్పుడు అడగకపోయినా జనం ఓట్లేస్తారు. తెలంగాణలో కాషాయ పతాకం రెపరెపలాడుతుంది. కాలయాపన చేస్తే ప్రయోజనం దెబ్బతింటుంది.

జాతీయ నాయకత్వాన్ని ఒప్పించి.. నిధులు రాబట్టి ప్రజల్ని మెప్పించాలి. కేంద్ర పథకాలను విస్తృతంగా అమలుచేయాలి. అదే విజయం రహస్యం.పార్టీలో నాయకుల మధ్య, ఎంపీల మధ్య సమన్వయం చేసే బాధ్యత రాష్ట్ర బీజేపీ సారథిగా కిషన్‌ రెడ్డి స్వీకరించాలి. అభిజాత్యపు తెరలు, ఆధిపత్య వైషమ్యాలను తొలగించాలి. కేంద్రమంత్రిగా కేంద్రం నుంచి నిధులు, ప్రయోజనాలు సాధించేందుకు చొరవ చూపాలి. కూటమి ప్రభుత్వాలున్న ఆంధ్రప్రదేశ్‌, బీహార్‌లకు కేంద్రం నిధులిస్తున్న విషయాన్ని గ్రహించి అడుగులు వేయాలి. ఇందుకోసం అన్ని పార్టీలనూ కలుపుకువెళ్లాలి. హస్తినకు అఖిలపక్షాన్ని తీసుకువెళ్లాలి. నమ్మి ఓట్లు వేసిన ప్రజలకు న్యాయం చేయాలి. అప్పుడే విెకసిత్‌ తెలంగాణ సాకారమవుతుంది. బీజేపీ కళకళలాడుతుంది. ఇది రాజకీయ విశ్లేషకుల సూచన.

Advertisement

తాజా వార్తలు

Advertisement