Tuesday, November 19, 2024

Exclusive – రాహుల్​ గురి రాయ్​బరేలి! ఫ్యామిలీ సెంటిమెంట్​

ఢిల్లీ పీఠం దక్కాలంటే ఏపార్టీ అయినా 80 లోక్‌స‌భా స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌పై పట్టు సాధించాలి. ఈ క్రమంలో కాంగ్రెస్‌ కూడా ఇక్కడ తాను ఏమాత్రం తగ్గకూడదని నిర్ణయించుకున్న‌ట్టు తెలుస్తోంది. ప్రత్యర్థులు తమపై చేస్తున్న ప్రచారానికి చెక్‌పెడుతూ అగ్రనేత రాహుల్‌ గాంధీ తన తల్లి సోనియా స్థానాన్ని నిలబెట్టుకొనేందుకు రాయ్‌బరేలీలో నేరుగా రంగంలోకి దిగారు. 38 ఏండ్లుగా రాయ్‌బ‌రేలి గాంధీల‌ కుటుంబానికి కంచుకోట‌గా నిలుస్తోంది. 1952లో తొలుత ఇందిరా భ‌ర్త ఫిరోజ్ గాంధీ ఇక్క‌డి నుంచి ప్రాతినిథ్యం వహించారు. ఆ తర్వాత కొన్ని పరిణామాల నేపథ్యంలో ఇప్పటి వరకు జ‌రిగిన ఎన్నిక‌ల్లో కేవ‌లం మూడు సార్లు మాత్ర‌మే కాంగ్రెస్ ఓట‌మి చెందింది. ఇక‌.. త‌న నాయ‌న‌మ్మ ప్రాతినిథ్యం వ‌హించిన స్థానాన్ని కాపాడుకునేందుకు రాహుల్​ రంగంలోకి దిగారు. అయితే.. చాన్నాళ్లుగా గాంధీ ఫ్యామిలీకి స‌న్నిహితుడిగా ఉన్న వ్యక్తే ఇప్పుడు వారికి ప్రధాన ప్రత్యర్థిగా ఉండడం విశేషం.

గాంధీల కోట‌గా రాయ్‌బ‌రేలి స్థానం
బ‌రిలోకి దిగిన రాహుల్ గాంధీ
గాంధీల ఫ్యామిలీకి 38 ఏండ్లుగా కంచుకోట‌
ఇందిరా భ‌ర్త ఫిరోజ్ ప్రాతినిథ్యం ఇక్క‌డే
1952లో మొద‌లైన గాంధీల ప్ర‌స్తానం
1971 ఎన్నిక మాత్రం వివాదాస్ప‌దం..
కోర్టులో వ్య‌తిరేకంగా వ‌చ్చిన తీర్పు
1977లో మిన‌హా పోటీచేసిన ప్ర‌తిసారి విజ‌యం
ఆ మధ్య కాలంలోనే ఎమ‌ర్జెన్సీ విధించిన ఇందిర‌మ్మ‌
1952 నుంచి 2019 మ‌ధ్య‌.. మూడుసార్లే గాంధీలకు ఓట‌మి
మ‌రోసారి స‌త్తాచాటాల‌నుకుంటున్న రాహుల్‌
ఒక‌ప్ప‌టి ఆప్తుడే.. ఇప్పుడు ప్ర‌ధాన పోటీదారు
క‌మ‌ల‌నాథుల‌కు అందుకే పెరిగిన న‌మ్మ‌కం
వ‌య‌నాడ్ ఎన్నిక త‌ర్వాత మారిన రాహుల్ వ్యూహం

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, స్పెష‌ల్ డెస్క్‌ రాయ్‌బ‌రేలీ.. గాంధీల కుటుంబానికి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన లోక్‌స‌భా స్థానం.. 1952 నుంచి రాయ్‌బరేలీ నియోజకవర్గం గాంధీల కుటుంబానికి 38 ఏళ్లపాటు కంచుకోటగా నిలిచింది. తొలుత ఇక్కడి నుంచి ఇందిరా గాంధీ భర్త ఫిరోజ్ గాంధీ ప్రాతినిథ్యం వహించారు. ఆ తర్వాత ఇందిరా 1967 నుంచి 1980 వరకు ఇక్కడి నుంచి పోటీచేశారు. 1977లో మినహా పోటీచేసిన ప్ర‌తిసారి విజయం సాధించారు.

- Advertisement -

ఆ ఎన్నిక మాత్రం వివాదాస్పందం..

1971 ఎన్నిక వివాదాస్పదం కావడంతో ఆమెకు వ్యతిరేకంగా కోర్టు తీర్పు వచ్చింది. ఆ తర్వాత ఎమర్జెన్సీ విధించారు. అనంతరం నిర్వహించిన ఎన్నికలో జనతాపార్టీ అభ్యర్థి రాజ్‌నారాయణ్‌ చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత ఎన్నికల్లో రాయ్‌బరేలీ, మెదక్ నుంచి పోటీ చేసి గెలిచినా.. చివరి వరకూ మెదక్‌ స్థానానికి పరిమితమయ్యారు. ఇక సోనియా గాంధీ 2004 నుంచి వరుసగా ఇక్కడ విజయం సాధిస్తూ వస్తున్నారు. తాజాగా వ్యక్తిగత కారణాల రీత్యా రాజస్థాన్‌ నుంచి రాజ్యసభకు వెళ్లారు. దీంతో తన తల్లి ఖాళీ చేసిన స్థానంలో ఇప్పుడు రాహుల్‌ బరిలో నిలిచారు. 1952-2019 వరకు ఇక్కడ కాంగ్రెస్‌ కేవలం మూడు సార్లు మాత్రమే ఓడిపోయింది.

ఒకప్పటి ఆప్తుడే.. ఇప్పుడు ప్రత్యర్థి..

ప్ర‌స్తుతం రాయ్‌బరేలీ నుంచి బీజేపీ టికెట్‌పై బరిలో నిలిచిన దినేశ్‌ సింగ్‌ 2018 వరకు గాంధీ కుటుంబానికి అత్యంత ఆప్తుల్లో ఒకరు. ఆయన కుటుంబం ‘పంచవటి’గా కాంగ్రెస్‌లో సుపరిచితం. స్థానిక రాజకీయాల్లో ఆయన ఫ్యామిలీకి బలమైన పట్టు ఉంది. బ్లాక్‌ చీఫ్‌, జిల్లా పంచాయతీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు ఆయన కుటుంబంలో ఉన్నారు. ఒకప్పుడు హస్తం పార్టీలో ‘పంచవటి’ ప్రభావం ఎక్కువగానే ఉండేది. 2010, 2016లో దినేశ్‌ కాంగ్రెస్‌ టికెట్‌పై ఎమ్మెల్యేగా గెలిచారు. 2018లో పార్టీని వీడి బీజేపీలో చేరారు. ఆ మరుసటి సంవత్సరమే సోనియాపై పోటీ చేశారు. దాదాపు 1.6 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయారు.

క‌మ‌ల‌నాథుల‌కు పెరిగిన న‌మ్మ‌కం..

బీజేపీ అగ్ర నాయకత్వం ఆయన‌ను ఇప్పటికీ నమ్మడానికి ఓ బలమైన కారణం ఉంది. 2014 ఎన్నికల్లో కమలం పార్టీకి ఇక్కడి నుంచి కేవలం 1.73 లక్షల ఓట్లు మాత్రమే వచ్చాయి. దినేశ్‌ రాకతో ఓట్ల సంఖ్య దాదాపు రెట్టింపై 3.67 లక్షలకు చేరింది. 2021లో రాయ్‌బరేలీ జిల్లా పరిషత్‌ అధ్యక్ష ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించడానికి ఆయన పరపతి, వ్యూహం బాగా ఉపయోగపడ్డాయి. 2024లో సోనియా నియోజకవర్గంపై తక్కువగా దృష్టిపెట్టడంతో తమకు గెలుపు సాధ్యమని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో ఆయనకు స్థానికంగా పట్టు సడలనీయకుండా ఎమ్మెల్సీ టికెట్‌ ఇచ్చి గెలిపించింది. ఇప్పుడు యోగి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తున్నారు. మరోవైపు రాహుల్‌ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయడాన్ని కమలం పార్టీ ప్రచారానికి వాడుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

వయనాడ్‌ ఎన్నిక తర్వాతే..

మరోవైపు గత ఎన్నికల్లో రాహుల్‌ వయనాడ్‌లో ఘన విజయం సాధించారు. ఈ సారి కూడా ఆయన అక్కడ బరిలో నిలిచారు. ఆ ఎన్నికలు పూర్తయ్యే వరకూ యూపీలోని అమేథీ, రాయ్‌బరేలీ నియోజకవర్గ అభ్యర్థిత్వాలపై హస్తం పార్టీ ఏ నిర్ణయం తీసుకోలేదు. తాజాగా రాహుల్‌ ఇక్కడి నుంచి బరిలో దిగేందుకు మొగ్గు చూపడంతో ఆయన పేరు ఖరారైంది. ఇక అమేథీని తమ కుటుంబ సన్నిహితుడైన కేఎల్‌ శర్మకు అప్పగించారు. గాంధీలు ఢిల్లీలో ఉన్న సమయంలో వారి తరఫున రాయ్‌బరేలీ, అమేథీ నియోజకవర్గాల్లో కార్యక్రమాలను శ‌ర్మ‌ చక్కబెట్టేవారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement