Tuesday, October 29, 2024

Exclusive – అనుబంధాల్లేని చ‌క్ర‌బంధం! అటు ఫ్యామిలీ, ఇటు కోర్టు కేసులు

వైఎస్ జ‌గ‌న్‌కు ఎడ‌తెగ‌ని టెన్ష‌న్‌
బెయిల్ రద్దు అవుతుంద‌నే భ‌యం
ముగింపు దశలో సీబీఐ కేసు విచారణ
ఇప్పటికే ఆలస్యంపై సుప్రీం అసహనం
జగన్ శిబిరంలోనూ ప్రత్యామ్నాయ వ్యూహం
ముందు తల్లి.. చెల్లికి నోటీసు వాయనం
సానుభూతికోసం నాట‌కాలంటూ విమర్శ‌లు
అంద‌రి ఇళ్ల‌ల్లో ఉండేవే.. లైట్ తీసుకున్న జ‌గ‌న్‌

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, సెంట్ర‌ల్ డెస్క్‌:

- Advertisement -

ఎన్నికల్లో అనూహ్య ఘోర ఓటమితో గుక్కతిప్పుకోలేని స్థితిలోని వైసీపీ అధినేత జగన్ శిబిరంలో… మేథోమధనం క్లైమాక్స్ స్థాయికి చేరింది. ప్రజల్లో పటిష్ట సానుభూతిని కాపాడుకునే యత్నంలో పావులు కదుపుతోంది. ఎలాగు సీబీఐ కేసు విచారణ ఆగదు. ఇప్పటి వరకూ సీఎం హోదాలో కోర్టు బోనుకు దూరం పాటించారు. ఇప్పుడు అధికారం లేదు. జగన్ మోహన్ రెడ్డిని జైలుకు సాగనంపేందుకు తెగ ఉబలాట పడుతోంది. ఇటీవలే జగన్‌పై సీబీఐ కేసు విచారణలో జాప్యంపై సుప్రీం కోర్టు కూడా సీరియస్ కావటంతో.. ఇక ఈ కేసులో బెయిల్ రద్దు కావటం తథ్యమని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

వైసీసీ శిబిరం సైతం బెయిల్ రద్దు తప్పదని, జగన్‌కు వారసత్వ నాయకులెవరు? అనే ప్రశ్నసైతం వెలుగులోకి వచ్చింది. వైఎస్ భారతికే వైసీపీ పగ్గాలు అప్పగిస్తారని ఎన్నికల్లో ఓటమితోనే అభిమానుల్లో అంతర్గత ప్రచారం జరిగింది. ఇదే జరిగితే.. జగన్ లేని లోటును భారతి మాత్రమే పూడ్చాలి. అలా కాకుండా వైఎస్ఆర్ తనయ, జగన్ సోదరి వైపు కార్యకర్తలు పరుగులు పెడితే పరిస్థితి ఏమిటీ? ఈ స్థితిని అడ్డుకునేందుకే జగన్, షర్మిల ఆస్తి గొడవలను తెరమీదకు తీసువచ్చారనే ప్రచారమూ జరుగుతోంది. అన్నా, చెల్లెళ్ల ఆస్తి రగడ కంటే.. అసలు జగన్ కేసులో బెయిల్ రద్దు ఖాయామా? వైసీపీ నాయకత్వ బాధ్యతలు భారతీకే అప్పగిస్తారా? ఈ అంశమే ఏపీలో తీవ్ర చర్చకు దారి తీసింది.

మళ్లీ జైలు జీవితం తప్పదా?

అవినీతి, అక్రమ ఆస్తుల‌ కేసులో 2012లో చంచలగూడ సెంట్రల్ జైలులో 16 నెలలు జైలు జీవితం గడిపిన వైఎస్ జగన్.. 12 ఏళ్లుగా స్వేచ్చా జీవిగా, ఏపీ సీఎంగా ఉన్నారు. సీబీఐ పెట్టిన కేసు విచారణ ఇంత వరకూ ముగియలేదు. ఈ కేసులో జగన్ నిర్దోషిగా బయట పడే అవకాశం ఉందో లేదో ఎవ్వరూ అంచనా వేయలేరు. ఈ విచారణ ఇన్నేళ్లుగా నిలిచిపోవటంతో సుప్రీం కోర్టు కూడా ఈ మధ్య అసహనం వ్యక్తం చేసింది. జడ్జీలు మారారే కానీ.. ఈ కేసు ఓ కొలిక్కిరాలేదు. ప్రస్తుతం కేంద్రంలోనూ.. ఏపీలోనూ రాజకీయంగా జగన్ గడ్డు పరిస్థితిని జ‌గ‌న్‌ ఎదుర్కొంటున్నారు.

సింగిల్ సింహమే.. కానీ..

సింహం.. సింగిల్‌గా వస్తోందంటూ జగన్‌ను వైసీపీ నేతలే రెచ్చగొట్టారు.. ఆ పార్టీ నేతల ఆలోచనను జగన్ అర్థం చేసుకోలేక పోయారు. ప్రస్తుతం ఓటమితో వారంతా మౌన దీక్ష పాటిస్తున్నారు. ఒక్కొక్కరే పరదాల చాటు నుంచి వైదొలుగుతున్నారు. ఒక్క పేర్ని నాని, రోజా తప్పా వైసీపీ అధినేత జగన్ సొంత వ్యవహారమే కాదు.. పార్టీ పరంగా పెదవి విప్పేందుకు ఏ ఒక్క నేత ముందుకు రావడం లేదు. జగన్ వ్యవహారశైలి వల్లే దూరంగా ఉన్నామని కొందరు లీడ‌ర్లు చెబుతున్నారు. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు న్యాయస్థానం ముందు జగన్ హాజరుకాలేదు. అధికారిక కార్యక్రమాలు ఉన్నాయ‌ని తప్పించుకున్నారు. ప్రస్తుతం ప్రతిపక్ష హోదా కూడా లేదు. దీంతో కచ్చితంగా న్యాయస్థానం ముందు హాజరు కావాల్సిందే. దీంతో పాటు బెయిల్ రద్దు కావటం తథ్యమని వైసీపీ శిబిరం ఓ నిర్ణయానికి వచ్చేసింది.

సానుభూతి కోస‌మేనా?

గతంలో చంచల్ గూడ జైలులో ఉన్న జగన్ కోసం.. అటు తల్లి, చెల్లి ఊరూరా తిరిగారు. జనంలో తిరుగులేని సానుభూతిని సంపాదించారు. కానీ, రాజకీయంగా తల్లిని, చెల్లిని జగన్ దూరం చేసుకున్నారు. వారసత్వ రాజకీయాలకు తాను వ్యతిరేకం అని జనానికి చెప్పారు. తాను వదిలిన బాణంగా పేరుతెచ్చుకున్న షర్మిలే.. రివర్స్ అయ్యి వెన‌క్కి దూసుకువచ్చింది. ఆ త‌ర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఒకరకంగా గత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి షర్మిల వ్య‌తిరేక ప్ర‌చారం కూడా కార‌ణంగా పార్టీ లీడ‌ర్లు చెబుతున్నారు. బాబాయి వివేకానంద హత్య కేసును మ‌హాస్త్రంగా తీసుకుని ఏపీ అంతాటా క‌లియ‌దిరిగింది.. ఇక ప్రస్తుతం ఏపీ జనం ముందు అన్నా చెల్లెళ్ల ఆస్తి బంధం చర్చకు వ‌చ్చింది. ఇక్కడ తండ్రి ఆస్తిలో సమాన హక్కు షర్మిల నినాదం కాగా.. తానే చెల్లికి ఆత్మీయాభిమానంతో ఆస్తిని పంచానని జగన్ చెప్పుకోవడం అంతాటా చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

వైఎస్సార్ ఎప్పుడో పంప‌కాలు చేశారు..

అయిదేళ్లుగా వీధికెక్కని కుటుంబ ఆస్తి పేచీ ఇప్పుడెందుకు తెరమీదకు వచ్చిందనే అంశంపై జనం తీవ్ర చర్చ జరుపుతున్నారు. ఆడపిల్లకు సగం ఆస్తి ఇవ్వరా? అని కొందరు ప్రశ్నిస్తే.. ఆస్తి కోసమే రాజకీయాల్లోకి షర్మిల వచ్చిందని జగన్ వర్గీయులు సోషల్ మీడియాలో చెలరేగిపోతున్నారు. కానీ ఈ ఆస్తుల వ్యవహారంతోనే వైసీపీ అధినేతకు ఏ క్షణమైనా బెయిల్ రద్దు అయ్యే అవకాశ ముందని ప్రచారం ఊదరగొడుతోంది. జగన్ కష్టార్జితంతో షర్మిలకు సంబంధం ఏంటని ఒక వర్గం ప్రశ్నిస్తోంది. కుటుంబం ఆస్తులను వైఎస్ఆర్ జీవించిన్నపుడే పంపకాలు చేసేశారని అంటోంది. చెల్లి షర్మిలపై ప్రేమతో సంపాదించిన ఆస్తిలో కొంత ఇస్తున్నారంటూ కొత్త ప్రచారం మొదలుపెట్టేసింది. తన సొంత ఆస్తి అయినప్పుడు జగన్ ఎందుకు టెన్షన్ పడుతున్నారంటూ ప్రత్యర్థుల నుంచి కౌంటర్లు దుమ్మురేపుతున్నాయి.

అంద‌రి ఇండ్ల‌లోనూ ఉన్న‌వే..

ప్రస్తుత ప్రభుత్వం అండతో విజయమ్మను ముందుపెట్టి జగన్‌ను న్యాయపరంగా ఇబ్బంది పెట్టాలని షర్మిల కుట్ర చేస్తున్నారన్నది వైసీపీ శిబిరం ఆరోపణ. గురువారం విజయనగరంలో జగన్ మాట్లాడుతూ, ఆస్తుల వ్యవహారాన్ని సింపుల్‌గా తీసుకున్నారు. ఇలాంటి వ్యవహారాలు అందరి ఇళ్లలో ఉన్నదేనంటూ ప్రజలకు కొత్త సందేశాన్ని ఇచ్చారు. ఇటు వైసీపీలోనూ.. అటు కూటమి వర్గంలోనూ జగన్ కు బెయిల్ రద్దు కావటం ఖాయమనే భావన వ్యక్తమవుతోంది. ఇదే జరుగుతుందని, అందుకే షర్మిలను అన్ పాపులర్ చేయాల్సిన పరిస్థితి జగనన్నకు ఏర్పడిందని జనం ఓ నిర్ధారణకు వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement